హారిస్‌కు మద్దతు పలకొద్దని వార్తాసంస్థను ఆదేశించిన కొత్త యజమాని జెఫ్ బెజోస్
ట్రంప్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బెజోస్‌పై ఆరోపణలు
దీంతో నిరసనగా తమ చందా సభ్యత్వాన్ని రద్దుచేసుకున్న 2,00,000 మంది చందాదారులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతు పలకాలని గత వారం ‘వాషింగ్టన్ పోస్ట్’వార్తాసంస్థ తీసుకున్న నిర్ణయం తాజాగా ఆ సంస్థ సర్కులేషన్‌కు ఎసరుపెట్టింది. హారిస్‌కు మద్దతు పలుకుతున్నట్లు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ‘తటస్థ’వైఖరిని అవలంభించాలని సంస్థను ఇటీవల కొనుగోలుచేసిన ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తాజాగా ఆదేశించడమే ఇందుకు అసలు కారణం.
అసలేం జరిగింది?
కమలా హారిస్‌కు మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పత్రిక ఎడిటోరియల్ సిబ్బంది గత వారం ప్రకటించారు. ఇది నచ్చని యజమాని, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వెంటనే రంగంలోకి దిగారు. ‘అధ్యక్ష అభ్యర్థికి మద్దతు పలకడం అనేది పక్షపాత భావనను సృష్టిస్తుంది. ఇది పాఠకుల ఆలోచనా స్వాతంత్య్రాన్ని పోగొట్టడమే అవుతుంది. అందుకే అధ్యక్ష అభ్యర్థులకు మద్దతు పలికే సంప్రదాయాన్ని అంతం చేయాలని కోరుకుంటున్నా. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, నాకు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ సీఈఓ డేవ్ లింప్ మధ్య అక్టోబర్ 25న భేటీ జరిగింది. అయితే ఈ భేటీకి వాషింగ్టన్‌పోస్ట్ హారిస్‌కు మద్దతు ఇవ్వకూడదన్న నిర్ణయానికి సంబంధం లేదు. ఇది ఉద్దేశపూర్వక వ్యూహం కాదు.
ఇక్కడ ఏ విధమైన క్విడ్ ప్రోకో జరగలేదని స్పష్టం చేయదల్చుకున్నా’’అని వ్యాఖ్యానించారు. దీంతో బెజోస్ ఆదేశాలను శిరసావహిస్తూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురణకర్త విల్ లూయిస్ తాజాగా ఒక ప్రకటన విడుదలచేశారు. ‘ఏ అభ్యర్థికి ఓటేయాలనే విచక్షణా సామర్థ్యం అమెరికా ఓటర్లయిన మా పాఠకులకు ఉంది’ అని అందులో పేర్కొన్నారు. దీంతో సోమవారం 2 లక్షల మంది చందాదారులు వాషింగ్టన్‌పోస్ట్ సభ్యత్వాన్నిరద్దుచేసుకున్నారు. ఇది సంస్థ ప్రింట్, డిజిటల్ సర్కులేషన్‌ల 8 శాతానికి సమానం. ఈ సంఖ్య మరింతపెరిగే వీలుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కమలా హారిస్‌కు మద్దతుపలికే చందాదారులే తమ సబ్‌స్క్రిప్షన్‌ను వదులుకున్నట్లు వార్తలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం లాస్ ఏంజిల్స్ టైమ్స్ సైతం ఏ అభ్యర్థికీ మద్దతు ప్రకటించకూడదని నిర్ణయించింది.
అభ్యర్థికి పత్రిక ఆమోదం ఎందుకు?
అధ్యక్ష అభ్యర్థులను సమర్థించే వార్తాపత్రిక ఎడిటోరియల్ పేజీల సంప్రదాయం అమెరికాలో శతాబ్దానికి పైగా ఉంది. వార్తా పత్రికలు తాము విశ్వసించే అభ్యర్థిని సమర్థించడం ద్వారా సమాచారంతో కూడిన ఓటింగ్‌ను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాయి. మద్దతు పలకడం అనగానే ఆ వార్తాసంస్థ ఆ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తోందని కాదు. పత్రిక పాత్రికేయ విలువలకు కట్టుబడి పనిచేస్తూనే నిష్పాక్షిక కవరేజీని అందిస్తాయి.
