సాక్షి, విశాఖపట్నం: ‘‘వర్షాల్లేవు.. ప్రాజెక్టుల్లో చాలినంత నీళ్లు లేవు.. రైతులు పంటలు వేస్తే లాభంలేదని భావించి స్వచ్ఛందంగా క్రాప్‌హాలిడే ప్రకటిస్తున్నారు. నీళ్లు లేవు.. వారు మాత్రం ఏం చేస్తారు. వారు చేస్తున్న దాంట్లో తప్పేమీలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడ విశాఖ కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కరువును సమర్థంగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు. ‘‘గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ర్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
దీనిపై అన్నివిధాలా మానిటరింగ్ చేస్తున్నాం.. ఉన్న పంటల్ని కాపాడేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా పంటల్ని కాపాడేందుకు ట్యాంకర్లద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ముఖ్యంగా రెండు మూడు తడులు పెడితే పంట చేతికొచ్చే పండ్ల తోటల్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాం. అలాగే పశువుల ఆహారభద్రతకు ప్రత్యేకంగా రూ.250 కోట్లు కేటాయించాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని అన్నారు.
నీళ్లు లేకపోవడంతో పంటలు వేసుకునేందుకు రైతులు ముందుకు రావట్లేదని, వారికోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ‘మీ ఇంటికి-మీ భూమి’ తొలివిడత పూర్తయిందని.. వచ్చిన అర్జీల్ని మూడుదఫాలుగా పరిశీలిస్తారని తెలిపారు. రికార్డులు తారుమారు చేయడంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.
చక్కెర ఫ్యాక్టరీల ఆధునికీకరణకు చర్యలు..
రాష్ర్టంలో చక్కెర ఫ్యాక్టరీల ఆధునికీకరణ.. అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు కొరియన్ పారిశ్రామిక ప్రతినిధులు విశాఖకు రానున్నారన్నారు. అలాగే జనవరిలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు విశాఖలో జరుగనుందని, దీనికి 70 దేశాలనుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారని తెలిపారు.
విశాఖ మెట్రో ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యిందని. శ్రీధరన్ కమిటీ తుది రిపోర్టు ఇవ్వనున్నారని. 2018లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో రుణ మాఫీ పేరిట రూ.వెయ్యికోట్ల అవకతవకలు జరిగినట్టు ఆ రాష్ర్టమంత్రి ప్రకటించారని, కానీ మనరాష్ర్టంలో అర్హులైన ప్రతిఒక్కరికీ మాఫీ అయ్యేలా మూడువిడతల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేశామని చెప్పుకొచ్చారు.
క్రాప్ హాలిడేలో తప్పు లేదు
Published Mon, Sep 7 2015 1:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement