తహశీల్దార్ కార్యాలయంలో ఇంటి దొంగలు..!
- తహశీల్దార్ సంతకం ఫోర్జరీ
- 16 సెంట్ల భూమి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
- కంప్యూటర్ ఆపరేటర్లకు సహకరించిన తలారీలు
- చక్రం తిప్పిన టీడీపీ మాజీ కార్పొరేటర్
కర్నూలు: కర్నూలు తహశీల్దార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది. నకిలీ సర్టిఫికెట్లు మంజూరు చేయడం..ఒక వ్యక్తి పొలం ఇంకో వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం...ఇవే కాకుండా మిగులు భూమిని ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయడం ఇక్కడ సిబ్బందికే చెల్లింది. కర్నూలు సమీపంలోని జొహరాపురం గ్రామంలో 16 సెంట్ల స్థలం వివాదంగా మారింది. ఈ స్థలం పేరు మీద నలుగురు వ్యక్తులు పట్టాలు పుట్టించుకున్నారు. దీంతో రెవెన్యూ శాఖ వారు దాన్ని మిగులు భూమిగా ప్రకటించారు.
తహశీల్దార్ కార్యాలయంలో కొందరు సిబ్బంది..ఈ భూమిపై కన్నేశారు. కర్నూలు నగరానికి చెందిన సువర్ణభాయ్ అనే మహిళ పేరుమీద ఆన్‌లైన్‌లో ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయించారు. సబ్‌రి జిస్ట్రేషన్ కార్యాలయంలో డాక్యుమెంటేషన్ చేస్తుండగా.. విషయం బయటకి వచ్చింది. తహశీల్దార్ సంతకాన్ని వీరు ఫోర్జరీ చేసినట్లు తేలింది. ఈ వ్యవహారంలో టీడీపీ మాజీ కార్పొరేటర్ పాత్ర ఉన్నట్లు తేలింది. నిందితులుగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు కిరణ్, బాష, రాజేష్ తదితరులను బుధవారం వరకు సస్పెండ్ చేసినట్లు తహశీల్దార్ రమేష్‌బాబు తెలిపారు.
కంప్యూటర్ ఆపరేటర్‌పై కేసు నమోదు
కర్నూలు తహశీల్దార్ కార్యాలయంలో ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న బాషాపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. కర్నూలు శివారుల్లోని నందికొట్కూరు రోడ్..యెల్కూరు ఎస్టేట్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలానికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడంలో ఆ ఆపరేటర్ సహకరించాడని కర్నూలు తహశీల్దార్ వెంకటరమేష్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు మూడో పట్టణ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు.
కర్నూలు నగరానికి చెందిన సువర్ణబాయి, సతీష్‌కుమార్, అనసూయ తదితరులు యెల్కూరు ఎస్టేట్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అందుకు సంబంధించిన నకిలీ అడంగల్, డాక్యుమెంట్లు సృష్టించుకున్నారు. రెవన్యూ రికార్డుల్లో పేర్లు మార్చేందుకు కంప్యూటర్ ఆపరేటర్ బాషా సహకరించినందున ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
అక్రమాలకు ఉద్యోగుల సహకారం
స్థలాన్ని ఆక్రమించండంలో నిందితులకు తహశీల్దార్ కార్యాలయ ఉద్యోగులే సహకరించినట్టు సమాచారం. నగరంలో, రూరల్ ప్రాంతాల్లో ఉన్న భూములను సర్వే పేరుతో వెళ్లి మిగులు భూములను ఆక్రమించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రే ఆ మిగులు భూమిపై ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇందులో తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న ఆర్‌ఐ సహకారం ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి.
అలాగే టీడీపీ మాజీ కార్పొరేట్ చక్రం తిప్పినట్లు సమాచారం. సదరు ఆర్‌ఐపై గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. బుధవారపేటలో ఒక మహిళకు తప్పుడు సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆ మహిళ తహశీల్దార్ కార్యాలయం ఎదుట గతంలో ధర్నా చేపట్టింది. జగన్నాథగట్టుపై అర్హలకు ఇళ్లు ఇవ్వకుండా అనర్హులకు, తమ బంధువులకు ఇళ్లు ఇచ్చారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి.