Tobacco crisis
-
తగ్గుతున్న నాటు పొగాకు సాగు
ములకలపల్లి: నాటు పొగాకు సాగు క్రమేపీ తగ్గుతోంది. ఒకప్పుడు మండల పరిధిలో ప్రధాన వాణిజ్య పంటగా వేలాది ఎకరాల్లో సాగయ్యేది. ఐతే పెట్టుబడి అధికం కావడం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో దీని సాగుపట్ల రైతులు ఆసక్తి చూపడంలేదు. దీంతో పొగాకు సేద్యం ప్రస్తుతం వందల ఎకరాలకు మాత్రమే పరిమితమయింది. ఆంధ్రా పెట్టుబడిదారుల సహకారంతో.. ఈ పంట సాగుకయ్యే ఖర్చును ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు స్థానికుల ద్వారా రైతులకు పెట్టుబడి పెట్టేవారు. మండలం లో దీని పేరున కోట్లాది రూపాయల టర్నోవర్ జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ పంటకు ధర దక్కకపోవడం మరో ప్రధాన కారణం. పుట్టి పొగాకు (227 కేజీలు) గత ఏడాది 14,100 రూపాయలుగా ఖరారు చేశారు. ఖర్చు లన్నీ పోను రైతు కష్టం కూడా మిగలని పరిస్థితి. పంట దిగుబడికి వాడే పురుగు మందుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, పంట ధర మాత్రం ఏడాదికేడాదికి తగ్గుతుంది. కంటికి రెప్పలా కాపాడినా.. ఆగష్టు మాసంలో నారు కోసం గింజలు వేసింది మొదలు మార్చి, ఏప్రియల్ నెలల్లో పంట పంపిచే వరకూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే. ఈ కాలంలో అకాల వర్షాలు, అనావృష్టి తదితర సమస్యలు వస్తే పంట దిగుబడి అనూహ్యంగా తగ్గిపోతోంది. పంట కోసిన తరువాత పందిళ్లపై ఆరబెట్టిన సమయంలో కూడా వర్షంలో తడిస్తే, పంటరేటు తగ్గిస్తారు. మిగతా పంటలు కల్లాల్లో ఉండగానే ఖరీదు చేస్తారు. ధర చెల్లించే పద్ధతి మరీ దారుణం.. నాటు పొగాకు సాగు చేసే రైతులది చిత్రమైన పరిస్థితి. పందిళ్లమీద పంటను లారీల్లో లోడు చేసి ఆంధ్రాప్రాంతాలకు మార్చి, ఏప్రిల్ నెలల్లో పంపి స్తారు. ఐతే జూలై, ఆగష్టు నెలల్లో వీటి ధర ప్రకటిస్తారు. సదురు పెట్టుబడిదారులకు అనుకూలంగా పుట్టిధరను నిర్ణయిస్తారు. ఆరంభం నుంచి రైతుకిచ్చిన పెట్టుబడిపోగా మిగతావి విడతలవారీగా రైతులకు ఇస్తారు. దీంతో రైతు కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు లభిస్తుందో కూడా తెలియని దుస్థితి. ఇలాంటి విచిత్ర పరిస్థితులతో భవిష్యత్తులో ఈ పంట సాగు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇక మిగిలింది 48 గంటలే...
కొనాల్సింది 18 మిలియన్ కేజీలు మంత్రి మాట సెప్టెంబర్ నెలాఖరుకల్లా మొత్తం 172 మిలియన్ కిలోల పొగాకు కొంటాం. అదనంగా పండిన పొగాకును కూడా కొనుగోలు చేస్తాం. ఈ నెల 18న జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర వాణిజ్య శాఖామంత్రి నిర్మలాసీతారామన్ పొగాకు రైతులకు ఇచ్చిన హామీ. నీటి మూట మంత్రి హామీతో కొనుగోళ్లు ఊపందుకుంటాయనుకున్నారు. ఆమె వచ్చి రైతులను పరామర్శించి వెళ్లి పది రోజులు దాటిపోయింది. గిట్టుబాటు ధర ఇంకా ఎగతాళి చేస్తూనే ఉంది. గడువు ఇంకా రెండు రోజులే ఉంది. - కేంద్ర మంత్రి హామీ నత్తనడక - కొనసాగుతున్న పొగాకు సంక్షోభం - జగన్ హుంకరిస్తే కాస్తా జరిగింది - సీఎం చంద్రబాబుదీ ప్రేక్షకపాత్రే కదలిక బుధవారం జిల్లాకు జగన్మోహన్రెడ్డి రానున్నారన్న వార్త తెలిసిన బాబు సర్కార్.. సోమవారం కొంతమేర ధర పెంచి కొనుగోళ్లు జరిపారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పొగాకు సంక్షోభం రైతుల్లో కాటేస్తూనే ఉంది. వరుసగా విషాదాలు చోటుచేసుకోవడంతో పది రోజుల కిందట కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హడావుడిగా ఒంగోలు వచ్చి నిరసనల మధ్యనే బాధితులను పరామర్శించారు. అదే రోజు సీఎం చంద్రబాబు సమక్షంలో సమీక్ష నిర్విహంచి హామీలు గుప్పించినా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తక్కువ రకం పొగాకు విక్రయం తయారైంది. ఇంకా 18 మిలియన్ కిలోలకుపైగా పొగాకు రైతుల వద్ద ఉండిపోయింది. ఇది కాకుండా అనధికారికంగా పండిన మరో 15 నుంచి 20 మిలియన్ కిలోల పొగాకు కూడా రైతుల వద్దే ఉంది. ఇంకా మిగిలిన రెండు రోజుల్లో ఈ మొత్తాన్ని ఎలా కొనుగోలు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నవుతున్నాయి. ఈ దశలో రైతులకు అండగా ఈ నెల 30న టంగుటూరు వేలం కేంద్రం ఎదుట వైఎస్ జగన్ ధర్నా చేయనున్నారన్న వార్తతో సోమవారం కొంతమేర ధర పెంచి కొనుగోళ్లు జరిపారు. ఇప్పటికి కొనుగోలు చేసంది 142 మిలియిన్ కిలోలే... ఈ నెల 18న మంత్రి పర్యటన జరిగే సమయానికి 172 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి వరకూ 142 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలు చేశారు. ఈ నెలాఖరుకల్లా పూర్తిగా కొనుగోలు చేస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. అయితే మంత్రి హామీ అమలుకు నోచుకోలేదు. ఈ నెల 24 వరకూ 150.8 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోలయింది. ఈ రెండు రోజుల్లో మరో రెండు మూడు మిలియన్ కిలోలకు మించి అమ్ముడు పోలేదు. అంటే ఇంకా సుమారు 18 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలు చేయాల్సి ఉంది. సోమవారం కూడా జిల్లాలో మొత్తం ఏడు వేలం కేంద్రాల్లో 6,335 బేళ్లను రైతులు తీసుకురాగా అందులో 1940 బేళ్లు అమ్ముడుపోలేదు. 1416 బేళ్లను నో బిడ్ చేశారు. మొత్తం 4395 బేళ్లు అమ్ముడుపోయాయి. మొత్తం మీద ఐదు లక్షల కిలోలు కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉంది. ధర కూడా లోగ్రేడ్కు రూ.59 ఏవరేజీ వచ్చింది. ఇంకా రెండు రోజుల్లో మొత్తం పొగాకును ఎలా కొనుగోలు చేస్తారన్నదానికి బోర్డు అధికారుల నుంచి సమాధానం లేదు. వాణిజ్య మంత్రి జిల్లాకు వచ్చిన రోజునుంచి అమ్మిన పొగాక్కి కేజీకి రూ.20 కలుపుతామని ప్రకటించినా ఇంత వరకు అధికారికంగా బోర్డుకు ఉత్తర్వులు రాలేదు. 90 శాతం పొగాకు అమ్ముకున్నాక చివరి అమ్మకాలకు కలిపినా రైతుకు ప్రయోజనం శూన్యమని రైతులు ధ్వజమెత్తుతున్నారు.