‘పర్మిట్’పై పన్ను | 'Permit' a tax on | Sakshi
Sakshi News home page

‘పర్మిట్’పై పన్ను

Published Fri, Jul 11 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:06 AM

ట్రేడ్ లెసైన్స్‌లు, బల్క్‌గార్బేజీల పేరుతో వైన్ షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూములపై పన్నులు వసూలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: ట్రేడ్ లెసైన్స్‌లు, బల్క్‌గార్బేజీల పేరుతో వైన్ షాపులకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూములపై పన్నులు వసూలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 300 వైన్‌షాపులు ఉన్నాయి. వీటికి అనుంబంధంగా ఉన్న పర్మిట్ రూముల నుంచి ఎలాంటి పన్నులు వసూలు చేయడం లేదు. ట్రేడ్ లెసైన్స్‌లు, బల్క్‌గార్బేజీల పేరుతో వాటి నుంచి కూడా పన్ను వసూలు చేసేందుకు అధికారులు యోచిస్తున్నట్టు సమాచారం.

వైన్‌షాపులకు విడిగా ట్రేడ్ లెసైన్సు ఫీజు  విధించడం తగదని గతంలో కోర్టు తీర్పునిచ్చింది. ఎక్సైజ్ శాఖకు వైన్‌షాప్ లెసైన్సుల ఫీజు చెల్లిస్తున్నందున వాటికి మళ్లీ ట్రేడ్‌లెసైన్సు ఫీజు వసూలు చేయడం సరికాదని తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో వైన్‌షాపులు అనుబంధంగా ఏర్పాటు చేసుకున్న పర్మిట్‌రూమ్‌లకు ట్రేడ్‌లెసైన్సు ఫీజు విధిస్తే ఎలా ఉంటుందనే దిశగా జీహెచ్‌ఎంసీ అధికారులు యోచిస్తున్నారు. వాస్తవానికి పర్మిట్ రూమ్‌లకు ఎక్సైజ్ శాఖ లక్ష రూపాయల వంతున అదనంగా వసూలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యోచన ఏమేరకు కార్యరూపం దాల్చనుందో వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, జీహెచ్‌ఎంసీ ఈ  ఆర్థిక సంవత్సరం నుంచి కొత్తగా అమల్లోకి తెచ్చిన ట్రేడ్‌లెసైన్సు ఫీజుల విధింపు, బల్క్‌గార్బేజి చార్జీలపై వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరు వ్యాపారులకు, బడా సంస్థలకు ఒకే విధంగా ట్రేడ్ లెసైన్సు ఫీజు విధించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంలో మార్పులు తీసుకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
 
పన్నులు తగ్గించండి
 
ట్రేడ్‌లెసైన్సులు, బల్క్‌గార్బేజీ ఫీజులు భారీమొత్తంలో ఉన్నందున హోటల్ సిబ్బందికి కనీస వేతనాలు సైతం చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కన్వీనర్ ఎస్.వెంకటరెడ్డి వాపోయారు. ఆయన నేతృత్వంలో అసోసియేషన్ ప్రతినిధులు గురువారం సచివాలయంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ను కలసి వినతి పత్రాన్ని అందజేశారు.

హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్వీట్‌షాపులు తదితర వ్యాపారాల ట్రేడ్‌లెసైన్సు ఫీజుపై మంత్రివర్గంలోచర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్(రెవెన్యూ) ఎస్.హరికృష్ణను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఈ అంశాన్ని జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement