పగబట్టిన కల | The fabric of revenge | Sakshi
Sakshi News home page

పగబట్టిన కల

Published Mon, Mar 6 2017 11:00 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

పగబట్టిన కల

పగబట్టిన కల

భయాలు పాకుతాయి.
శబ్దం చెయ్యకుండా, మనకు తెలియకుండా ఒళ్లంతా పాకుతాయి.
ఈ భయాలకు ఒక పుట్ట ఉంటుంది.
మనసు అన్న కీకారణ్యంలో ఈ పుట్టను
మనం పెంచుకుంటాం.
ఈ పుట్టను తవ్వితే... తవ్వుతూ పోతే...
ఇంకో జన్మే కనబడొచ్చు!
ధైర్యం ఉంటే, మనోబలం ఉంటే...
ఆ పుట్టను ఈ జన్మలోనే ధ్వంసం చెయ్యొచ్చు.


గడియారం టంగ్‌ ...టంగ్‌... టంగ్‌... మని మోగడంతో టైమ్‌ చూశాడు చైతన్య(పేరు మార్చడమైంది). రాత్రి పదకొండు. చైతన్య తన చేతికున్న తాయెత్తును మూడుసార్లు మణికట్టు చుట్టూ కుడివైపుగా తిప్పాడు. మంచం కోళ్లు నాలిగింటికి పసుపు రాసి ఉన్నదా లేదా అని జాగ్రత్తగా పరిశీలించాడు. సాయంత్రమే మంచం చుట్టూ మంత్రించిన ఇసుక పోయించాడు. కిటికీ గట్టిగా మూసి ఉందా లేదా అని చెక్‌ చేశాడు. తలుపు కిందుగా టవల్‌ పరిచి కింద ఉన్న గ్యాప్‌ని పూర్తిగా మూసివేశాడు.   ‘హమ్మయ్య!’ అనుకుంటూ మంచం మీదకు చేరి పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. రెండు, మూడు పేజీలు తిప్పి విసుగ్గా అనిపించి పక్కన పడేశాడు. కాసేపు తిరుగుతున్న ఫ్యాన్‌కేసి చూశాడు. మెల్లగా కళ్లు మూతలు పడుతున్నాయి. సమయం గడుస్తోంది.   బెడ్‌రూమ్‌ కిటికీని ఎవరో అతి మెల్లగా తీస్తున్నట్టున్నారు. అది శబ్దం లేకుండా కొద్దిగా తెరుచుకుంది. ఆ కిటికీ అద్దం వెనక వైపు ఒక ఆకారం... మసక మసకగా అటూ ఇటూ కదలాడుతోంది. కాసేపటికి... కొద్దిగా తెరుచుకున్న కిటికీ గుండా ఆ ఆకారం తల లోపలికి పెట్టింది. మెల్లగా లోపలికి పూర్తిగా వచ్చేసింది. డిమ్‌లైట్‌ వెలుతురులో ఆ ఆకారం నల్లగా, అక్కడ అక్కడ చారలుగా కనిపిస్తోంది. ఆ ఆకారం మెల్లగా మంచం దగ్గరకు చేరుకుంది. అంతెత్తున లేచి చైతన్యను చూసింది. కాసేపు చూసి మళ్లీ తన యధాస్థానానికి కిందకు దిగింది. మంచం చుట్టూ తిరిగింది. ఒకటి, రెండు, మూడు, నాలుగు సార్లు తిరుగుతూనే ఉంది. మంచంతో సహ ఆ ఆకారం చైతన్యను పూర్తిగా చుట్టేసింది. చైతన్యకు ఊపిరి ఆడటం లేదు. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. ఎటూ కదల్లేకుండా ఉన్నాడు. అరిచి పిలుద్దామంటే గొంతు పెగలడం లేదు. బలవంతంగా కళ్లు చిట్లించి ఆ చీకట్లోకి చూశాడు. అంతెత్తున పడగ విప్పి కోరలు చాస్తూ... తననే చూస్తోంది.. కోబ్రా! బ్లాక్‌ కోబ్రా!!!
 
భయం.. భయం..
‘‘రాత్రిళ్లు నిద్రపోయి కనీసం ఏడాది అవుతోంది. రోజూ ఆ పాము కలే! అది నన్ను కాటేస్తోంది. నిద్రపోదామంటే చచ్చిపోతానేమో అనే భయం. మెలకువ ఉండలేక, నిద్రపోలేక నరకయాతన అనుభవిస్తున్నాను..’’ చైతన్య చెబుతున్నదంతా విన్న సైకాలజిస్ట్‌ ‘‘పాము కలలతో భయపడటాన్ని అఫిడోఫోబియా అంటారు. ఈ జబ్బుకు మీ జీవితంలో ఉన్న అభద్రత కూడా కారణం అయ్యుంటుంది. కొన్ని రోజులు స్లీపింగ్‌ పిల్స్‌ వేసుకొని చూడండి. మరికొన్ని మందులు కూడా రాసిస్తాను, వాడండి..’’ అని చెప్పారు. డాక్టర్‌ చెప్పినట్టుగా చేశాడు. అయినా పాము కల రావడం మాత్రం తగ్గలేదు. ‘‘పాము కోరికలకు చిహ్నం అంటారురా! బహుశా నీకు కోరికలు ఎక్కువై ఉంటాయి’’ ఆటపట్టించాడు ఫ్రెండ్‌ వీరేష్‌!‘‘గుడికి వెళ్లి నాగేంద్రుడికి అభిషేకాలు చేయించరా! ఇలాంటి  కలలు రావు’’ చెప్పింది తల్లి.ఎవరేది చెప్పినా అన్నీ పాటిస్తూనే ఉన్నాడు. మంత్రాలు వేయించాడు. తాయెత్తు కట్టించాడు.కానీ, ప్రయోజనం లేదు.

