రూటర్...
మెట్రో కథలు
ఏంట్రా...
ఏంటి?
ఏమంటావ్?
నే వెళుతున్నా.
వెళ్తావా?
ఇక నాకు కాల్ చేయకు. రిస్క్‌లో పడేశావ్. దేవుడా..
రేయ్...
పరిగెత్తి బైక్ సపోర్టింగ్ రాడ్ పట్టుకుంది.
వదులు.
నన్నేం చేయమంటావ్?
నన్నడిగితే?
విదిలించుకుని వెళ్లిపోయాడు.
రొప్పుతూ ఏడుపొస్తున్నట్టుగా అవుతూ ఏం తోచనట్టుగా దిక్కులు చూస్తూ బస్టాప్‌లో కూలబడింది. రూట్ బస్సులు తిరగడానికి ఇంకా టైమ్ ఉంది. ఈలోపు వాడు కాల్ చేస్తే? ఇప్పుడు కావాలి రా అంటే? ఎందుకైనా మంచిదని సెల్ ఆఫ్ చేసింది. చేశాక దానివైపు చూసుకుంది. దరిద్రం. అంతా దీని వల్లే వచ్చింది.
ఏంటమ్మా... ఏదైనా ప్రాబ్లమా?
అబ్బే... ఏం లేదండీ... తెలిసిన అబ్బాయే.
ఏంటో... ఈ కాలం పిల్లలు...
బస్సొస్తే ఎక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు బస్టాప్‌లో ఎవరూ లేరు. మధ్యాహ్నం మూడంటే పెద్దగా ఎవరూ ఉండే టైమ్ కాదది. సాయంత్రం దాకా క్లాసులున్నాయి. మాట్లాడాలని బైక్ ఎక్కి తీసుకు వచ్చింది. తీరా సంగతి చెప్పాక పారిపోయాడు. వెధవ. ఇప్పుడు ఎవడు కాపాడతాడు?
ఎదురుగా పెద్ద బిల్డింగ్ మీద చాలా పెద్ద హోర్డింగ్ కనిపిస్తూ ఉంది. రూ.599కి ఒక ప్యాకేజ్ అట. రూ.999కి ఇంకో ప్యాకేజ్ అట. రూ.1199 కడితే ఇక తిరుగే లేదట. ఏమైనా చేసుకోవచ్చట. మొదట తమ్ముడు మొదలెట్టాడు. తర్వాత తను వెంటపడింది. హాల్లో అందరికీ కనిపించేలా ఉన్న కంప్యూటర్‌కి నెలకు ఆరు వందల ప్యాకేజీలో ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది. కొత్తల్లో అంతా బాగుంది. మెయిల్స్ చూసుకునేవారు. యూ ట్యూబ్‌లో సినిమాలు చూసుకునేవారు. చదవుకోవడానికి మెటీరియల్- తమ్ముడికి ఇంటర్ సంగతేమోగాని తనకు బి.టెక్‌కు చాలా అవసరమే పడింది. నాన్నకు ఫేస్‌బుక్ పరిచయం చేశారు. అమ్మ ఫస్ట్‌టైమ్ ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇద్దరు పిల్లల పేర్లను కలిపి పాస్‌వర్డ్‌గా పెట్టుకుంది. ఇరుగూ పొరుగూ ఫ్లాట్స్ వారికి కూడా సంతోషమే. ఇల్లంటే ఏమిటి? టూ బెడ్‌రూమ్స్, కిచెన్, స్విఫ్ట్ కారు, కంప్యూటర్, ఇంటర్‌నెట్.... కాని కాదని కాలక్రమంలో తేలింది. స్మార్ట్‌ఫోన్స్ లేకపోవడం వల్ల వచ్చిన పెద్ద వెలితి అది.
తండ్రి మరీ అంత స్పీడ్ మీద ఉండే మనిషి కాదు. అలాగని ప్రతిదాన్నీ నిరోధించేవాడూ కాదు. లోటు చేయకుండా ఇంట్లో ఉన్న నలుగురికీ రెండు మూడు వేలు పెట్టి నోకియాలు తీసుకున్నాడు. బయట, ఆఫీసులో రింగ్ వస్తే జేబులో నుంచి దానిని బయటకు తీస్తే అందరూ చిత్రంగా చూడటం ఇబ్బందిగా ఉన్నా పిల్లలు దానిని భరించలేకపోతున్నారని త్వరగానే అర్థం చేసుకున్నాడు. మరీ పదిహేనువేలూ పద్దెనిమిదివేలూ పెట్టి సామ్‌సంగ్‌లు సోనీలు కాదు వేరేవి ఆలోచించండి అంటే ఆరేడు వేలకు బ్రహ్మాండమైన చైనా ఫోన్లు వచ్చాయి. కావల్సిందేమిటి? ఫేస్‌బుక్, వాట్సప్. అవి బాగా పని చేస్తాయి.
కొత్తల్లో పిల్లలిద్దరికీ చెరి నూటేభై రూపాయలు శాంక్షన్ చేశాడు ఇంటర్నెట్ డేటా కోసం. అది ఏ మూలకు? నలుగురితో చాట్ చేస్తే నాలుగు డౌన్‌లోడ్‌లు చేస్తే చిటికెలో బేలెన్స్ అయిపోయేది. మళ్లీ డబ్బులడగాలంటే లేని కుటుంబం కాదుగాని కలిగిన కుటుంబం కూడా కాదు. పెద్ద ఇబ్బందే.
రూటర్ పెట్టించండి నాన్నా అంది ఒకరోజు.
మంచి విరుగుడు. వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి తెప్పిస్తే ఉన్న ఇంటర్‌నెట్ కనెక్షన్ మీద ఇంట్లో అందరికి వైఫై వస్తుంది. అందరి ఫోన్లూ హ్యాపీగా పని చేస్తాయి. అన్‌లిమిటెడ్‌గా నెట్ వాడుకోవచ్చు. అన్నింటికంటే మంచి విషయం ఏమిటంటే ఇంతకు ముందులా హాల్లో కూచుని ఏం చేస్తున్నా నలుగురికీ తెలిసిలా చేసే బాధ తప్పడం.
ఆడపిల్ల అని ఒక బెడ్ రూమ్ ఇచ్చారు. వాడు గొడవకు దిగితే డైనింగ్ ఏరియాను ఖాళీ చేసి ప్లైవుడ్ కొట్టి వాడికో గదిలాంటిది తయారు చేశారు. సరే వీళ్లకూ మాస్టర్ బెడ్‌రూమ్ ఎలాగూ ఉంది. ఇప్పుడు ఇరుగూ పొరుగూ వాళ్లు నిజంగా సంతోషించారు. నలుగురి చేతుల్లో నాలుగు స్మార్ట్‌ఫోన్లు. నలుగురూ ఇంట్లో ఉంటారు. నలుగురూ ఫోన్లో ఉంటారు. ఇంతకు మించి ఏం కావాలి?
మొదట రణ్‌బీర్ కపూర్‌ని ఇష్టపడే క్లాస్‌మేట్స్ అంతా వాట్సప్‌లో ఒక గ్రూప్ అయ్యారు. ఎక్కువగా అమ్మాయిల గ్రూపే. కాని అబ్బాయిలు దూరకుండా ఉంటారా? ఆ తర్వాత ఒన్ టు ఒన్ చాటింగ్ మొదలయ్యింది. తొమ్మిదికల్లా పుల్కాలు తిని పాలు తాగి ఒక ఆపిలో కాసిని అనాసముక్కలో తీసుకుని గదిలో దూరితే అమ్ములు చదువుకుంటోందని ఒకటే మురిపెం. కాని తలుపు గట్టిగా బిడాయించుకుని మూడ్ కోసం బెడ్‌లైట్ వేసుకుని ఆ నీలి వెలుతురులో గుట్టు చప్పుడు కాకుండా స్క్రీన్ మీద అక్షరాలను బ్లింక్ చేస్తూ పోతూ ఉంటే గంటలు గంటలు... డబ్బులవుతాయన్న బాధే లేదు. రూటర్ ఉందిగా.
ఒకరోజు మాట మారింది. ఒక దారి నుంచి ఇంకో దారిలోకి మళ్లింది. బాగా నిద్ర పట్టి తెల్లారి ఆలస్యంగా నిద్ర లేచింది.
కాలేజ్ చేరుకున్నాక క్లాసుల హడావిడిలో ఫోన్ ఎప్పుడు తీసుకున్నాడో చాటింగ్ ఎప్పుడు చూశాడో ఎప్పుడు మెయిల్ చేసుకున్నాడో తెలియదు. చాట్ చేసినవాడు ఫ్రెండే. దానిని కాపీ చేసుకున్నవాడూ ఫ్రెండే. చాట్ హిస్టరీని డిలీట్ చేయకపోవడం వల్ల దొరికిపోయింది.
ఒక బెడ్ మీద లేరన్నమాటేగానీ తక్కినవన్ని జరిగాయిగా అన్నాడు మరుసటి రోజు నవ్వుతూ.
హాస్యం అనుకుంది. కాదు. మెయిల్‌లో ఉన్నదంతా చూపించాడు.
వాడు సరే... నువ్వు మరీ రెచ్చిపోయావుగా.
పాదాలు చల్లగా అయిపోయాయి.
గ్రూప్‌లో షేర్ చేస్తా. లేదంటే మీ నాన్నకు మెయిల్ చేస్తా. వాడి బాబుకు కూడా.
కలో క్రైమ్ సినిమాయో అయితే బాగుండనిపించింది. కాని కాదు.
నేను చాటింగ్‌కే చొంగ కార్చుకునే బ్యాచ్ కాదు. అసలుది కావాలి. కాల్ చేస్తా.
వెళ్లిపోయాడు.
కాసేపు ఏమీ అర్థం కాలేదు. గొంతు పట్టేసినట్టుగా అనిపించింది. మాటిమాటికి దప్పికేస్తున్నట్టుగా అనిపించింది. ఇదంతా ఈ క్షణంలో అబద్ధం అయిపోవాలని అనిపించింది. కాని కాదు. నిజమే. ఎదుర్కోవాలి. కూడగట్టుకుని ధైర్యం తెచ్చుకుని క్లాస్‌లో నుంచి అర్జెంట్‌గా లేవదీసి బయటకు తీసుకొచ్చి విషయం చెప్తే తన కంటే ఎక్కువగా బెంబేలు పడిపోయాడు.
ఎలా... ఎలా?
చాట్ చేసేటప్పుడు ఉండాలి ఈ భయం.
ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు.
ఇద్దరూ ఉదయం లేస్తే అమ్మా నాన్నా అని చక్కగా కనిపించే పిల్లలే. పెద్దవాళ్లను విష్ చేయడం... అంకుల్ ఆంటీ అంటూ మర్యాద ఇవ్వడం... కాలేజ్‌లో కూడా మంచి పేరే ఉంది. కాని ఆ సమయంలో ఆ క్షణంలో ఏం మాట్లాడుకున్నారో తెలిస్తే అదంతా ఏం కాను? నాన్న బతుకుతాడా? తను బతుకుతుందా? పోనీ పోలీసులకు చెప్తే? హు. అదంతా చదివి ముఖాన ఊయరూ? మంచి ర్యాంక్ తెచ్చుకుని మంచి బ్రాంచ్‌లో చేరిందే... ఇప్పుడు చదువు మాన్పిస్తారా? తన్ని మూలన కూచోబెడతారా?
మాటల్లో దించినవాడు పారిపోయాడు. తను మాత్రం అసలుది ఇవ్వాలట.
ఇచ్చి? ఒకసారితో ఆగుతుందా... ఒకరితో ఆగుతుందా?
కణతల దగ్గర నొప్పి. మెల్లగా మొదలై పెద్దగా అవుతూ.
ఆత్మహత్య చాలా సులువైన పరిష్కారం అనిపించింది. అవును. అదే సరైన పరిష్కారం. తిరిగి కాలేజ్‌కు వెళ్లి లైబ్రరీ బిల్డింగ్ ఎక్కి పై నుంచి దూకేస్తే చాలు. ఈ బాధలన్నింటి నుంచి బయటపడిపోవచ్చు.
నిర్ణయం తీసుకున్నాక రిలీఫ్‌గా అనిపించింది.
కాని ఒక్క నిమిషమే. మళ్లీ భయం వేసింది. పోనీ ఒక్క తప్పే కదా. ఇంటికెళ్లి చెప్పేస్తే అమ్మా నాన్నా అయ్యో... అమ్ములూ అని కడుపులో పెట్టుకోరూ? జరగాల్సింది చూడరూ? కాని ధైర్యంగా ఎలా చెప్పడం. పాడు పని చేసిందే.
పిడికిట్లో సెల్ నలుపుతూ కూచుని ఉంది.
ఇంటికా? కాలేజ్‌కా?
నెమ్మదిగా రూట్ బస్సులు మొదలవుతూ ఉన్నాయి.
చూసింది.
కాలేజ్‌కు తీసుకెళ్లే బస్సు ఇంటి మీదుగా వెళ్లే బస్సు ఒకదానికి ఒకటి తోకలా అంటుకుని వస్తూ ఉన్నాయి.
లేచి నిలబడింది.
- మహమ్మద్ ఖదీర్‌బాబు