Vishakha Collecterate
-
క్రాప్ హాలిడేలో తప్పు లేదు
సాక్షి, విశాఖపట్నం: ‘‘వర్షాల్లేవు.. ప్రాజెక్టుల్లో చాలినంత నీళ్లు లేవు.. రైతులు పంటలు వేస్తే లాభంలేదని భావించి స్వచ్ఛందంగా క్రాప్‌హాలిడే ప్రకటిస్తున్నారు. నీళ్లు లేవు.. వారు మాత్రం ఏం చేస్తారు. వారు చేస్తున్న దాంట్లో తప్పేమీలేదు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడ విశాఖ కలెక్టరేట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కరువును సమర్థంగా ఎదుర్కొంటామని ఆయన చెప్పారు. ‘‘గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ర్టంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై అన్నివిధాలా మానిటరింగ్ చేస్తున్నాం.. ఉన్న పంటల్ని కాపాడేందుకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా పంటల్ని కాపాడేందుకు ట్యాంకర్లద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ముఖ్యంగా రెండు మూడు తడులు పెడితే పంట చేతికొచ్చే పండ్ల తోటల్ని కాపాడేందుకు చర్యలు చేపట్టాం. అలాగే పశువుల ఆహారభద్రతకు ప్రత్యేకంగా రూ.250 కోట్లు కేటాయించాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని అన్నారు. నీళ్లు లేకపోవడంతో పంటలు వేసుకునేందుకు రైతులు ముందుకు రావట్లేదని, వారికోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ‘మీ ఇంటికి-మీ భూమి’ తొలివిడత పూర్తయిందని.. వచ్చిన అర్జీల్ని మూడుదఫాలుగా పరిశీలిస్తారని తెలిపారు. రికార్డులు తారుమారు చేయడంలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. చక్కెర ఫ్యాక్టరీల ఆధునికీకరణకు చర్యలు.. రాష్ర్టంలో చక్కెర ఫ్యాక్టరీల ఆధునికీకరణ.. అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు కొరియన్ పారిశ్రామిక ప్రతినిధులు విశాఖకు రానున్నారన్నారు. అలాగే జనవరిలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు విశాఖలో జరుగనుందని, దీనికి 70 దేశాలనుంచి ప్రతినిధులు హాజరు కాబోతున్నారని తెలిపారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు ఫైనలైజ్ అయ్యిందని. శ్రీధరన్ కమిటీ తుది రిపోర్టు ఇవ్వనున్నారని. 2018లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో రుణ మాఫీ పేరిట రూ.వెయ్యికోట్ల అవకతవకలు జరిగినట్టు ఆ రాష్ర్టమంత్రి ప్రకటించారని, కానీ మనరాష్ర్టంలో అర్హులైన ప్రతిఒక్కరికీ మాఫీ అయ్యేలా మూడువిడతల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేశామని చెప్పుకొచ్చారు. -
విశాఖకు ఐబీఎం సీఎస్ఆర్ సేవలు..
సాక్షి, విశాఖపట్నం: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 16 నగరాలను ఎంపిక చేసుకుని ఆయా నగరాల్లో వివిధ అంశాల్లో చేయూతనివ్వాలని నిర్ణయించినట్టు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఐబీఎం సీఎస్ఆర్ (ఇండియా) హెడ్ మమతాశర్మ అన్నారు. బుధవారం ఆమె విశాఖ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ భారత్‌లో విశాఖతో సహా సూరత్, అలహాబాద్‌లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నందున. ఈ మూడు నగరాల్లో సీఎస్ఆర్ కింద సహకారం అందించాలని నిర్ణయించామన్నారు. సూరత్‌లో నూరు శాతం సౌరసేవలు, అలహాబాద్‌లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, విశాఖలో డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో సీఎస్ఆర్ నిధులను వెచ్చించి అవసరమైన సాంకేతిక, నైపుణ్యతను ఐబీఎం అందజేస్తుందన్నారు. విశాఖలో తుపాన్లు ఎదుర్కొనే ప్రణాళికలను ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి రూపొందించి అందిస్తామన్నారు. ఇందుకోసం విపత్తులను అధ్యయనం చేయడంలో అనుభవం గల అంతర్జాతీయ స్థాయినిపుణులను విశాఖకు రప్పించి ఇక్కడి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి జిల్లా యంత్రాంగాన్ని అందిస్తా మన్నారు. ఇందుకయ్యే ఖర్చునంతటినీ తమ సంస్థ భరిస్తుందన్నారు. ఈ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా జిల్లా యంత్రాంగంతో పాటు విశాఖ నగరంలోని పలు వర్గాల వారితో చర్చించి నివేదిక తయారుచేస్తామన్నారు.