చీకటి పడుతోందంటే భయం. కనురెప్పవాలుతుందంటే భయం. ఆ పాము వల్ల తను నిద్రలోనే చచ్చిపోతానని భయం. రాత్రి నిద్ర ఉండటం లేదు, ఈ దిగులుతో పగలు తిండి సయించడం లేదు. చిక్కిశల్యమయ్యాడు. పగలంతా నిద్రమత్తుగా ఉంటోంది. దీంతో ఆఫీసులో సరిగా పని చేయలేకపోతున్నాడు., చేసే పనిలో తప్పులు దొర్లుతున్నాయి. పై అధికారుల నుంచి చివాట్లు, మెమోలు... ఫలితంగా ఉద్యోగం కోల్పోయాడు.  

రిగ్రెషన్‌ థెరపీ!
స్నేహితుల సూచన మేరకు రిగ్రెషన్‌ థెరపీకి వచ్చాడు చైతన్య. తన సమస్య అంతా వివరించాడు. ఈ మూలాలు మీ ఈ జీవితంలోనో, మీ గత జన్మలోనో ఉండి ఉంటాయి దర్శించండి అన్నారు థెరపిస్ట్‌.వారి సూచనల మేరకు కళ్లు మూసుకొని ధాన్యముద్రలో ఉండిపోయాడు చైతన్య. థెరపి మొదలైంది.  ‘‘మీకు తరచూ కనిపించే పామును గుర్తు తెచ్చుకోండి. ఆ పాము రూపం ఎలా ఉందో చెప్పండి. పాము తో పాటు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి..’’  ఈ విధంగా కౌన్సెలర్‌ సూచనలు అందుతున్నాయి చైతన్యకు.తను ఉన్న దశ నుంచి వెనక్కి ప్రయాణిస్తున్నాడు.  ఆ ప్రయాణంలో ఎదురైన సంఘటనలను కౌన్సెలర్‌ కు వివరిస్తున్నాడు. చదువు, బాల్యం, అమ్మ గర్భంలో ఉన్న విధానం.. అన్నీ చెబుతున్నాడు. అటు నుంచి గత జన్మకు చేరుకున్నాడు. ‘‘నేనో అడవిలో పరిగెడుతున్నా ను..’’ చైతన్య ఉద్విగ్నంగా చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘ఎటువైపు పరిగెడితే అటు పాము ఎదురవుతోంది. నేను ఆ పాముల నుంచి తప్పించుకోవడానికి భయంతో పరుగెత్తి.. పరుగెత్తి అలసిపోతున్నాను. చివరకు ఓ గూడెం చేరుకున్నాను. అక్కడ వారంతా భయంతో పరుగులు తీస్తున్నారు. నేను అక్కడే ఆగిపోయాను. ‘పాము వస్తోంది. మింగేస్తది. పారిపో.. పారిపో..’ అక్కడున్నవారు నన్ను కేకలేస్తున్నారు. పేద్ద పాము.. ఆ గూడెంలోని వారిని వరుసగా మింగేస్తుందట. వారంతా పారిపోతున్నారు. నేను భయంతో ఇంకా వేగంగా పరిగెడుతున్నాను..’’ చెబుతున్నాడు చైతన్య. చెబుతూనే ఏడుస్తున్నాడు.

మాయమైన భయాలు
కాసేపటికి కౌన్సెలర్‌ సూచనలు చైతన్యకు అందడం మొదలయ్యాయి.‘‘భయపడకండి. పరిగెత్తడం మాని, ఒక్కసారి వెనక్కి తిరగండి. ఆ పామును దగ్గరగా చూడండి. దాని కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి. మీ భయం మెల్లగా దూరమైపోతోంది. ఆ పాముతో చెప్పండి.. మిమ్మల్ని స్నేహంగా చూడమనండి.. మీ చేత్తో ఆ పామును తాకండి. మిమ్మల్ని అదేం చేయదు. శివుడి మెడలో హారంలా మీకు స్నేహంగా మారిపోతుంది. మీ చుట్టూ ఉన్న అభద్రత దేనికి సంబంధించిందో పరిశీలించండి. ఆ భయం తాలూకు భావాలను తుడిచేయండి’’ కౌన్సెలర్‌ చెబుతున్న విధంగా చే స్తున్నాడు చైతన్య.

కాసేపటికి చైతన్యలో అలజడి తగ్గింది. అది గమనించిన కౌన్సెలర్‌ భవిష్యత్తును దర్శించమని చెప్పాడు. 1...2...3...4....5... రోజులు, నెలలు, సంవత్సరాలు.. ముందు ప్రయాణించి తన భవిష్యత్తును చూసుకుంటున్నాడు చైతన్య. ఆ భవిష్యత్తులో తనకు ఎలాంటి భయాలు లేవు. ఉద్యోగం చేస్తూ, కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. అనిర్వచనీయమైన ఆ ఆనందంతోనే కళ్లు తెరిచాడు చైతన్య.

తెరుచుకున్న కిటికీ
‘‘అమ్మా! ఎందుకు కిటికీ మూసేస్తున్నావ్‌’’ తన రూమ్‌లో కిటికీ మూసేస్తున్న తల్లిని అడిగాడు నాగరాజు.‘‘చీకటి చేరకుండా ఉండటానికి...’’ కొడుకు భయానికి కారణం కిటికీయే అని భావిస్తున్న తల్లి వద్దకు వెళ్లాడు చైతన్య. ‘‘అమ్మా! కిటికీ... గది లోపలికి వెలుతురును మోసుకొస్తుంది. చల్లని గాలి వచ్చేలా చేస్తుంది. మూసేస్తే.. చీకటి చేరుతుంది..’’ అంటూ కిటికీని పూర్తిగా తెరుస్తున్న కొడుకును ఆశ్చర్యపోయింది చైతన్య తల్లి. కిటికీ నుంచి వీచిన చల్లని గాలి ఆ ఇంటిలో, వారి మనసుల్లో ఆహ్లాదాన్ని నింపింది.

పీడకల నుంచి పరిణతి
నెపోలియన్‌ –2 కి ఎప్పుడూ ఒక కల వెంటాడేదట. తన గుండెల మీద ఎక్కి ఎవరో నొక్కుతున్నట్టు విలవిల్లాడిపోయే కల. తనను ఎవరో ఉరి తీస్తున్నట్టు గొంతు పెగలక విపరీతమైన బాధ అనుభవించేవాడట. ఈ కల ద్వారా తను ఖైదీలను ఎంతగా హింసిస్తున్నదీ గ్రహించాడు. ఉరివేయడం రద్దు చేసి, ఖైదీల ప్రవర్తనలోనూ మార్పు వచ్చేందుకు కృషి చేశాడట.

కలలు–అవగాహన
గత జన్మలలోని భయాలు, అపరాధ భావనలు, అభద్రత.. కలల రూపంలో మనల్ని వెంటాడుతుంటాయి. ఎల్తైన శిఖరం నుంచి లోయలోకి పడిపోతున్నట్టు, అగ్నిప్రమాదంలో చిక్కుకున్నట్టు, పరీక్ష తప్పినట్టు, క్రూరమైన జంతువులు వెంటాడుతున్నట్టు...భయపెడుతుంటాయి. వాటిని రిగ్రెషన్‌ థెరపీలో చూసినప్పుడు జీవితం పట్ల అవగాహన కలుగుతుంది. ఎక్కడ గిల్ట్‌ పడింది. ఎక్కడ భయం ఏర్పడింది, అభద్రతకు దారితీసిన విధం... అన్నీ స్పష్టంగా తెలుస్తాయి. ఫలితంగా ఆ పీడ కలల నుంచి విముక్తి పొందుతారు.
– డాక్టర్‌ హరికుమార్, జనరల్‌ సర్జన్,ఫ్యూచర్‌లైఫ్‌ థెరపిస్ట్, హైదరాబాద్‌

జ్ఞాపకాల అలలు ..కలలు
గత జన్మ తాలూకు జ్ఞాపకాలకు ఉండే శక్తి, వాటిని హీలింగ్‌ చేసే ప్రక్రియల గురించి బ్రియాన్‌ వీజ్‌ ‘మిరాకిల్స్‌ హాపెన్‌’ద్వారా వివరించారు. కొలంబియా యూనివర్శిటీ సైకియాట్రీ విభాగానికి హెడ్‌గా పనిచేసిన బ్రియాన్‌ గత జన్మ జ్ఞాపకాలు ఈ జన్మకు ఎలా మోసుకువస్తామో, వాటి నుంచి ఎలా బయటపడాలో వివరించారు.

గమనిక : ‘పాస్ట్‌ లైఫ్‌ రిగ్రెషన్‌ థెరపీ’ అంతర్జాతీయంగా ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తోంది. అయితే ఈ ప్రక్రియకు విస్తృతమైన ఆమోదం లభించకపోయినా.. థెరపీ ప్రయోజనాలపై ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఇవి కొన్ని.
– నిర్మలారెడ్డి చిల్కమర్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement