మంచి మాట: కాలం మహత్తరం శక్తిమంతం | Time is very powerful, Do not misuse | Sakshi
Sakshi News home page

మంచి మాట: కాలం మహత్తరం శక్తిమంతం

Published Mon, Oct 31 2022 12:27 AM | Last Updated on Mon, Oct 31 2022 12:27 AM

Time is very powerful, Do not misuse - Sakshi

భగవంతుని సృష్టిలో అంతర్భాగమైన కాలానికి ఉన్న శక్తి అద్భుతమైనది, అమోఘమైనది. కష్ట సుఖాలని, మంచి–చెడులని, కలతలని, కన్నీళ్ళని ఇలా అన్నిటిని తనలో లీనం చేసుకుంటూ, వాటి తాలూకు జ్ఞాపకాలని మాత్రమే మిగులుస్తూ, కాలచక్రం గిర్రున తిరిగిపోతుంటుంది.. మన కళ్ళ ఎదుటే ఎంతోమంది మృత్యు ఒడిలోకి జారిపోతున్న వారిని చూస్తున్నా, ఆ దుఖాన్ని అనుభవిస్తున్నా, ఆ క్షణంలో ఎంతో విరక్తిని కల్గించి, కాలక్రమేణా ఆ దుఃఖభారాన్ని మరపింపచేసి, మన జీవితమే శాశ్వతమన్నంతగా మనసు మరల్చి మాయ చేస్తుంది. ఇంతకన్నా విచిత్రం ఏముంటుంది కనుక. ఇంతటి మహత్తరమైన, శక్తిమంతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం.

ప్రయోగించే విధానాన్నిబట్టి కాలం అర్థం మారిపోతుంటుంది. ఏదో ఆలా కాలక్షేపం చేస్తున్నామండీ అని పెద్దలు అంటుంటారు. అంటే ‘రోజులు గడుపుతున్నాము’ అని అర్థం. ఏదైనా విచిత్ర సంఘటన కళ్ళబడితే ‘కలికాలం’,’పిదపకాలం’ అంటుంటారు. పురాణ పఠనం చేస్తుంటే దాన్ని ‘సత్కాలక్షేపం’ అంటుంటారు. ఇలా అర్థాలు ఎన్ని మారినా, కాలప్రభావంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు.

కాలం గడపటం అంటే ‘పొద్దుపుచ్చటం’ అని మాత్రమే కాదు. నిజానికి సద్వినియోగం చేసుకున్నా,దుర్వినియోగం చేసుకున్నా కాలం మాత్రం ఎవరికోసమూ ఆగదు. ఆటపాటలతో బాల్యం గడచిపోతుంది. అది సహజం. ఆశలు, ఆశయసాధనాలు, వివాహం, సంతానం, ఇలా ప్రౌఢ, యుక్తవయస్సులు గడచిపోతాయి. అది అప్పటికవసరం. ఇక మిగిలేది బాధ్యతలు తీరిన జీవితం, అలసిపోయిన శరీరం. మొదటి మూడు దశలలోనూ గిర్రున తిరిగిన కాలం, నాల్గవ దశలో, వయసు మీద పడేసరికి కొంత భారంగా గడుస్తున్నట్టనిపిస్తుంది. ఇంటి పెద్దగా ఎన్నో బాధ్యతలతో తలమునకలై, జీవనపోరాట ప్రవాహంలో కొట్టుకుపోతూ, ఒక్కసారిగా విశ్రాంతి లభించటంతో కాలం స్తంభించినట్టుగా భావిస్తాం. కాని ఆలోచిస్తే ఈ విశ్రాంతి పెద్దలకు ఒక వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే, నిబద్ధతతో కూడిన లక్ష్యసాధన, ఏ వయసు వారినైనా కాలాన్ని సద్వినియోగపరచుకునేలా చేస్తుంది. సక్రమంగా ఉపయోగించుకోలేక పోతే, సమయం వృథా అయిపోయి, జీవితం నిస్సారం గా తయారవుతుంది.

వయస్సులో ఉన్నవారు  తమ ఆశయసిద్ధి కోసం అవిరామంగా కృషి చేయాలి. వయసు మీరిన వారు తమకు వయసు నేర్పిన పాఠాలు, అనుభవాలు భావితరాలకు పంచవచ్చు. తమలోని మరుగుపడిపోయిన కళలను, సృజనాత్మక శక్తిని వెలికి తీసే అవకాశం పొందవచ్చు. చక్కని గ్రంథ పఠనం చేసుకోవచ్చు. వృద్ధాశ్రమాలకి వెళ్లి, అక్కడి వారి యోగక్షేమాలని విచారిస్తూ, వారి అనుభవాలను పంచుకుంటూ, తగిన సలహాలు, సూచనలు అందించవచ్చు. ఎదుటివారికి చేతనైనంత సహాయం చేస్తూ, హాయిగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

అయితే కాస్త వయసు మీరాక, వీటికన్నిటికీ కాలాన్ని సక్రమంగా ఉపయోగించాలంటే శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి యోగసాధన జీవితంలో ఒక భాగం కావాలి. యోగసాధన శారీరక, మానసిక రుగ్మతలని దూరం చేస్తుంది.
ఏ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. ఆ కాయ కాస్తుంది. సకల జీవరాసులు, కాలానికి అనుగుణంగా తమ తమ జీవనశైలిని మార్చుకుంటూ, కాలానికి కట్టుబడి జీవిస్తాయి. కాలాన్ని సద్వినియోగపరచుకోవటంలో తన మేధస్సును మరింత చక్కగా ఉపయోగించుకోవాలి కదా. కర్మసిద్ధాంతం ప్రకారం జరగాల్సిందేదో అదే జరుగుతుందిలే అని వదిలి వేయకుండా మానవ ప్రయత్నం చేయాలి. భూత భవిష్యత్‌ ప్రభావాలని రంగరించుకుంటూ జీర్ణించుకుంటూ మెరుగులు దిద్దుకుంటూ సాగాలి.

‘గతాన్ని తలచుకుని వగచవద్దు.. భవిష్యత్‌ గురించి భయపడవద్దు... వర్తమానంలో జీవించు’ అంటారు పెద్దలు. మనసుని కలచి వేసే సంఘటనలు, మధుర స్మృతులు– రెండూ ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి. అయితే ఆ సంఘటనల వల్ల కలిగిన గాయం మనకు నేర్పుతున్న పాఠాలు ఏమిటి అని తరచి చూసుకోవాలి. దానిద్వారా మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాని దాని గురించి అతిగా వ్యధపడ కూడదు.అలాగే మనసుని సంతోషపెట్టే సంఘటనలను తలచుకోవడం వల్ల మానసిక ఉత్సాహం ఇనుమడిస్తుంది. ఉదాహరణకి బాల్యస్మృతులు ఇంచుమించు అందరికీ ఆనందం కలిగించేవే. ఇక భవిష్యత్తు గురించి కలలు కనడం తప్పు కాదు కానీ అంతకే పరిమితమైపోకుండా, ఆ కలని సాకారం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.

– అడవి అన్నపూర్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement