time management
-
మీ ఇష్టానుసారంగా వస్తారా?
సాక్షి, హైదరాబాద్: సమయపాలన పాటించకుండా..విధులకు మీ ఇష్టానుసారంగా వస్తే ఎలా అంటూ సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో పలు విభాగాలను మంత్రి పొంగులేటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు ఎంత మంది సమయానికి హాజరవుతున్నారో తెలుసుకునేందుకు ఉదయం 11:40 నిమిషాలకు మంత్రి సచివాలయంలోని రెవెన్యూ శాఖకు వెళ్లారు. ఎక్కడ చూసినా ఖాళీ కుర్చిలే కనిపించాయి. దీంతో అక్కడే ఉన్న సిబ్బందిని పిలిచి ఆరా తీశారు. ఎవరైనా సెలవులో ఉన్నారా అని అడిగారు. వారు చెప్పిన జవాబుతో ఆయన సంతృప్తి చెందలేదు. మీరే ఇలా చేస్తే ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా? ‘ఉదయం 11: 40 దాటినా ఇంకా 80 శాతం మందికిపైగా ఉద్యోగులు విధుల్లో రాకపోవడం ఏంటని..’ మంత్రి వారిని ప్రశ్నించారు. రిజిస్టర్ తనిఖీ.. పలు విభాగాల పరిశీలన తనిఖీలో భాగంగా ఉద్యోగుల హాజరు పట్టిక తీసుకురావాలని అక్కడే ఉన్న సిబ్బందిని మంత్రి ఆదేశించారు. రిజిస్టర్ పరిశీలించి ఒక్కో సెక్షన్లో ఈ సమయంలో కూడా ముగ్గురు నలుగురే ఉంటే ఎలా అని మండిపడ్డారు. ప్రభుత్వ వారధిగా మీరే సమయానికి రాకపోతే ఎలా? అన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వానికి సమాచారం, అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళతారని నిలదీశారు. రెవెన్యూ విభాగంలోని ఐదు సెక్షన్లలో ఏ సెక్షన్లో కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగులు సమయానికి హాజరు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు, సెక్షన్ ఇన్చార్జ్పై చర్యలు తీసుకుంటాం సచివాలయంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సమయానికి విధుల్లోకి రావాలి. ఉద్యోగుల కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి రావొద్దు. అనివార్య కారణాలు ఉంటే సెక్షన్ ఇన్చార్జ్కు సమాచారం ఇవ్వాలి. ముందస్తు సమాచారం లేకుండా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఆయా ఉద్యోగులు, సెక్షన్ ఇన్చార్జ్పై చర్యలు తప్పవు. – మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి -
IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది'
క్రికెట్లో అత్యంత విజయవంతమైన లీగ్సలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి స్థానంలో ఉంటుంది. అలా ఉంది కాబట్టే ఇప్పటికే 15 సీజన్లు విజయవంతగా ముగించుకొని ప్రస్తుతం 16వ సీజన్లో అడుగుపెట్టింది. టి20 ఫార్మాట్లో సాగే మ్యాచ్‌లు కాబట్టి మూడున్నర గంటల్లోనే ఫలితం తేలుతుంది. అందుకే జనాలకు ఇది బాగా ఎక్కేసింది. అయితే రాను రాను ఐపీఎల్లో మ్యాచ్‌లు సాగిపోతున్నాయి. మూడున్నర గంటల్లోగా ముగిసిపోవాల్సిన మ్యాచ్‌లు నాలుగు గంటలు దాటిపోతున్నాయి. ఒకరకంగా టైం సెన్స్ లేకుండా సాగిపోతున్న మ్యాచ్‌లు చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది. Photo: IPL Twitter అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న కఠిన నిబంధనలు ఇక్కడ లేకపోవడం, నిర్వాహకులు కూడా దీనిని పెద్దగా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఐపీఎల్ కు అసలు టైమ్ సెన్స్ లేకుండా పోతోంది. అంతర్జాతీయ క్రికెట్ లో లేని స్ట్రేటజిక్ టైమౌట్.. ఐపీఎల్లో ఉంటుంది. ఒక్కో ఇన్నింగ్స్ లో రెండుసార్లు, మొత్తం ఐదు నిమిషాల పాటు ఈ స్ట్రేటజిక్ టైమౌట్ ను వాడుకుంటున్నారు. దీనికితోడు ఫీల్డింగ్ లో తరచూ మార్పులు, ఉత్కంఠ సమయాల్లో ప్రతి బంతికీ వ్యూహాలతో అసలు టైమ్ ను పట్టించుకున్న నాథుడు లేకుండా పోతున్నాడు. ఈ సీజన్ లో ఒక్క ఇన్నింగ్స్ కూడా నిర్ధారిత 90 నిమిషాల్లో పూర్తి కాలేదు. Photo: IPL Twitter అలా చేయకపోతే ఆ తర్వాత మిగిలిన ఓవర్లకు 30 గజాల సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లనే అనుమతించాలన్న నిబంధన ఉన్నా దానిని అమలు చేయడం లేదు. ఇక ఈ సీజన్ లో అంపైర్లు ఇచ్చిన వైడ్లు, నోబాల్స్ ను కూడా ఛాలెంజ్ చేస్తుండటం వల్ల మరింత టైమ్ వేస్ట్ అవుతోంది. ప్లేయర్స్ రివ్యూలు, అంపైర్లు రివ్యూలు, గాయాలు.. ఇలా మ్యాచ్ లు నాలుగు గంటల పాటు సాగడానికి కారణాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్‌కు కొత్తగా తెచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కూడా సమయం వృథా అవుతుంది. Photo: IPL Twitter మొన్న రాజస్థాన్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమై.. రాత్రి 11.42కు ముగిసిందంటే ఈ మ్యాచ్ లు ఎంతగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఓ వైడ్ బాల్ ను వైడో కాదో తేల్చడానికి కూడా మూడో అంపైర్ చాలా సమయం తీసుకున్నాడు. చివరికి రెండున్నర నిమిషాల తర్వాత కూడా ఆ థర్డ్ అంపైర్ ఇచ్చింది తప్పుడు నిర్ణయమే అని మాజీ క్రికెటర్ టామ్ మూడీ ట్వీట్ చేశాడు. అసలు టి20 కాన్సెప్ట్ తెచ్చిందే వేగంగా క్రికెట్ మ్యాచ్ ను పూర్తి చేసి ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం. ఎంత మన ఐపీఎల్ అయినా చూసేవారికి విసుగు పుట్టించేలా మాత్రం తయారు కాకూడదు. కానీ ఐపీఎల్లో ఇలా సుదీర్ఘంగా సాగుతున్న మ్యాచ్ లు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ప్రతి రోజూ రాత్రి 11.30 వరకూ మేలుకొని మ్యాచ్ లు చూడటం ఎవరికైనా ఇబ్బందే. రాత్రిళ్లు ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతోనే గతంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ ను 7.30 కే ప్రారంభిస్తున్నారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. చదవండి: ప్రతిసారీ వాళ్లమీదే ఆధారపడితే ఎలా? బెటర్ ఆప్షన్ ఉంటే అతడి స్థానంలో.. నీరజ్‌చోప్రా తమ్ముడిలా ఉన్నాడు.. 'ఇంపాక్ట్'ను భలే వాడింది పో! -
సమయాన్నీ దాచుకోవచ్చు తెలుసా?
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ : బ్యాంక్..అంటే వెంటనే మనకు గుర్తుకొచ్చేది ధనాన్ని రుణంగా తీసుకోవడం, రుణాలు ఇవ్వడం. అవి బ్యాంక్ ప్రాథమిక కార్యకలాపాలని మనకు తెలిసిందే. మరి సమయాన్ని రుణంగా తీసుకునే బ్యాంకులు ఉన్నాయని మీకు తెలుసా? ఏంటి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా..అయితే స్విట్జర్లాండ్‌లో బాగా పాపులర్ అయిన ఈ ‘టైం బ్యాంక్’ గురించి తెలుసుకోవలసిందే. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి వసంతమహేష్ చదువుకోవడానికి స్విట్జర్లాండ్ వెళ్లాడు. కాలేజ్ దగ్గరే ఓ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ ఇంటి యజమానురాలి పేరు క్రిస్టీనా (67). ఇంట్లో ఆవిడొక్కరే ఉంటారు. క్రిస్టీనా సెకండరీ స్కూల్లో టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యింది. ఆమెకు పింఛన్ వస్తోంది. స్విట్జర్లాండ్‌లో పింఛన్ ఎక్కువగానే ఉంటుంది. ఈ నెల పింఛను ఖర్చయిపోకుండానే మరుసటి నెల పింఛను వచ్చి చేరుతుంటుంది. అయినాగానీ క్రిస్టీనా..ఆ దగ్గర్లోనే పనికి వెళ్లొస్తుంటుంది! ఆమె చేసే పని ఓ వృద్ధుడు (87)కి సేవలు అందించడం. అది చూసిన ఆ మహేష్ ఆమెను ‘‘డబ్బు కోసమేనా పెద్దమ్మా..పనికి వెళ్లొస్తున్నారు..’’అని అడిగాడు. దానికి ఆమె బదులిస్తూ..‘‘డబ్బు కోసం కాదు. నా సమయాన్ని ‘టైమ్ బ్యాంక్ ’లో జమ చేసుకోడానికి పనికి వెళ్తున్నాను. నేను పెద్దదాన్ని అయ్యాక, మరీ కదల్లేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైమ్‌ని తీసి వాడుకుంటాను’’అని ఆమె బదులిస్తూ ‘టైం బ్యాంక్’ గురించి మహేష్‌కు వివరించింది. టైం బ్యాంక్ పథకం గురించి పూర్తిగా తెలుసుకున్న మహేష్ తన ఫేస్బుక్ పేజీలో స్నేహితులతో టైం బ్యాంక్ గురించి వివరించాడు. దరఖాస్తు ఎలా చెయ్యాలి? స్విట్జర్లాండ్‌లో ఉన్న ఏ దేశ పౌరుడైనా సరే దీనికి దరఖాస్తు చేసుకునేలా అక్కడి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. దరఖాస్తులకు సంబంధించి స్విట్జర్లాండ్ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక యాప్‌లను కూడా రూపొందించింది. వీటిలో దరఖాస్తుదారుడి వివరాలు (పేరు, వయసు, ఎన్ని గంటలు పని చెయ్యాలని అనుకుంటున్నారు తదితర అంశాలు) పేర్కొనాల్సి ఉంటుంది. దరఖాస్తు నింపి దానిని సబ్మిట్ చేసిన అనంతరం స్థానికంగా ఉన్న బ్యాంకు అధికారి వద్దకు ఆ వివరాలు వెళతాయి. అధికారి పరిశీలన అనంతరం దరఖాస్తుదారుడి ఫోన్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. అందులో ఎవరి వద్దకు వెళ్లాలి, వారి వివరాలు అన్ని తెలియపరుస్తారు. దరఖాస్తులో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏడాది కాలపరిమితి తర్వాత ఈ పని గంటలన్నిటినీ కలిపి దరఖాస్తుదారుడికి ఒక కార్డు ఇస్తుంది టైం బ్యాంక్. కూడబెట్టుకున్న టైంకి వడ్డీ కూడా ఇస్తుంది. ఆ కార్డును ఉపయోగించి, తనకు ఎప్పుడు సేవలు అవసరమైతే అప్పుడు ఇంకొకరి దగ్గర్నుంచి సేవలను పొందవచ్చు. దరఖాస్తుదారుడి అకౌంట్‌ను పరిశీలించి, బ్యాంక్ సిబ్బందే వలంటీర్లను పంపుతారు. ఆ సేవలు చేయడానికి వచ్చేవారికి సేవ చేయించుకునే వ్యక్తులు డబ్బులు చెల్లించనక్కర్లేదు. వాళ్లకూ ఒక అకౌంట్ ఉంటుంది కదా.. ఆ అకౌంట్లో వాళ్ల టైమ్ జమ అవుతుంది. తమ వృద్ధాప్యంలో వాళ్లు ఆ టైమ్‌ని ‘విత్‌డ్రా’ చేసుకోవచ్చు. ఏమిటీ ఈ టైం బ్యాంక్? ‘టైం బ్యాంక్‘ అనేది స్విస్ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అభివృద్ధి చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం. యవ్వనంలో ఉన్నవారు పెద్దవాళ్లకు సేవలు చేస్తే, వీళ్లు పెద్దవాళ్లయ్యాక సేవలు పొందడానికి వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తులు తాము యవ్వనంలో ఉన్నప్పుడు వృద్ధుల గురించి శ్రద్ధ తీసుకునే సమయాన్ని టైంబ్యాంక్ లో దాచిపెడతారు. దాన్ని వారు వృద్ధులు, అనారోగ్యం పాలైనప్పుడు వాడుకొంటారు. టైం బ్యాంక్‌లో చేరే దరఖాస్తుదారులు (వ్యక్తులు) ప్రతిరోజు వారు తమ విరామ సమయాన్ని..సహాయం అవసరమైన వృద్ధులను చూసుకోవడానికి కేటాయిస్తారు. వారి సేవా గంటలు సామాజిక భద్రతా వ్యవస్థలోని వ్యక్తిగత ఖాతాల్లో టైం బ్యాంక్ జమచేస్తుంది. అలా నిర్దిష్ట కాల పరిమితి ముగిసిన తరువాత టైం బ్యాంక్ దరఖాస్తుదారుడి పనిగంటలను లెక్కించి అతడికి ‘టైం బ్యాంక్ కార్డు‘ను జారీ చేస్తుంది. అది అవసరమైనప్పుడు అతడు ఆ బ్యాంక్ నుంచి ‘టైం బ్యాంక్ కార్డు‘ను ‘టైం అండ్ వడ్డీ‘ తో ఉపసంహరించుకొని ఉపయోగించవచ్చు. సమాచారం పరిశీలన తర్వాత, ‘టైం బ్యాంక్‘ స్వచ్ఛంద సేవకులను దరఖాస్తుదారుడికి ఆసుపత్రి పనులు లేదా ఇంటి పనులు చేయడానికి నియమిస్తుంది. ఇందులో చేరడానికి అర్హతలు ఏంటి? టైం బ్యాంక్‌లో చేరాలంటే దీనికి కొన్ని ప్రత్యేక అర్హతలు కలిగి ఉండాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. అందులో ముఖ్యంగా ఈ టైం బ్యాంక్‌లో జాయిన్ అయ్యేవారు.. ►ఆరోగ్యంగా ఉండాలి ►చక్కగా మాట్లాడగలిగే నేర్పు ఉండాలి ►వృద్ధులపై ప్రేమతో ప్రవర్తించాలి ఇలా రోజుకు ఎన్ని గంటల పాటు సేవలు అందిస్తారో, అన్ని గంటల్నీ టైం బ్యాంకులోని తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకునే సౌలభ్యాన్ని అక్కడి ప్రభుత్వం కల్పించింది. ఎవరికి లాభం? అయితే ఈ తరహా టైం బ్యాంకుల వల్ల ఎవరికి లాభం అనే అంశాలను పరిశీలిస్తే ఇది దరఖాస్తుదారుడికి, సేవలు అందుకునే వారికి ఇద్దరికీ ఉపయోగం అని చెప్పవచ్చు. చాలామంది స్విస్ పౌరులు ఈ రకమైన ఓల్డ్–ఏజ్ పెన్షన్లను బలపరుస్తున్నారు. స్విస్ పెన్షన్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. స్విస్ యువకుల్లో సగం మంది ఈ తరహా వృద్ధుల సంరక్షణ సేవలో పాల్గొనాలని కోరుకొంటున్నారు. వృద్ధాప్యం కోసం సమయాన్ని ఇలా కూడబెట్టుకోవడం స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు సర్వసాధారణం. టైం బ్యాంక్ వల్ల ప్రభుత్వానికి పింఛన్ భారం కూడా గణనీయంగా తగ్గిపోయింది. అలాగే కొన్ని సామాజిక సమస్యలకు కూడా టైం బ్యాంక్ చక్కటి పరిష్కారం అయ్యింది. స్విస్ పెన్షన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం..స్విటర్లాండ్లోని యువతీయువకుల్లో సగం మందికి పైగా వృద్ధాప్య సేవల్లో పాల్పంచుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. టైం బ్యాంక్‌ని మరింత ప్రోత్సహించేందుకు ఉన్న అవకాశాలను స్విస్ ప్రభుత్వం కూడా పరిశీలిస్తోంది. ఇందుకుగాను కొన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఈ పథకాన్ని అప్పగించి మరింత విస్తరించడానికి చర్యలు తీసుకుంటుంది. -
ఇక ఫేస్బుక్లో టైమ్ మేనేజ్మెంట్
పారిస్: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో మీరు ఎక్కువ సమయం గడిపేస్తున్నారని బాధపడుతున్నారా..? ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు రోజుకు పరిమిత సమయమే కేటాయించాలని కోరుకునే వారికోసం ఈ రెండు సోషల్ మీడియా సైట్లలో టైమ్ మేనేజ్మెంట్ ఆప్షన్లను ప్రవేశపెట్టనున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. దీనిలో భాగంగా నోటిఫికేషన్లను పరిమితం చేయడం, ఎంతసేపు ఆయా సైట్లలో గడిపారో తెలుసుకునేలా కొత్త ఆప్షన్లను తీసుకురానున్నట్లు తెలిపింది. దీనికోసం యూజర్లు ముందుగా ఎంత సమయం ఈ సైట్లలో గడపాలనుకుంటున్నారో సమయం ఫిక్స్చేసుకోవాలి. తర్వాత ఫేస్బుక్ నుంచి ఓ అలర్ట్ వస్తుంది. దీంతో యూజర్లు ఈ సైట్లను వదిలి ఇతర పనుల్లో నిమగ్నం అయ్యే అవకాశం ఉంటుందని సంస్థ భావిస్తోంది. అలాగే మొబైల్స్‌కు వచ్చే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నోటిఫి కేషన్లను డీయాక్టివేట్ చేసుకునే ఆప్షన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. -
'సమయానికి వెళ్లకుంటే వేతనం లేని సెలవే'
హైదరాబాద్ : సమయానికి కార్యాలయాలకు రాని అధికారులు, ఉద్యోగులకు వేతనం లేని సెలవుగా పరిగణించేందుకు కూడా వెనుకాడబోమని ఏపీ సాధారణ పరిపాలన శాఖ హెచ్చరించింది. సచివాలయంలోని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రహి మంగళవారం ఈ మేరకు ఒక సర్క్యులర్ మెమో జారీ చేశారు. సచివాలయ అధికారులు, ఉద్యోగులు సమయానికి విధులకు రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. సచివాలయ అధికారులు, ఉద్యోగులు ఉదయం 10.30 గంటలకల్లా విధుల్లో ఉండాలని, సాయంత్రం 5 గంటలకు వరకు పనిచేయాలని నిబంధనలు పేర్కొంటున్నప్పటికీ చాలా మంది పాటించడం లేదని ఆ మెమోలో స్పష్టం చేశారు. ప్రతీ రోజు ఉదయం 10.30 గంటలకన్నా ముందుగానే హాజరు పట్టికలో సంతకం చేయాలని పేర్కొన్నారు. కేవలం గ్రేస్ పిరియడ్ కింద పది నిమిషాలు ఇస్తామని, 10.40 దాటితే గ్రేస్ పీరియడ్ కూడా వర్తించదని మెమోలో పేర్కొన్నారు. గ్రేస్ పీరియడ్ కాగానే సంబంధిత విభాగం ఓపీ ఇంచార్జ్ హాజరు రిజిష్టర్లను అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, డిప్యుటీ కార్యదర్శికి అప్పగించాలని మెమోలో స్పష్టం చేశారు. 10.40 గంటలు తరువాత అధికారులు, ఉద్యోగులు ఎవరైనా విధులకు హాజరైతే అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి దగ్గరకు వెళ్లి వారి సమక్షంలో హాజరు రిజిష్టర్‌లో సంతకం చేయాలని మెమోలో పేర్కొన్నారు. అలాంటి సంతకం చేసిన చోట అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి రెడ్ ఇంక్‌తో ఎల్ అనే హాజరు పట్టికలో రాయాలని పేర్కొన్నారు. -
గడప దాటకుండానే గడించండి...
కాస్తంత నైపుణ్యం .. మరికాస్త సమర్ధత ఉంటే చాలు ఇంటి నుంచి కదలకుండా ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రస్తుతం మార్గాలనేకం ఉన్నాయి. టైమ్ మేనేజ్మెంట్ గురించి తెలిస్తే ఇటు ఇంటి బాధ్యతలు అటు వ్యాపార బాధ్యతల మధ్య సమతూకం పాటించడం అంత కష్టం కాదు. చక్కగా చేసుకోగలిగితే పెద్దగా పెట్టుబడితో పనిలేకుండానే .. చెప్పుకోతగ్గ స్థాయిలో ఆదాయం అందించే చిన్న స్థాయి వ్యాపారాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని.. కుకింగ్ క్లాసులు నోరూరించే, రుచికరమైన వివిధ రకాల వంటకాలు.. ప్రయోగాలు చేయడంలో మీరు ఎక్స్‌పర్టా? అందరి వహ్వాలు అందుకుంటుంటారా. అలాంటప్పుడు మీ నైపుణ్యాన్ని కేవలం వంటగదికే పరిమితం చేయకండి. మీకు తెలిసిన విద్యను ఇంకొందరికి నేర్పించే ప్రయత్నం చేయండి. కుకింగ్ క్లాస్ల్లాంటివి నిర్వహించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాకా ఎక్కడెక్కడి వంటల గురించి తెలుసుకునే వీలు ఉంటోంది. అలాంటి వాటిపై ఆసక్తి కూడా పెరుగుతోంది. కాబట్టి దీన్ని మీరు వ్యాపారావకాశంగా మార్చుకునే వీలుంది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ రకాల్లో కొంగొత్త వంటకాలను పరిచయం చేయండి. కుదిరితే వంటకాల తయారీ ప్రక్రియను వీడియోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయొచ్చు. తమిళనాడుకు చెందిన డెభ్భై ఏళ్ల బామ్మగారు ఇదే పనిచేస్తున్నారు కూడా. తాను చేసే వంటకాలను కుటుంబసభ్యులతో వీడియోలు తీయించి యూట్యూబ్‌లో ఉంచుతారు. ప్రస్తుతం ఆ బామ్మగారికి దేశ విదేశాల్లో బోల్డంత మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. టేస్ట్‌కు తగ్గట్లు కస్టమైజేషన్ కొన్ని మినహాయించి చాలామటుకు ఉత్పత్తులను ఎలా ఉంటే అలా కొనేయకుండా తమ అభిరుచులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చే యించి తీసుకునేందుకు (కస్టమైజేషన్) కొనుగోలుదారులు ప్రాధాన్యమిస్తున్నారు. విక్రేతలు కూడా ప్రత్యేకంగా ఆయా కస్టమర్లు కోరుకున్నట్లు తగిన మార్పులు చేసి అందిస్తున్నారు. ఆభరణాలు, వాల్ ఆర్ట్, ఫ్యాబ్రిక్స్, దుస్తులు, టీ-షర్టులు, పిల్లల దుస్తులు, ఇతర యాక్సెసరీలు లాంటివాటిల్లో కస్టమైజేషన్కి ప్రాధాన్యం పెరిగింది. కనుక, ఇలాంటి సర్వీసులు అందించగలిగితే మంచి ఆదాయమార్గం అందుకోవచ్చు. నర్సరీ.. ప్రస్తుతం నగరవాసుల్లో మొక్కల పెంపకంపై ఆసక్తి పెరుగుతోంది. పచ్చదనంపై ఆసక్తి ఉన్న పక్షంలో దీన్ని కూడా వ్యాపారావకాశంగా మల్చుకోవచ్చు. కాస్త జాగా అందుబాటులో ఉంటే చిన్నపాటి నర్సరీ లాంటిది ప్రారంభించవచ్చు. మొక్కలు ఒక మోస్తరు స్థాయికి ఎదిగిన తర్వాత రిటైల్‌గా గానీ లేదా వ్యాపార సంస్థలకు గానీ విక్రయించేసేయొచ్చు. వీలైతే ఒక వెబ్సైట్ పెట్టి.. మీ దగ్గరున్న మొక్కలు, విక్రయించే ఇతరత్రా ఉత్పత్తులు మొదలైన వాటి వివరాలు అందులో ఉంచడం ద్వారా ఆన్లైన్లో కస్టమర్లను కూడా సంపాదించుకోవచ్చు. మేకప్ సర్వీసులు... మేకప్, ఫ్యాషన్, సౌందర్య సాధనాలపై మీకు మంచి అభిరుచి ఉంటే దాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. వివాహాల్లో పెళ్లికూతుళ్ల అలంకరణకు సంబంధించిన సర్వీసులు అందించవచ్చు. ఇందుకోసం కుటుంబ సభ్యులు, సన్నిహితులు.. కొండొకచో ఇతరత్రా వెబ్సైట్లలో ప్రకటనల ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చు. మెహందీ, సంగీత్ వంటి ఫంక్షన్లు పరిపాటిగా మారిపోతున్నాయి కనుక.. తర్వాత దశలో ఆ సర్వీసులు కూడా అందించవచ్చు. వెడ్డింగ్ ప్లానింగ్... ఫంక్షన్లంటే బోలెడంత హడావుడి ఉంటుంది. అన్నింటిని సమర్థంగా చూసుకోగలిగితేనే ఏ మాట రాకుండా ఉంటుంది. ఇలాంటి వాటిని నిర్వహించగలిగే సామర్థ్యాలు, నైపుణ్యాలు మీలో ఉంటే .. వెడ్డింగ్ ప్లానింగ్వంటి సర్వీసులు అందించవచ్చు. ఏమేం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా నిర్వహించవచ్చు ఇలాంటి వన్నీ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. మిగతా సన్నిహితులు ఎవరికైనా కూడా ఇలాంటి ఆసక్తి ఉంటే వారితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ప్రస్తుతం ఈ తరహా ప్లానర్లకు డిమాండ్ బాగానే ఉంటోంది. వెబ్ డిజైనింగ్.. డీటీపీ.. ఇంటర్నెట్ ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో అంతా ఆన్లైన్ బాటపడుతున్నారు. కనుక, వెబ్ డిజైనింగ్ వంటి సాంకేతిక నైపుణ్యాలు మీకు ఉంటే వాటిని వినియోగించుకుని ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్, అవసరమైన సాఫ్ట్వేర్ ఉంటే చాలు ఇంటి దగ్గర్నుంచే వెబ్ డిజైనింగ్ సేవలు అందించవచ్చు. చిన్న చిన్న సంస్థలు ఇలాంటి జాబ్స్‌ను ఫ్రీలాన్సర్లకు ఔట్సోర్సింగ్ చేస్తుంటాయి కూడా. వాటి దగ్గర్నుంచి ప్రాజెక్టులు తీసుకుని, క్లయింట్ల కోసం వెబ్సైట్లను అందించవచ్చు. ఇక తక్కువ పెట్టుబడితో మొదలెట్టగలిగే వ్యాపారాల్లో డీటీపీ (డెస్క్‌టాప్ పబ్లిషింగ్) కూడా ఒకటి. ప్రతీ సంస్థకు ఏదో ఒక సందర్భంలో లెటర్హెడ్లు, కేటలాగ్స్, బ్రోచర్లు మొదలైనవి అవసరం పడుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్టులు దక్కించుకోగలిగితే డీటీపీ సేవల ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. దుస్తుల డిజైనింగ్.. బొటిక్... మహిళలకు అత్యంత అనువైన ఉపాధి అవకాశాల్లో ఇది ఒకటి. సాధారణంగానే మహిళలకు ఫ్యాషన్‌పై మంచి టేస్ట్ ఉంటుంది. యాక్సెసరీలు, కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ మొదలైన వాటిపై అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే దుస్తుల డిజైనింగ్ వ్యాపకంగా ఎంచుకోవచ్చు. అలాగే, చేతితో తయారు చేసిన యాక్సెసరీస్‌ని కూడా రూపొందించవచ్చు. సాధ్యపడితే తమ సొంత బొటిక్‌ను ఏర్పాటు చేయొచ్చు. -
టైమ్‌ను మేనేజ్ చేయండి!
జాబ్ స్కిల్స్: ప్రపంచంలో ప్రతి మనిషికి ఒకరోజులో ఉండే సమయం 24 గంటలే. కొందరు ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. మరికొందరి కి ఏ చిన్న పని చేద్దామన్నా సమయం సరిపోదు. ఎందుకిలా? టైమ్ మేనేజ్మెంట్ తెలియక పోవడం వల్లే ఫిర్యాదులతో కాలం గడిపేస్తుంటారు. కెరీర్లో ముందుకెళ్లలేక ఉన్న చోటే ఉండిపోతారు. సమయం అనేది అత్యంత విలువైన వనరు. గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగిరాదు. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవారే జీవిత సమరంలో విజయం సాధిస్తారు. టైమ్‌ను మీరు నియంత్రించాలి కానీ, టైమ్ మిమ్మల్ని నియంత్రించకుండా జాగ్రత్త పడండి. ఆఫీస్‌లో చేయాల్సిన పనులు ఎన్నో మిగిలిపోయాయి, పూర్తి చేద్దామంటే టైమ్ దొరకడం లేదు అని హైరానా పడుతున్నారా? అయితే ఈ సూచనలు మీలాంటి వారి కోసమే.. క్రమశిక్షణ పాటించండి మొదట ఆ రోజు చేయాల్సిన పనులపై స్పష్టత ఉండాలి. ప్రాధాన్యతలవారీగా వాటిని విభజించుకోవాలి. పూర్తిచేయడానికి డెడ్లైన్లను పెట్టుకోవాలి. గడువులోగా కచ్చితంగా పూర్తయ్యేలా ప్రయత్నించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ డెడ్‌లైన్ దాటకుండా జాగ్రత్తపడాలి. దీన్ని అలవాటుగా మార్చుకోవాలి. ప్రారంభంలో కొంత కష్టంగానే అనిపించినా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే గడువులోగా కార్యాచరణ పూర్తిచేయడం సులువుగా మారుతుంది. అనుకున్న సమయంలోగా పనులు చేయలేకపోతే ఎక్కువ సమయం కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల అలసిపోతారు. ఆశించిన ఫలితం రాదు, పనిపట్ల సంతృప్తి కూడా ఉండదు. ఫోన్‌కాల్స్‌కు నో చెప్పండి కార్యాలయాల్లో ఉద్యోగుల కార్యకలాపాలకు అంతరాయం కలిగించేది.. తరచుగా మోగే సెల్‌ఫోన్. దీనివల్ల చాలా సమయం వృథా అవుతుంది. ప్రొఫెషనల్ వరల్డ్‌లో ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవా లంటే ఫోన్‌కాల్స్ ముఖ్యమే. కానీ, చేస్తున్న పనిని వదిలేసి ఫోన్లో మాట్లాడుతూ కూర్చుంటే చాలా నష్టం జరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నవారికి ఇది మంచిది కాదు. టైమ్‌ను ఆదా చేయాలంటే అనవసరమైన ఫోన్‌కాల్స్‌కు నో చెప్పాల్సిందే. పని, సెల్‌ఫోన్.. దేని దారి దానిదే అన్నట్లుగా ఉండాలి. ఫోన్లో మాట్లాడడానికి కచ్చితమైన టైమ్ నిర్దేశించుకోవాలి. ఆఫీస్ నుంచి బయటి కొచ్చాక సెల్‌ఫోన్ స్విచ్ఛాన్ చేయడం ఉత్తమం. మార్నింగ్.. ప్రొడక్టివ్ టైమ్ ఉదయం పూట వాతావరణం, మనసు ప్రశాంతంగా ఉంటాయి. అది ప్రొడక్టివ్ టైమ్ అని అనేక సర్వేల్లో తేలింది. అంటే ఉదయం చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. కాబట్టి ఆఫీస్‌లో ముఖ్యమైన కార్యాలను ఉదయమే పూర్తిచేసేలా వర్క్ షెడ్యూల్ రూపొందించు కోండి. త్వరగా పనులు జరిగితే ఎంతో టైమ్ మిగులుతుంది. ఈ-మెయిల్స్ చూసుకోవడం లాంటి వాటిని మధ్యాహ్నం తర్వాత చేసేలా ప్రణాళిక రూపొందించుకోండి. పనిలో విరామం.. ఎంతసేపు కార్యాలయంలో సహచరులతో కలిసి కాఫీలు, టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటే తెలియకుండానే చాలా సమయం హరించుకుపోతుంది. ఇలాంటి వాటికి ఫుల్స్టాప్ పెట్టడమే మంచిది. పనిలో ఏదైనా సమస్య తలెత్తి, ఎంతసేపు ఆలోచించినా దానికి పరిష్కారం మార్గం దొరక్కపోతే.. కొంతసేపు విరామం తీసుకోవాలి. దీనివల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే కొత్త ఆలోచనలు వస్తాయి. విరామం అనేది ఎక్కువ టైమ్‌ను మింగేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. టెక్నాలజీని వాడుకోండి టైమ్ మేనేజ్మెంట్లో టెక్నాలజీ చాలా కీలకం. ఒకప్పుడు సమావేశాల కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడంతా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో సమయం ఆదా అవుతోంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ కార్యాలు చేయగలుగుతున్నారు. టైమ్ సేవ్ కావడంతోపాటు ఆఫీస్‌లో ఉత్పత్తి పెరగాలంటే టెక్నాలజీని వాడుకోండి. -
నో బాత్రూమ్... వియ్ హ్యావ్ ద ఫ్రీడమ్ !
మగాడిగా పుట్టడం వల్ల ఇలాంటి లాభాలు బోలెడన్ని. ఈ పట్టణానికి వచ్చి కొన్ని స్వేచ్ఛలు పోయాయి గాని... చిన్నతనంలో ఊర్లో ఉన్నపుడు అబ్బా ఆ కథే వేరు! హైదరాబాదులో కొన్ని ఏరియాలకు వెళ్లినప్పుడు.. పాడైన పాత చెప్పుల వల్ల కొందరికి ఉపయోగాలున్నాయన్న విషయం అర్థమైంది. అదెలాగంటారా? కొన్ని ఇళ్ల గోడల వద్ద ఓ ప్లాస్టిక్ తాడుకు వరుసగా 20-30 చెప్పులు వేలాడుతూ గ్రిల్ మాదిరి గోడలకి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఇంతకీ ఆ రక్షణ దేని నుంచో తెలుసా... మగాడి నుంచి! అవును మగాడి నుంచే. ప్రపంచాన్ని (ఇంతకుముందు నిర్జన ప్రదేశాలని రాయాల్సి వచ్చేది ఇపుడు ఆ బాధ కూడా లేదు) బాత్రూమ్గా భావించే మగాడి నుంచి ఆ గోడలకు రక్షణ కల్పిస్తూ ఉంటాయా పాత చెప్పులు. అదేంటో చిన్నప్పటి నుంచి మగాడు దాన్ని తనకు మాత్రమే ఉన్న ఓ స్వాతంత్య్రంలా భావిస్తాడు. ఆ స్వాతంత్య్రం అనుభవిస్తున్నపుడు అప్పుడప్పుడూ అనిపిస్తుంది మగాడిగా పుట్టడం వల్ల ఇలాంటి లాభాలు బోలెడన్ని. ఈ పట్టణానికి వచ్చి కొన్ని స్వేచ్ఛలు పోయాయి గాని... అబ్బా చిన్నతనంలో ఊర్లో ఉన్నపుడు ఆ కథే వేరు. ఇంటి ముందు ఓ నాపరాయి బండ మీద ఓ పక్క బక్కెట్టు, ఇంకో పక్క సోపు పెట్టుకుని ఎంచక్కా బాసింపట్లేసుకుని కూర్చుంటే... సెగలు కక్కుతున్న వేడినీళ్లు మళ్లీ మళ్లీ ఎన్ని బక్కెట్లు కావాలంటే అన్ని వచ్చేవి. చలికాలం అయితే, అదో గొప్ప సుఖం. వేడి నీళ్లు అలా పోసుకుంటాం.. ఇలా చలేస్తుంది.. మళ్లీ పోసుకుంటాం.. మళ్లీ చలేస్తుంది. అలా చెంబు చెంబుకు వచ్చే ఆ వెచ్చని సుఖం మహా గొప్పగా ఉండేదంటే నమ్మండి! అలా చలితో దోబూచులాడాలంటే బాత్రూమ్లో అస్సలు సాధ్యం కాదు. ఈ సదుపాయం బహిరంగ స్నానంలోనే దొరుకుతుంది. ఇంకో విషయం ఏంటంటే... ఇందులో ఓ బోనస్ కూడా ఉంది. స్త్రీలకు మల్లే వేడినీటిని సర్దుకోవాల్సిన అవసరం ఉండదు. వారికి ఒకసారి స్నానాల గదిలోకి ఒక వేడి నీళ్ల బకెట్ తీసుకెళ్తే చల్లబడినా దాంతోనే సర్దుకోవాలి కదా. కానీ.. బహిరంగ స్నానం చేసే మగాడికి మాత్రం కావల్సినన్ని ఎక్స్ట్రా బక్కెట్ల సుఖం లభిస్తుంది. దీనికి మరో కోణమూ ఉంది. అదే టైమ్ మేనేజ్మెంట్. ఓపెన్ బాత్ (దీనిని ఇలా పిలుస్తాం మేము)లో సమయం వృథా కాదు. ‘ఈయన సంతకం పెట్టడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటాడేమో’ అన్నట్లు ఒక వైపు అక్కడే అరుగుమీద కూర్చున్న మిత్రులతో ముచ్చట్లు కొనసాగుతుండేవి. అప్పుడు కూడా జోకులు, ముచ్చట్లు, కబుర్లు... మధ్య మధ్యలో ఇంట్లో వాళ్ల తిట్లు! అవి కూడా కూరలో మసాలాలా బానే ఉంటాయి. నాకు తెలిసి మా ఊర్లో ఆ టైమ్‌లో కూడా గొడవపడే భార్యాభర్తలను ఎంతో మందిని చూశాను. అయినా ఈ అదృష్టాలన్నీ ఆడవాళ్లకెక్కడున్నాయి! చదువుకి, డబ్బుకి, అగ్నికి, నీళ్లకి ఉన్నట్టు ... మగాళ్లకు కూడా ఓ దేవుడు ఉంటే చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలని ఉంది! - ప్రకాష్ చిమ్మల ఇంటి ముందు ఓ నాపరాయి బండ మీద ఓ పక్క బక్కెట్టు, ఇంకో పక్క సోపు పెట్టుకుని ఎంచక్కా బాసింపట్లేసుకుని కూర్చుంటే... సెగలు కక్కుతున్న వేడినీళ్లు మళ్లీ మళ్లీ ఎన్ని బక్కెట్లు కావాలంటే అన్ని వచ్చేవి.