ప్రపంచ మానవాళిముందున్న అతిపెద్ద సవాల్ రోజురోజుకు పెరిగిపోతున్న భూతాపం. దీనిని నియంత్రించే లక్ష్యంతో 2015లో 200 దేశాలు పారిస్ వాతావరణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. దీని ప్రకారం అధిక ఉష్ణోగ్రతల నియంత్రణకు ఈ దేశాలన్నీ తగిన చర్యలు చేపట్టాలి. ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంట్రీగ్రేడ్‌ల కన్నా తక్కువకు నియంత్రించాలి. అప్పుడే విపత్కర వాతావరణ ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చని పారిస్ ఒప్పందంలో తీర్మానించారు. అయితే ఇది విఫలమయినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
2023 నవంబరు 17న నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆరోజు భూ ఉపరితల ఉష్ణోగ్రత పూర్వపారిశ్రామిక స్థాయిలకంటే రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా నమోదయ్యింది. ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలలో ఇదే రికార్డుగా నిలిచింది. ఇది అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయంగా పెరిగిన గాలి ఉష్ణోగ్రత, సముద్ర ఉష్ణోగ్రత, అంటార్కిటిక్ సముద్రపు మంచు విస్తీర్ణం మొదలైనవి భూతాపం పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి.
గత జూలైలోనూ భూ ఉపరితల ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. సెప్టెంబర్ నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నాయని మరో నివేదిక పేర్కొంది. భూతాపం నియంత్రణకు అన్ని దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడం, అటవీ రక్షణ పెంపుదల, మొక్కల ఆధారిత ఆహారాలవైపు మళ్లడం, కొత్త బొగ్గు ప్రాజెక్టులను ఎత్తివేయడం, చమురు, గ్యాస్ వినియోగాన్ని దశలవారీగా తగ్గించడానికి ప్రయత్నాలను తప్పనిసరిగా చేయాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.
ప్రపంచ దేశాలు ఉష్ణోగ్రతలను లక్ష్యం మేరకు నియంత్రించలేకపోతే అత్యంత దారుణమైన పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ మేరకు పెరిగితే సముద్ర మట్టాలు 10 సెంటీమీటర్లు పెరిగి, చాలా ప్రాంతాలు నీట మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పరిమితం చేయగలిగితే కనీసం కోటి మందిని ఈ ముప్పు నుంచి బయటపడేయచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: భారతీయలు పాక్‌లో వ్యాపారం చేయవచ్చా?
Comments
Please login to add a commentAdd a comment