ఆ అభ్యర్థి ఏరకంగా అధ్యక్ష పదవికి అర్హుడో వాస్తవకోణంలో తెలియజేయస్తాయి. ఓటేసేటపుడు ఏది ఉత్తమ నిర్ణయమో పాఠకులకు తెలియజేయడం ఈ మద్దతు అంతిమ లక్ష్యం. అనేక వార్తాపత్రికలకు అభిప్రాయాలు, మద్దతును ప్రకటించేందుకు ప్రత్యేకంగా ఎడిటోరియల్ బోర్డ్‌లు ఉన్నాయి. భారత్‌లో ఇలాంటి సంప్రదాయం లేదు. కానీ అనధికారికంగా కొన్ని వార్తాపత్రికలు, టీవీ చానళ్లు తాము మెచ్చిన అభ్యర్థి/రాజకీయ పార్టీకి అనుకూలంగా అత్యధిక కవరేజీ ఇచ్చే ధోరణి మాత్రం భారత్‌లో బాగా పెరిగింది.
ఏ ప్రాతిపదికన సమరి్థస్తారు?
అభ్యర్థి గెలిచి అధ్యక్షుడయ్యాక పరిపాలన ఎలా ఉండొచ్చు? హామీలను నెరవేర్చడానికి అమలుకు పక్కా ప్రణాళిక ఉందా?. మన వార్తాసంస్థ విలువలకు అనుగుణంగా ఏ అభ్యర్థి ఉన్నారు? అసలు అధ్యక్షుడయ్యే అర్హత ఆ అభ్యర్థికి ఉందా? అంతర్జాతీయ పరిణామాలను అవపోశన పట్టి అగ్రరాజ్య అధిపతిగా నెగ్గుకురాగలడా? వంటివి పరిగణనలోకి తీసుకుని వేర్వేరు వార్తాసంస్థలు తమకు నచ్చిన అభ్యర్థికేే మద్దతు ప్రకటిస్తాయి.
అయితే అమెరికాలో వార్తాపత్రికలు బలపరిచిన అభ్యర్థులు ప్రతిసారీ గెలవలేదనే వాదన కూడా ఉంది. 1897లో దాదాపు అన్ని న్యూయార్క్ వార్తాపత్రికలు మద్దతు పలికిన అభ్యర్థులు ఓటమిని చవిచూడటం గమనార్హం. కానీ న్యూయార్క్ టైమ్స్ అధ్యయనం ప్రకారం 1940 నుంచి 2016 వరకు జరిగిన దాదాపు అన్ని అధ్యక్ష ఎన్నికల్లోనూ అత్యధిక వార్తాపత్రికల మద్దతు అందుకున్న అభ్యర్థే అధికారాన్ని కైవసం చేసుకుని శ్వేతసౌధంలో అడుగుపెట్టగలిగారు.
ఈసారి ఎందుకు వివాదాస్పదమైంది?
అనుకూల, ప్రతికూల అనే అంశాలను పక్కనబెడితే అమెరికా రాజకీయ చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన అభ్యర్థుల్లో ట్రంప్ ఒకరు. అతని అభిప్రాయాలు, తీసుకున్న నిర్ణయాలు అమెరికన్లను తీవ్రంగా విభజించాయి. డెమొక్రటిక్ అభ్యర్థి గెలిస్తే అమెరికా నాశనమవుతుందని ట్రంప్ బలంగా ప్రచారంచేశారు. 2016లో తొలిసారి గెలిచినప్పటి నుంచి మీడియాలో వస్తున్న విమర్శలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటి వార్తా పత్రికలను ఫేక్ న్యూస్ అని పదేపదే ఖండించారు.
ఈ నేపథ్యంలో ఎండార్స్‌మెంట్ విషయమై వాషింగ్టన్ పోస్ట్, లాస్‌ఏంజిల్స్ టైమ్స్ వెనుకంజ వేయడానికి వ్యాపారపరమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తోంది. జెఫ్ బెజోస్ కంపెనీ అమెజాన్‌కు అమెరికా ప్రభుత్వంతో బిలియన్ డాలర్ల క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందాలు ఉన్నాయి. ఆయన రాకెట్ కంపెనీ బ్లూ ఆరిజిన్‌కు స్పేస్ ఫోర్స్, నాసాతో ఒప్పందాలున్నాయి. 2023లో డెమొక్రాట్ల బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ ట్రస్ట్ దావాను కూడా అమెజాన్ ఎదుర్కొంటోంది.
బయోఫార్మా ఇన్నోవేటర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సూన్–షియోంగ్ ప్రస్తుతం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి అవసరమయ్యే కొత్త మందులపై పనిచేస్తున్నారు. విజయావకాశాలు 50–50 ఉన్నాయని సర్వేలు చెబుతుండటంతో ట్రంప్‌ను గెలిపిస్తే తమ వ్యాపార ఒప్పందాలకు ఢోకా ఉండబోదని వ్యాపార దిగ్గజాలు భావించి ఉంటారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment