సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ : బ్యాంక్..అంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది ధనాన్ని రుణంగా తీసుకోవడం, రుణాలు ఇవ్వడం. అవి బ్యాంక్ ప్రాథమిక కార్యకలాపాలని మనకు తెలిసిందే. మరి సమయాన్ని రుణంగా తీసుకునే బ్యాంకులు ఉన్నాయని మీకు తెలుసా? ఏంటి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా..అయితే స్విట్జర్లాండ్‌లో బాగా పాపులర్ అయిన ఈ ‘టైం బ్యాంక్’ గురించి తెలుసుకోవలసిందే.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి వసంతమహేష్ చదువుకోవడానికి స్విట్జర్లాండ్ వెళ్లాడు. కాలేజ్ దగ్గరే ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి యజమానురాలి పేరు క్రిస్టీనా (67). ఇంట్లో ఆవిడొక్కరే ఉంటారు. క్రిస్టీనా సెకండరీ స్కూల్లో టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యింది. ఆమెకు పింఛన్ వస్తోంది. స్విట్జర్లాండ్‌లో పింఛన్ ఎక్కువగానే ఉంటుంది. ఈ నెల పింఛను ఖర్చయిపోకుండానే మరుసటి నెల పింఛను వచ్చి చేరుతుంటుంది. అయినాగానీ క్రిస్టీనా..ఆ దగ్గర్లోనే పనికి వెళ్లొస్తుంటుంది! ఆమె చేసే పని ఓ వృద్ధుడు (87)కి సేవలు అందించడం. అది చూసిన ఆ మహేష్ ఆమెను ‘‘డబ్బు కోసమేనా పెద్దమ్మా..పనికి వెళ్లొస్తున్నారు..’’అని అడిగాడు. దానికి ఆమె బదులిస్తూ..‘‘డబ్బు కోసం కాదు. నా సమయాన్ని ‘టైమ్ బ్యాంక్ ’లో జమ చేసుకోడానికి పనికి వెళ్తున్నాను. నేను పెద్దదాన్ని అయ్యాక, మరీ కదల్లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైమ్‌ని తీసి వాడుకుంటాను’’అని ఆమె బదులిస్తూ ‘టైం బ్యాంక్’ గురించి మహేష్‌కు వివరించింది. టైం బ్యాంక్ పథకం గురించి పూర్తిగా తెలుసుకున్న మహేష్ తన ఫేస్‌బుక్ పేజీలో స్నేహితులతో టైం బ్యాంక్ గురించి వివరించాడు.
దరఖాస్తు ఎలా చెయ్యాలి?
స్విట్జర్లాండ్‌లో ఉన్న ఏ దేశ పౌరుడైనా సరే దీనికి దరఖాస్తు చేసుకునేలా అక్కడి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దరఖాస్తులకు సంబంధించి స్విట్జర్లాండ్ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక యాప్‌లను కూడా రూపొందించింది. వీటిలో దరఖాస్తుదారుడి వివరాలు (పేరు, వయసు, ఎన్ని గంటలు పని చెయ్యాలని అనుకుంటున్నారు తదితర అంశాలు) పేర్కొనాల్సి ఉంటుంది. దరఖాస్తు నింపి దానిని సబ్‌మిట్ చేసిన అనంతరం స్థానికంగా ఉన్న బ్యాంకు అధికారి వద్దకు ఆ వివరాలు వెళతాయి. అధికారి పరిశీలన అనంతరం దరఖాస్తుదారుడి ఫోన్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. అందులో ఎవరి వద్దకు వెళ్లాలి, వారి వివరాలు అన్ని తెలియపరుస్తారు. దరఖాస్తులో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏడాది కాలపరిమితి తర్వాత ఈ పని గంటలన్నిటినీ కలిపి దరఖాస్తుదారుడికి ఒక కార్డు ఇస్తుంది టైం బ్యాంక్. కూడబెట్టుకున్న టైంకి వడ్డీ కూడా ఇస్తుంది. ఆ కార్డును ఉపయోగించి, తనకు ఎప్పుడు సేవలు అవసరమైతే అప్పుడు ఇంకొకరి దగ్గర్నుంచి సేవలను పొందవచ్చు. దరఖాస్తుదారుడి అకౌంట్‌ను పరిశీలించి, బ్యాంక్ సిబ్బందే వలంటీర్లను పంపుతారు. ఆ సేవలు చేయడానికి వచ్చేవారికి సేవ చేయించుకునే వ్యక్తులు డబ్బులు చెల్లించనక్కర్లేదు. వాళ్లకూ ఒక అకౌంట్ ఉంటుంది కదా.. ఆ అకౌంట్‌లో వాళ్ల టైమ్ జమ అవుతుంది. తమ వృద్ధాప్యంలో వాళ్లు ఆ టైమ్‌ని ‘విత్‌డ్రా’ చేసుకోవచ్చు.
ఏమిటీ ఈ టైం బ్యాంక్?
‘టైం బ్యాంక్‘ అనేది స్విస్ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అభివృద్ధి చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం. యవ్వనంలో ఉన్నవారు పెద్దవాళ్లకు సేవలు చేస్తే, వీళ్లు పెద్దవాళ్లయ్యాక సేవలు పొందడానికి వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తులు తాము యవ్వనంలో ఉన్నప్పుడు వృద్ధుల గురించి శ్రద్ధ తీసుకునే సమయాన్ని టైంబ్యాంక్ లో దాచిపెడతారు. దాన్ని వారు వృద్ధులు, అనారోగ్యం పాలైనప్పుడు వాడుకొంటారు. టైం బ్యాంక్లో చేరే దరఖాస్తుదారులు (వ్యక్తులు) ప్రతిరోజు వారు తమ విరామ సమయాన్ని..సహాయం అవసరమైన వృద్ధులను చూసుకోవడానికి కేటాయిస్తారు. వారి సేవా గంటలు సామాజిక భద్రతా వ్యవస్థలోని వ్యక్తిగత ఖాతాల్లో టైం బ్యాంక్ జమచేస్తుంది. అలా నిర్దిష్ట కాల పరిమితి ముగిసిన తరువాత టైం బ్యాంక్ దరఖాస్తుదారుడి పనిగంటలను లెక్కించి అతడికి ‘టైం బ్యాంక్ కార్డు‘ను జారీ చేస్తుంది. అది అవసరమైనప్పుడు అతడు ఆ బ్యాంక్ నుంచి ‘టైం బ్యాంక్ కార్డు‘ను ‘టైం అండ్ వడ్డీ‘ తో ఉపసంహరించుకొని ఉపయోగించవచ్చు. సమాచారం పరిశీలన తర్వాత, ‘టైం బ్యాంక్‘ స్వచ్ఛంద సేవకులను దరఖాస్తుదారుడికి ఆసుపత్రి పనులు లేదా ఇంటి పనులు చేయడానికి నియమిస్తుంది.
ఇందులో చేరడానికి అర్హతలు ఏంటి?
టైం బ్యాంక్‌లో చేరాలంటే దీనికి కొన్ని ప్రత్యేక అర్హతలు కలిగి ఉండాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. అందులో ముఖ్యంగా ఈ టైం బ్యాంక్‌లో జాయిన్ అయ్యేవారు..
►ఆరోగ్యంగా ఉండాలి
►చక్కగా మాట్లాడగలిగే నేర్పు ఉండాలి
►వృద్ధులపై ప్రేమతో ప్రవర్తించాలి
ఇలా రోజుకు ఎన్ని గంటల పాటు సేవలు అందిస్తారో, అన్ని గంటల్నీ టైం బ్యాంకులోని తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకునే సౌలభ్యాన్ని అక్కడి ప్రభుత్వం కల్పించింది.
ఎవరికి లాభం?
అయితే ఈ తరహా టైం బ్యాంకుల వల్ల ఎవరికి లాభం అనే అంశాలను పరిశీలిస్తే ఇది దరఖాస్తుదారుడికి, సేవలు అందుకునే వారికి ఇద్దరికీ ఉపయోగం అని చెప్పవచ్చు. చాలామంది స్విస్ పౌరులు ఈ రకమైన ఓల్డ్–ఏజ్ పెన్షన్లను బలపరుస్తున్నారు. స్విస్ పెన్షన్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. స్విస్ యువకుల్లో సగం మంది ఈ తరహా వృద్ధుల సంరక్షణ సేవలో పాల్గొనాలని కోరుకొంటున్నారు. వృద్ధాప్యం కోసం సమయాన్ని ఇలా కూడబెట్టుకోవడం స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు సర్వసాధారణం. టైం బ్యాంక్ వల్ల ప్రభుత్వానికి పింఛన్ భారం కూడా గణనీయంగా తగ్గిపోయింది. అలాగే కొన్ని సామాజిక సమస్యలకు కూడా టైం బ్యాంక్ చక్కటి పరిష్కారం అయ్యింది. స్విస్ పెన్షన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం..స్విటర్లాండ్‌లోని యువతీయువకుల్లో సగం మందికి పైగా వృద్ధాప్య సేవల్లో పాల్పంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టైం బ్యాంక్‌ని మరింత ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలను స్విస్ ప్రభుత్వం కూడా పరిశీలిస్తోంది. ఇందుకుగాను కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఈ పథకాన్ని అప్పగించి మరింత విస్తరించడానికి చర్యలు తీసుకుంటుంది.
సమయాన్నీ దాచుకోవచ్చు తెలుసా?
Published Sun, Apr 28 2019 8:39 AM | Last Updated on Sun, Apr 28 2019 11:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment