
వాషింగ్టన్: ముందుగా వెల్లడించినట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఫేక్ న్యూస్ అవార్డులు’ ప్రకటించారు. ప్రముఖ దినపత్రిక ‘ద న్యూయార్క్ టైమ్స్’కు ఫేక్ న్యూస్ అవార్డు ప్రకటించారు. అలాగే, ఏబీసీ న్యూస్, సీఎన్‌ఎన్, టైమ్, ద వాషింగ్టన్ పోస్ట్ తదితర మీడియా సంస్థలను కూడా విజేతలుగా ప్రకటించారు. ఇలా ట్రంప్ తనదైన శైలిలో అవార్డులు ప్రకటిస్తూ.. ఆ వివరాలు జీవోపీ.కామ్‌లో పొందుపరిచారు. దీని గురించి ట్వీట్ చేసిన వెంటనే ఆ వెబ్‌సైట్ క్రాష్ అయింది. పాత్రికేయ రంగంలో తాను గౌరవించే ఎంతో గొప్పమంది జర్నలిస్టులు ఉన్నారు కానీ, మీడియా ఇప్పుడు అవినీతి, కపటబుద్ధితో కథనాలు రాస్తున్నదని ట్రంప్ మరో ట్వీట్‌లో మండిపడ్డారు.
‘2017లో పక్షపాతబుద్ధితో ఏమాత్రం పారదర్శకత లేకుండా అథమస్థాయిలో బూటకపు కథనాలు వెలువడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా 90శాతం ప్రతికూల కథనాలు వెలువడ్డాయి’అని జీవోపీ.కామ్ వెబ్‌సైట్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రాత్మక విజయం సందర్భంగా.. దేశ ఆర్థిక వ్యవస్థ ఇక కోలుకోలేదంటూ పాల్ క్రుగ్‌మన్ రాసిన కథనానికిగాను ’ద న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు ఫేక్ అవార్డుల్లో ప్రథమ బహుమతి ప్రకటించగా.. తప్పుడు కథనాలతో మార్కెట్‌ను దెబ్బతీసినందుకు ఏసీబీ న్యూస్‌కు (బ్రియాన్ రాస్ కథనానికి) దిత్వీయ బహుమతిని, వీకీలీక్స్ పత్రాల యాక్సెస్ ట్రంప్‌కు, ఆయన తనయుడికి ఉందంటూ కథనం ప్రసారంచేసినందుకు సీఎన్‌ఎన్‌కు తృతీయ బహుమతిని ట్రంప్ ప్రకటించారు. ఒవల్ కార్యాలయంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అర్ధవిగ్రహాన్ని తొలగించారని కథనం ప్రచురించినందుకు ‘టైమ్’ మ్యాగజీన్‌కు నాలుగో స్థానం కట్టబెట్టగా.. ఫ్లోరిడాలోని పెన్సాకోలాలో ట్రంప్ నిర్వహించిన భారీ ర్యాలీలో జనం లేరంటూ ప్రచురించిన ‘ద వాషింగ్టన్ పోస్ట్’కి చివరిస్థానం కేటాయించారు. తన హయాంలో మీడియా కపటబుద్ధితో వ్యవహరిస్తూ నిజాలను ప్రజలకు తెలియజేయడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.