అవ్‌ మల్లన్నా | Mallnna au | Sakshi
Sakshi News home page

అవ్‌ మల్లన్నా

Published Sun, Jul 31 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

అవ్‌ మల్లన్నా

అవ్‌ మల్లన్నా

  • ప్రాజెక్టుకుమార్గం సుగమం!
  •   భూములిచ్చేందుకు రైతుల అంగీకారం
  •  ఒక్కొక్కటిగా ముందుకొస్తున్న ముంపు గ్రామాలు
  • వేములఘాట్‌ మినహా అన్ని పల్లెలు ఓకే
  •  తాజాగా సరేనన్న సింగారం
  •   మంత్రి హరీశ్‌ మాటలే భరోసా అంటున్న జనం
  • ఇప్పటి వరకు 3,067 ఎకరాలు రిజిస్ట్రేషన్‌
  • సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:నిన్నటి దాకా కంటి మీద కునుకు లేదు.. ఎవరిని పలకరించినా పుట్టి పెరిగిన ఊరిని పోగొట్టుకుంటున్నామన్న దిగులు.. ఆ ఆవేదనతో పిడికిళ్లు బిగించి పోరుబాట.. అదే జనం నేడు ‘ఊరునిస్తాం.. తీసుకోండి’ అంటున్నారు. లక్ష్మీపూర్‌.. బంజేరుపల్లి.. ఏటిగడ్డ కిష్టాపూర్‌.. పల్లెపహాడ్‌.. ఎర్రవల్లి.. తాజాగా సింగారం.. ఇలా ఒక్కో పల్లె త్యాగానికి సిద్ధమవుతోంది.మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుకు భూసేకరణలో ఎదురైన అవరోధాలు ఒక్కొక్కటే తొలగిపోతున్నాయి. ప్రాజెక్టుకు పునాదిగా నిలుస్తామంటూ ముంపు గ్రామాలు ముందుకొస్తున్నాయి.

    ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే 7 గ్రామాల్లో.. 5 గ్రామాల ప్రజలు భూములు, ఇళ్లు ఇవ్వడానికి అంగీకరించారు. నిన్నటి వరకు ఏ టెంటు కింద భూసేకరణకు ససేమిరా అన్నారో.. నేడు అదే టెంటు కింద  తమ భూములను ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ చేస్తూ సంతకాలు చేస్తున్నారు. ప్రాజెక్టు కింద మొత్తం 7,613 ఎకరాల పట్టా భూములు సేకరించాల్సిఉండగా, 3,067 ఎకరాలను ఇప్పటి వరకు సర్కారుకు అప్పగించారు.
    సేక‘రణా’నికి తెర..
    గోదావరి నదిపై కాళేశ్వరం కింద 50 టీఎంసీలతో నిర్మిస్తున్న కొమరవెల్లి మలన్నసాగర్‌ ప్రాజెక్టు కోసం తొగుట మండల గ్రామాల్లో  చకచకా భూసేకరణ జరుగుతోంది. లక్ష్మీపూర్, బంజేరుపల్లి, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, ఎర్రవల్లి గ్రామస్తులు తమ భూముల్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. వివిధ పార్టీలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా.. ముంపు గ్రామాల రైతులు మాత్రం భూసేకరణకు అనుకూలంగా మారుతున్నారు.

    2013 భూ సేకరణ చట్టంపై కూడా వారు ఆసక్తి చూపించటం లేదు. భూములు కోల్పోయి మళ్లీ కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేదని రైతులు అంటున్నారు. ఎలాగు ప్రభుత్వం ప్రాజెక్టు కట్టాలనే దఢ నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో ఉద్యమాలు అనవసరమనే ఆలోచనకు వస్తున్నారు. ‘కొట్లాడి దుష్మన్‌ అయ్యే బదులు మంచిగ ఉండి సర్కారు చేత నాలుగు పనులు ఎక్కువ  చేయించుకుంటం’ అని ఏటిగడ్డ కిష్టాపూర్‌కి చెందిన ఆంజనేయులు అన్నాడు. 123 జీఓ ఉత్తర్వుల ద్వారా నిర్ణయించిన ధర 15–30 రోజుల్లో చేతికి అందటం, ప్రాజెక్టు నిర్మాణంతో పాటే ముంపు గ్రామాన్ని పోలిన కొత్త గ్రామాన్ని నిర్మించి ఇస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇస్తున్న హామీ.. ముంపువాసులకు భరోసానిస్తోంది.
     ఉద్యమం చేసిన ఊరే..
    ముంపు వ్యతిరేక ఉద్యమానికి ముందు బీజం పడిన ఊరు ఏటిగడ్డ కిష్టాపూర్‌. ఈ ఊరును ఆదర్శంగా తీసుకొని మిగిలిన ఊళ్లు కూడా పోరుబాట పట్టాయి. ఇప్పుడు ఇదే ఊరు భూముల రిజిస్ట్రేషన్‌లో అందరి కంటే ముందుంది. ఇక్కడ మొత్తం 850 మంది పట్టా, 275 అసైన్డ్‌ భూములున్న రైతులున్నారు. 1,592 ఎకరాల పట్టా భూమి సాగులో ఉంది. ఇందులో 650 మంది రైతులు 1,150 ఎకరాలను ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌∙చేశారు. మిగిలిన భూమిని వారంలోగా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటామని తొగుట తహసీల్దారు దేశ్యా నాయక్‌ తెలిపారు. మంత్రి హరీశ్‌రావు మాట మీద భరోసాతోనే ఊరును త్యాగం చేస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు.

    ఊరుకు ఊరు కట్టిస్తా..

    నా మాటపై నమ్మకం ఉంచి త్యాగానికి సిద్ధమైన రైతులకు వందనం. ముంపు ఊరుకు బదులు ఊరును కట్టిస్తాం. వాళ్లను కడుపులో పెట్టుకొని చూసుకుంటా. ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టకుంటా. సాధారణ బైనామాలను పట్టా చేయటం, డాక్యుమెంట్లు సరిచూసుకోవడం, గతంలో రైతులకు అసైన్డ్‌ చేసిన భూముల్లో చిన్నచిన్న వివాదాలు తదితర కారణాలతో రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతున్నాయి. రోజుకు 60 నుంచి వంద ఎకరాల కంటే ఎక్కువ భూమి రిజిస్ట్రేషన్‌ చేసుకోలేకపోతున్నాం. కొంత ఆలస్యమైనా సరే ఎలాంటి వివాదాలు లేకుండా,  రైతులకు అన్యాయం జరగకుండా భూమి రిజిస్ట్రేషన్‌ జరగాలని అధికారులను ఆదేశించాను. -హరీశ్‌రావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి

    తొలి సంతకం నాదే..
    నాకున్న రెండు ఎకరాలు. మల్లన్నసాగర్‌కు అందరి కంటే ముందు రిజిస్ట్రేషన్‌ చేసిన. రైతుకు ఎంత కష్టం ఉందో నాకు తెలుసు. నీళ్లు వస్తయి అంటున్నారు. నా పంట భూమి మునిగినా రైతు బతుకుతడనే ఆలోచించి మొదటి సంతకం పెట్టిన.రైతులు బాగుపడతరు..

    – నేవూరి నర్సింహారెడ్డి, తిరుమలగిరి
    నాకు నాలుగు ఎకరాలున్నాయి. సాగు చేస్తే అప్పులే మిగిలాయి. అయినా భూమి మీద ఆశపోకున్నా అందరితో పాటు భూమిని వదులుకున్నా.. ప్రాజెక్టు నీళ్లొస్తే మిగిలిన రైతులైనా బాగుపడతరేమో చూడాలె.– మన్నెం కిష్టారెడ్డి, ఎర్రవల్లి, కొండపాక మండలం
     మంత్రి మాటపై గురి ఉంచిన..

     మంత్రి హరీశ్‌రావుపై నమ్మకంతో ఏడెకరాల భూమిని మల్లన్నసాగర్‌కు ఇచ్చినం. ఇక నీళ్ల ముంచిన..పాల ముంచిన ఆయనదే భారం.  ఇన్నాళ్లు సాగు నీరు లేక రైతులు ఉరిబెట్టుకొని సచ్చిపోయిండ్రు. నా ఏడెకరాల భూమి 700 ఎకరాలకు నీళ్లియ్యాల..– వంజరి సరోజన, మహిళా రైతు, ఏటిగడ్డ కిష్టాపూర్‌

    ఊరు నిర్మిస్తామన్నారు..

    సాగు భూములకు పరిహారంతో పాటు గ్రామానికి గ్రామం నిర్మించి ఇస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో నా మూడెకరాలు ఇచ్చాను. తిరిగి గ్రామస్తలందరికీ ఓకేచోట ఆవాసం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సంతోషం.– పోకల బాల్‌రాజు, లకా్ష్మపూర్‌

    మల్లన్నసాగర్‌ భూ రిజిస్ట్రేషన్‌ ఇలా (పట్టా, అసైన్డ్‌ భూమి ఎకరాల్లో)

    గ్రామం             రైతులు     పట్టా        అసైన్డ్‌
    ఎల్లారెడ్డిపేట         86        65        70
    తుక్కాపూర్‌        445        240        286
    తొగుట            954        1180        490
    ఏటిగడ్డకిష్టాపూర్‌    780        1150        250
    పల్లెపహాడ్‌        వివరాలు అందలేదు
    లక్ష్మీపూర్‌            వివరాలు అందలేదు
    బంజేరుపల్లి         వివరాలు అందలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement