
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లోని దేవాదాయ, సర్వీస్ ఇనాం, అసైన్డ్ భూములే కాకుండా వెట్టి నుంచి విముక్తి కల్పించిన కార్మికులకు ఇచ్చిన భూముల్ని కూడా ప్రైవేట్ సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరిట అధికారులు రిజిస్ట్రేషన్లు చేసేశారనే వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
రెండు జిల్లాల్లోని కోట్లాది రూపాయల విలువైన నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సోలార్ పవర్ ప్రాజెక్టుల పేరిట రిజిస్ట్రేషన్లు చేసేశారని పాలమూరు వలస కూలీల సంఘం ఈ పిల్‌ను దాఖలు చేసింది. దీనిని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల విచారించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 5కి వాయిదా వేసింది.
ఈ మొత్తం భూ బాగోతంపై సీబీఐతో దర్యాప్తునకు ఆదేశించాలని, లేనిపక్షంలో న్యాయవిచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రైవేటు వ్యక్తుల భూములుగా పేర్కొంటూ ప్రభుత్వ భూముల్ని రిజిస్ట్రేషన్లు చేశారని పేర్కొన్నారు. ఈ భూ బాగోతం వెనుక ఆ రెండు జిల్లాల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల హస్తం ఉందన్నారు. తప్పుడు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగేందుకు అధికారులు సోలార్ పవర్ కంపెనీలకు పూర్తిగా సహకరించారని వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment