
పదమూడో నెల కోసం...
కాలమానం
ఏడాదికి పన్నెండు నెలలు, 365 రోజులు, నెలకు రెండు పక్షాలు, నాలుగు వారాలు, వారానికి ఏడు రోజులు ఉంటాయని అందరికీ తెలిసిందే కదా! వారానికి ఏడు రోజుల చొప్పున నాలుగు వారాలు గల నెలకు ఉండాల్సింది 28 రోజులే కదా అని ఆలోచించారు కొందరు పాశ్చాత్య మేధావులు. ఆ లెక్కన ఏడాదికి పన్నెండు నెలలు సరిపోవు. లెక్క సరిపోవాలంటే పదమూడో నెల చేర్చాల్సిందేనంటూ గట్టి ప్రయత్నాలే చేశారు.
పదమూడో నెలను జూన్, జూలై నెలలకు మధ్యన చేర్చాలని కూడా సూచించారు. ఆ లెక్కన ఏడాదికి 364 రోజులే అవుతాయి. ఏడాదికి 365 రోజుల లెక్కను సరిచేసేందుకు జనవరి నెలను 0 తేదీతో ప్రారంభించాలనే సలహాతో ముందుకొచ్చారు. ఇదంతా 1920 నాటి ముచ్చట. ఆ ప్రయత్నం నిష్ఫలమైంది గానీ, లేకుంటే ఏడాదికి ఎన్ని నెలలు అంటే, పదమూడు నెలలు అని పిల్లలకు నేర్పాల్సి వచ్చేది.