షాకిచ్చి లేపుతుంది!
భలే బుర్ర
అలారం కేకేస్తుంది గానీ, షాకిస్తుందేంటి అనుకుంటున్నారా? సాధారణంగా అలారం సెట్ చేసుకున్న టైముకి ఓ కేక వేసి మనల్ని నిద్ర లేపుతుంది. కుంభకర్ణుడి కజిన్ బ్రదర్‌స అయితే ఆ కేకకి లేవరు. దాంతో అది కేక మీద కేక వేసి విసిగిస్తూనే ఉంటుంది. అయినా లేవాలనిపించలేదో... స్నూజ్ బటన్ మీద ఒక నొక్కు నొక్కితే అది చప్పున నోరు మూసేస్తుంది. మనం మళ్లీ నిద్రను కంటిన్యూ చేసేయొచ్చు. కానీ పంతొమ్మిదేళ్ల సంకల్ప్‌సిన్హా తయారు చేసిన అలారం దగ్గర ఈ పప్పులేమీ ఉడకవు.
యూపీలోని శారదా వర్సిటీలో ఆటో మొబైల్ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువు తోన్న సంకల్ప్... ఓ అలారం తయారు చేశాడు. అది మహా మొండిఘటం. నిద్రపోయే ముందు మనం సెట్ చేసుకున్న టైముకి అది ఠంచనుగా కేక వేస్తుంది. కేక అంటే మరీ కర్ణకఠోరమైన కేకేం కాదులెండి. కొంచెం ఆహ్లాదభరితమైన కేకే! శ్రావ్యంగా ‘గుడ్ మార్నింగ్’ అనే పాటతో మనల్ని లేపాలని ప్రయత్నం చేస్తుంది. లేచామో సరే సరి. లేవకుండా దాని నోరు నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం అది మనకు ఓ పెద్ద జర్‌క ఇస్తుంది. ఎలా అనేగా? దాన్ని ఆపడానికి మనం స్నూజ్ బటన్ మీద చేయి వేయగానే... చిన్న షాక్ ఇస్తుంది. ఆ దెబ్బకు ఎంత మొద్దునిద్ర ముంచు కొస్తున్నా, ఉలిక్కిపడి లేవాల్సిందే.
ఇందులో ఇంకో వెరైటీ సౌకర్యం కూడా ఉంది. మనకు ఎంత మోతాదులో షాక్ కావాలనుకుంటున్నామో ముందే సెట్ చేసి పెట్టుకోవచ్చు. చిన్న షాక్‌కి లేచే వాళ్లమైతే తక్కువ, మరీ మొద్దు నిద్రపోయే వాళ్లమైతే ఎక్కువ మోతాదును ఎంచు కోవాలి. గరిష్టస్థాయి షాక్ సెట్ చేసుకున్నా కూడా ఏం నష్టం లేదు. ఎందుకంటే, మనిషి శరీరానికి ఎటువంటి హానీ కలగని మేరకే ఇది షాక్ కొడుతుంది. ఆ విధంగానే దీన్ని రూపొందించానని చెబుతున్నాడు రూపకర్త సంకల్ప్.