ఎదుగుదల వాయిదా! | Addiction that drains precious time | Sakshi
Sakshi News home page

ఎదుగుదల వాయిదా!

Published Sun, Oct 1 2023 4:31 AM | Last Updated on Sun, Oct 1 2023 4:31 AM

Addiction that drains precious time - Sakshi

బాపట్లకు చెందిన చిట్టిబాబు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగి. వయసు 40 దాటడంతో ఆరోగ్యంపై దృష్టిపెట్టాలనుకున్నాడు. ‘రేపటి నుంచి మార్నింగ్‌ వాక్‌ చేయాలి’.. అని నిర్ణయం తీసుకుని ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నాడు. తెల్లారింది.. అలారం మోగడం మొదలైంది. నిద్రమత్తులోనే చిట్టిబాబు అలారాన్ని ఆపి.. ఈ రోజు గురువారం.. అటూఇటు కాకుండా ఈ రోజే మొదలెట్టాలా? సోమవారం నుంచైతే ఓ క్రమపద్ధతిలో ఉంటుంది కదా అనుకుని.. వచ్చే సోమవారానికి వాయిదా వేసుకుని మళ్లీ ముసుగుతన్నాడు. సోమవారం ఉదయాన్నే అలారం మోగడంతో భారంగా నిద్రలేచాడు.

వాకింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో అతడి మెదడులో తళుక్కున ఓ ఆలోచన మెదిలింది..ఎటూ మూడు రోజుల్లో ఈ నెల ముగిసిపోతుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వాకింగ్‌ ప్రారంభిస్తే ఎలా ఉంటుందబ్బా.. అని ఆలోచించాడు. తన ఆలోచన కరక్టే అనిపించింది. ఒకటో తేదీ అయితే లెక్కించుకోడానికి కూడా సులువుగా, అనువుగా ఉంటుందనుకుంటూ.. వాకింగ్‌కు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

ఒకటో తేదీ కూడా రానే వచి్చంది.. ఆ రోజు బుధవారం. మరీ వారం మధ్యలో ఎందుకు? సోమవారం నుంచి నడుద్దాంలే.. అని వాయిదా వేశాడు. మళ్లీ సోమవారం రాగానే.. ఆపై సోమవారానికి వాయిదా. ఇలా రెండేళ్లుగా వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది గానీ.. మార్నింగ్‌ వాక్‌కు మాత్రం అడుగు ముందుకు పడలేదు. వాకింగ్‌ మొదలెడదామనుకున్న రోజు రాగానే ఏదో ఒక కారణాన్ని వెతుక్కోవడం.. ఆ సాకుతో వాయిదా వేసుకుని, ఆ క్షణానికి హమ్మయ్యా.. అని ఊపిరిపీల్చుకోవడం పరిపాటిగా మారింది.  – తమనంపల్లి రాజేశ్వరరావు, ఏపీ సెంట్రల్‌ డెస్క్‌

ఒక్క చిట్టిబాబు విషయంలోనే కాదు.. దాదాపు అందరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి వాయిదా ఘటనలు ఉండే ఉంటాయి. ఒక్కసారి ఈ వాయిదా సంస్కృతికి అలవాటు పడితే.. మన ఎదుగుదలను, అభివృద్ధిని వాయిదా వేసుకున్నట్టే లెక్క. విలువైన కాలాన్ని హరించి వేస్తుంది. వాయిదా వేయడం.. ఆ సమయానికి ఎంతో రిలీఫ్‌నిస్తుంది. చేయాల్సిన పనిని ‘తర్వాత చేద్దాంలే..’ అనుకోవడం ఆ క్షణానికి ప్రశాంతతనిస్తుంది. కానీ ఆ వాయిదా తాలూకు పర్యావసానం నష్టాన్ని కలిగించినప్పుడు తల పట్టుకుని కుమిలిపోతుంటారు. ఇలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ప్రమాదమూ లేకపోలేదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూద్దాంలే.. చేద్దాంలే.. అనేవి జీవితాన్ని వెనక్కి లాగే విషయాలని, వీటి నుంచి ఎంత త్వరగా బయటపడగలిగితే అంత మంచిదంటున్నారు.  

మనం ఇలా ఆలోచిస్తే.. మెదడు అలా ఆదేశిస్తుంది..  
సాధారణంగా మనకు ఒత్తిడి కలిగించేవాటిని వాయిదా వేయమని మెదడు చెబుతుంది. పరీక్షల కోసం చదవడం, ఉదయాన్నే లేచి నడవడం వంటివి మానసికంగా భారంగా ఉండే పనులు. ఎక్కువగా ఇలాంటి వాటినే వాయిదా వేయాలని మెదడు చెబుతూ ఉంటుంది. ఇలాంటి వారిలో ఎక్కువ మంది డిప్రెషన్, మానసిక ఆందోళనల బారిన పడే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.  

ఫోన్‌లో మునక నుంచి బయటి కొద్దాం..   
ఏ పనినైనా అనుకున్న సమయానికి పూర్తిచేయాలంటే ఫోన్‌కు దూరంగా ఉండటం మంచిది. ఫోన్‌ అనేది మనకు తెలియకుండానే  సమయాన్ని హరిస్తుంది. మనలో అంతులేని బద్దకానికి కారణమవుతుంది. ఫోన్‌ చేతిలో ఉందంటే చాలు.. ఇక ఏపనైనా ‘ఆ చేయొచ్చులే..’ అనిపించే నీరసం, ‘ఇప్పుడే చేయాలా..’ అనేంత బద్దకం, ‘చేయలేక చస్తున్నా..’ అనుకునేంత నిస్తేజం మనల్ని ఆవహించేస్తాయి. అందుకే ఫోన్‌కు దూరంగా ఉంటే ఈ వాయిదా అలవాటు నుంచి బయటపడే అవకాశం ఉంది.   

అందరిలో ఉండే లక్షణమే గానీ..  
పనులు వాయిదా వేయడం అనేది టైం మేనేజ్మెంట్‌ సమస్య అని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఇది ఎమోషనల్‌ రెగ్యులేషన్‌ సమస్య. ఏదైనా ఒక పని మనలో ఒత్తిడిని కలిగిస్తే.. మెదడులోని దానికి సంబంధించిన భాగం ఆ పనిని వాయిదా వేయాలని ప్రేరేపిస్తుంది. దీంతో మనం ఆ పనిని వాయిదా వేస్తాం. అందుకే వాయిదా వేయడాన్ని ఓ డిఫెన్స్‌ మెకానిజంగా పరిగణించవచ్చు. ఇది అందరిలో ఉండే లక్షణమే గానీ, ఇది క్రానిక్‌గా మారినప్పుడు మాత్రం సైకాలజిస్టులను సంప్రదించాల్సి ఉంటుంది. కాగి్నటివ్‌ బిహేవియర్‌ థెరపీ, మైండ్‌ ఫుల్‌నెస్‌ ట్రైనింగ్, బిహేవియర్‌ షేపింగ్, ఎపిసోడిక్‌ ఫ్యూచర్‌ థింకింగ్‌ వంటి పద్ధతులు ఉపయోగించి వాయిదా వేసే లక్షణాన్ని సైకాలజిస్టులు తగ్గిస్తారు. – బి.కృష్ణ, సైకాలజిస్ట్‌ 
 
మహిళల కంటే పురుషుల్లోనే ఎక్కువ  
పనులు వాయిదా వేయడం అనేది మెదడులోని లింబిక్‌ సిస్టం, ప్రీ ఫ్రొంటల్‌ కార్తెక్స్‌ మధ్య ఘర్షణతో సంభవిస్తుందని న్యూరో సైన్స్‌ చెప్తుంది. ఈ లక్షణం విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్స్‌లో 81 శాతం మంది పనులు వాయిదా వేస్తున్నారని ఒక సర్వేలో తేలింది. పనులు వాయిదా వేయడానికి కొన్ని మానసిక కారణాలున్నాయి. మోటివేషన్‌ లేకపోవడం, ఓటమి భయం, ఒత్తిడి, స్వీయ విమర్శలు తదితరాలు ఓ వ్యక్తి పనులు వాయిదా వేయడానికి కారణమవుతాయి. వాయిదా లక్షణం మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వాయిదా వేసే లక్షణం దైనందిక జీవితానికి ఇబ్బంది కలిగించే స్థాయికి చేరుకుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.  – బి.అనితజ్యోతి, సైకాలజిస్ట్‌ 

‘వాయిదా’పై నిపుణులు ఏమంటున్నారంటే..

  • ఒక పనిని వాయిదా వేయడానికి ముఖ్య కారణం ఆ పని చేయడానికి ఆసక్తి లేకపోవడంతో పాటు ఉత్సాహ లేమిని కూడా ఓ కారణంగా చెప్పొచ్చు.   
  • మనం ఇంతకు ముందు చెప్పుకొన్నట్టు ఆ పని మనకు ఒత్తిడి కలిగించేది, లేదా మానసికంగా భారంగా అనిపించేదై ఉంటుంది.  
  • ఒక పనిని ఒక్కసారి వాయిదా వేశామంటే.. మళ్లీ మళ్లీ వాయిదా వేసేందుకే మన మెదడు మొగ్గు చూపుతుంది.  
  • బద్దకం, సోమరితనం కూడా ఈ వాయిదా పరంపరకు ప్రధాన కారకంగా నిలుస్తున్నాయి.   
  • అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా పనులు వాయిదా వేస్తూ అదో రకమైన మానసిక ఆనందాన్ని పొందుతుంటాం.   

చాలా కోల్పోతున్నాం

  • వాయిదా వేసిన పనిని పూర్తిచేయలేక దాని తాలూకు నష్టాన్ని మూటగట్టుకుంటాం.   
  • వాయిదాల వల్ల తరచూ ఇలానే జరగడంతో ఆందోళన, భయానికి లోనవుతాం.   
  • మనమీద మనకు నమ్మకం సన్నగిలి.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం.  
  •  ఇది మన నిద్రను ప్రభావితం చేస్తుంది. మనకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది.   
  •  ఫలితంగా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది..  

ఇలా అధిగమిద్దాం..  

  • ఒక పనిని చేయడంలో హాయిని అనుభవించాలి గానీ.. ఒత్తిడిని దరిచేరనీయ కూడదు.  
  • ఈ వాయిదా వేయడం అనే దాన్ని మన ఎదుగుదలను నియంత్రించే రుగ్మతగా భావిస్తూ.. దాని బారిన పడకుండా ఉండాలంటూ మనసుకు ఆదేశాలిచ్చుకుంటూ.. మనసును పూర్తిగా మన నియంత్రణలో ఉంచుకోవాలి.   
  •  ఏదన్నా పని మొదలెట్టామంటే.. దానికి అంకితమైపోవాలి. అది పూర్తయిందాకా  వెనకడుగు వేయకూడదు. 
  •  వాయిదా సంస్కృతి అనేది మన ఉన్నతిని, ఎదుగుదలను నిలువరించే ఓ సోమరిపోతు. ఈ జీవన పరుగు పందెంలో తోటివారితో పాటు మన అడుగుల్ని ముందుకు పడనీయకుండా అనుక్షణం వెనక్కి లాగుతూ.. మనల్ని ఓ మాయా ప్రపంచంలోని నిష్క్రియా స్థితికి తీసుకెళ్లే ఓ మత్తుమందు. దీని విషయంలో మనం అప్రమత్తంగా, అనుక్షణం జాగరూకతతో ఉండాలి.   
  • పనిని విభజించుకోవాలి.  ఓ టైం టేబుల్‌ వేసుకుని ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని పూర్తిచేసి తీరాలి. 
  • ఒక సామెత చెప్పినట్టు.. రేపు మనం చేయాలనుకుంటున్న పనిని ఈ రోజే.. ఈ రోజు ఏం చేయాల్సి ఉందో దానిని ఇప్పుడే చేసెయ్యాలి.   
  • పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా యోగా లేదా వ్యాయామం, ధ్యానం చేయాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement