
భూమికోసం పిల్లలను హత్య చేసిన తండ్రి
బీబీనగర్: భూమి రిజిస్ట్రేషన్‌కు అడ్డుగా ఉన్నారనే నెపంతో ఓ తండ్రి తన కూతురు, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో జరిగింది. కనగల్ మండలం బచ్చన్నగూడెంకు చెందిన కోయ కృష్ణారెడ్డి, అతడి సోదరుడు దామోదర్‌రెడ్డి వారసత్వ భూమిని పంచుకోవాలని అనుకున్నారు. కానీ దామోదర్‌రెడ్డితో సహా కుటుంబ సభ్యులు కృష్ణారెడ్డి పేరుపై కాకుండా అతడి పిల్లలు రవళి(11), విత్తీష్(8)లపై భూమిని రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడంతో ఒప్పుకున్నాడు. దీంతో రిజిస్ట్రేషన్ చేయిస్తానని శనివారం పిల్లలను తీసుకొని వెళ్లాడు.
అనంతరం రిజిస్ట్రేషన్ చేయించకుండానే తన హోటల్‌కు వెళ్లాడు. ఆదివారం ఇద్దరు పిల్లలకు తొలుత విషం ఇచ్చి, అనంతరం బండకేసి కొట్టి హత్య చేశాడు. కృష్ణారెడ్డి ఇంటికి రాకపోవడంతో భార్య, బంధువులు సోమవారం హోటల్ వద్దకు వచ్చారు. వారి అలికిడిని గుర్తించిన కృష్ణారెడ్డి.. పురుగులమందు తాగాడు. షట్టర్‌ను పగులగొట్టి చూడగా ఇద్దరు చిన్నారులు రక్తపుమడుగులో కనిపించారు. కృష్ణారెడ్డిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.