సరికొత్త వేకీ...
సాంకేతికం
పొద్దుటే లేవాలని ఉంటుంది. కానీ లేవలేం. అనివార్యంగా అలారంను ఆశ్రయిస్తాం. నిర్ణయించిన టైమ్‌కే అలారం మోగుతుంది. కానీ, లేస్తామా? లేవం. మళ్లీ బద్దకంగా ముసుగుతన్ని పడుకుంటాం. లేచిన తరువాత...‘అయ్యో! లేవలేక పోయామే’ అని బాధ పడతాం. ఇప్పుడిక అలాంటి బాధ అక్కర్లేదు. మీరు నిర్ణయించినా టైమ్‌కు అలారం ‘ట్రింగ్... ట్రింగ్’ అని మోగదు. ‘మరి ఎలా?’ అని కంగారు పడొద్దు. అమెరికన్ డెవలపర్ హచిక్ అడ్జమియన్ ‘వేకీ’ పేరుతో ఒక యాప్‌ను రూపొందించాడు. నిర్ణీత సమయాన్ని సెట్ చేసుకొని పడుకుంటే చాలు... మీరు లేవాల్సిన టైమ్‌లో వేకీ- కమ్మగా పాడుతుంది. జోకులు వినిపిస్తుంది. కవితలు, చిన్న చిన్న కథలు వినిపిస్తుంది. అపరిచితులు గొంతులు వినిపిస్తుంది.
‘ఎలా అయితే... నిద్ర నుంచి మెలకువ వస్తుంది?’ అనే అంశంపై పరిశోధనలు జరిపి మరీ ఈ యాప్‌ను రూపొందించారు. ‘‘పొద్దున తలుపు చప్పుడు కాగానే... వెళ్లి తలుపు తీసినప్పుడు ఎవరైనా కొత్త వారు కనిపిస్తే నిద్ర మత్తు ఎగిరిపోతుంది. మళ్లీ నిద్రకు ప్రయత్నించినా రాదు... ఇలాంటి విషయాల ఆధారంగానే యాప్‌ను రూపొందించాం’’ అంటున్నాడు హచిక్ అడ్జమియన్.