సాక్షి, సెంట్రల్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచమంతా డబ్బు కోసం పరుగులు పెడుతోంది. ఎవరిని కదిలించినా.. ‘ఎంతో కొంత వెనకేసుకోవాలి కదరా’ అనే మాటే వినబడుతోంది. కానీ అసలు ప్రపంచంలో డబ్బే అవసరం లేకుండా పనులు జరిగిపోతే. మనకు వచ్చే పనులను వేరే వాళ్లకు చేసిపెట్టి.. మనకు అవసరమున్న పనులను అవి వచ్చే వాళ్లతో చేయించుకుంటే. ఈ పనులన్నింటినీ వాటికయ్యే సమయం ప్రకారం లెక్కిస్తే. ఇదేదో బాగుంది కదా! దీన్నే టైమ్ బ్యాంకు విధానం అంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అసలు ఏంటీ విధానం, ఎలా నడుస్తుంది, ఎన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది, మన దేశంలో పరిస్థితేంటి.. తెలుసుకుందాం.
మీరో కంప్యూటర్ హార్ట్‌వేర్ ఇంజనీర్. మీ ఇంట్లో గార్డెనింగ్ పని చేయాల్సి ఉంది. ఆ పని చేసే వ్యక్తిని పిలిచారు. అతను వచ్చి ఆ పని చేసేశాడు. సుమారు 2 గంటల సమయం పట్టింది. ఆ సమయం ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్నిరోజులకు వేరే ఎవరి ఇంట్లోనో షార్ట్ సర్క్యూట్ వల్ల కంప్యూటర్ పాడైతే మీరు వెళ్లి బాగు చేశారు. రిపేర్‌కు దాదాపు 4 గంటలు పట్టింది. ఈ సమయం మీ బ్యాంకు ఖాతాలో చేరిపోతుంది.
ఇంతకుముందు మీరు చేయించుకున్న రెండు గంటల పని పోనూ ఇంకో రెండు గంటలు మిగులుతుంది. ఈ సమయాన్ని మీరు వేరే పనులకు వాడుకోవచ్చు. ఇలా మీకు వచ్చిన పనులు చేస్తూ, వాటికి పట్టే సమయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తుండటం.. మీకు కావాల్సిన పనులకు ఆ సమయాన్ని వాడుకోవడం.. డబ్బు అవసరమే లేకుండా పనులన్నీ జరిగిపోవడం.. ఇదే టైమ్ బ్యాంకు విధానం. ఇప్పుడు చాలా దేశాల్లో వాడుకలోకి వస్తున్న సరికొత్త విధానం.
ఎక్కడ పుట్టింది ఈ ఐడియా?
ప్రజలు తాము చేసే పనులను డబ్బుకు బదులు సమయంతో కొలిచే ఈ కొత్త విధానానికి అమెరికాకు చెందిన ఎడ్గర్ ఎస్. కాన్ అనే వ్యక్తి సృష్టికర్త. ప్రస్తుతం ఇతను అమెరికాలో టైమ్ బ్యాంకులకు సీఈవో. ఈ పద్ధతిలో ఎవరైనా ఒక గంటపాటు తమకు వచ్చిన పనిని అవసరమైన వారికి చేశారనుకోండి.. అతనికి ఓ గంట టైమ్ క్రెడిట్ ఇస్తారు.
అలా పని చేసిన మొదటి వ్యక్తికి ఇంకేదైనా పని అవసరమైనప్పుడు ఆ పని చేయగలిని వాళ్లు వచ్చి ఆ గంట చేసి వెళ్తారు. ఇలా టైమ్‌ను క్రెడిట్ చేసుకోవడం, డెబిట్ చేయడం, అవసరమైన పనులకు వ్యక్తులను పంపడం లాంటివి చూసుకునేందుకే టైమ్ బ్యాంకులు ఉంటాయి.
ఎన్ని దేశాల్లో నడుస్తోంది?
ప్రస్తుతం ఓ ప్రణాళికాబద్ధంగా టైమ్ బ్యాంకులు 30కి పైగా దేశాల్లో నడుస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలూ ఈ టైమ్ బ్యాంకులను నడిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ టైమ్ బ్యాంకుల ద్వారా 40 లక్షల గంటల పని జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రాంతాలు, దేశాల వరకే పరిమితమైన ఈ టైమ్ బ్యాంకుల సరిహద్దులను చెరిపేసేందుకు టైమ్ రిపబ్లిక్ 2013లో తొలి గ్లోబల్ టైమ్ బ్యాంకును కూడా ప్రారంభించింది.
స్విట్జర్లాండ్‌లో వృద్ధుల కోసం..
స్విట్జర్లాండ్‌లో ఈ టైమ్ బ్యాంక్‌ను వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం లాగా ప్రారంభించారు. ఇందులో చేరిన ప్రతి వ్యక్తికీ సామాజిక భద్రత అకౌంట్ ఒకటి, టైమ్ బ్యాంకు కార్డు ఒకటి ఇస్తారు. ఎవరైనా ఎప్పుడైన సాయం అవసరమైతే తమ టైమ్‌ను వాడుకోవచ్చు. ఆ వ్యక్తి కోరే పని చేసే వలంటీర్‌ను ఎంపిక చేసి బ్యాంకు వాళ్లు పంపుతారు.
సామాజికంగా కలిసిమెలిసి ఉండే వాళ్లకు, కొత్త పరిచయాలు కోరుకునే వాళ్లకు ఈ టైమ్ బ్యాంకింగ్ ఉత్సాహాన్నిస్తుంది. ఎందుకంటే స్విట్జర్లాండ్‌లో టైమ్ బ్యాంక్ క్లబ్‌లో చేరిన సభ్యులతో బ్యాంకులు ఎప్పటికప్పుడు సమావేశాలు, పార్టీలను ఏర్పాటు చేస్తున్నాయి.
మన దేశంలో ఏంటి పరిస్థితి?
స్విట్జర్లాండ్‌లో అమలు చేస్తున్న పథకాన్ని దేశంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచించింది. దేశంలో దాదాపు కోటిన్నర మంది వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు. వీళ్లలో ఏదోరకంగా సేవలు పొందుతున్న వాళ్లు కేవలం 20 లక్షల మంది మాత్రమే ఉన్నారు.
మిగతా వాళ్లు ఏపనినైనా తమకుతాముగా చేసుకోవాల్సిందే. మరో 30 ఏళ్లలో దేశంలో 60 ఏళ్ల పైబడిన వాళ్లు మొత్తం జనాభాలో 20 శాతం అవుతారు. ప్రస్తుత సమాజంలో చిన్న కుటుంబాలు పెరగడం, సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుండటంతో వృద్ధులు ఒంటరిగా గడపాల్సిన సందర్భాలు పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో టైమ్ బ్యాంకుల ద్వారా యువకులు ముందుకొచ్చి వృద్ధుల అవసరాలు తీర్చడం, వాళ్ల ఒంటరితనాన్ని పోగొట్టడం, అందుకు యువకులు వెచ్చించిన సమయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం, ఆ తర్వాత తమ వృద్ధాప్యంలో ఆ సమయాన్ని వాడుకునే వెసులుబాటు పొందడం వంటివి సమస్యలకు పరిష్కారం చూపిస్తాయని కొందరు నిపుణులు అంటున్నారు.
లోపాలేమైనా ఉన్నాయా?
టైమ్ బ్యాంకులు ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. కాబట్టి సర్వీసులు పొందే, అందించే వెసులుబాటు చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఈ సర్వీసుల్లో సాంకేతికతను చాలా తక్కువగా వాడుతున్నారు. అంటే టైమ్ బ్యాంక్ యాప్ లాంటివి ఇంకా అందుబాటులోకి రాలేదు. పైగా కొన్ని పనులకు విలువ ఎక్కువగా ఉంటుంది.
కొన్నింటికి తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక సమస్యే. అయితే ఒకవేళ ఎవరి పనికైనా మిగతా వాళ్ల పనులతో పోలిస్తే ఎక్కువ విలువ ఉంటుందని, ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటే అలాంటి వాళ్లు సమయానికి బదులు డబ్బును కోరే వెసులుబాటును ఈ బ్యాంకుల్లో ఇస్తూ సమస్యను పరిష్కరిస్తున్నారు.
పేద దేశాల్లో సాధ్యమా?
ఇలాంటి టైమ్ బ్యాంకు విధానం ధనిక దేశాల్లోనే కుదురుతాయని కొందరు నిపుణులు అంటున్నారు. అలాంటి దేశాల్లో ప్రజలకు తిండి, చదువు కోసం పెద్దగా ఆందోళన ఉండదని, కాబట్టి వాళ్లు ఇలాంటి పనులకు ముందుకొచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు. పైగా ధనిక దేశాల్లో ఇలాంటి పనులు చేసేవాళ్లకు అక్కడి ప్రభుత్వాలు కావాల్సిన సదుపాయాలు, డబ్బులు కూడా అందించే అవకాశం ఉంటుందన్నారు.
కానీ పేద, మధ్య తరగతి దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదని, ఆ దేశాల్లో తిండి కోసమే ప్రజలు ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుందని, పిల్లల చదువులకు డబ్బులు అవసరమవుతాయని చెబుతున్నారు. కాబట్టి ఆ దేశాల ప్రజలు ఈ కొత్త విధానానికి ఇష్టపడరని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment