Photo: IPL Twitter
క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన లీగ్సలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి స్థానంలో ఉంటుంది. అలా ఉంది కాబట్టే ఇప్పటికే 15 సీజన్లు విజయవంతగా ముగించుకొని ప్రస్తుతం 16వ సీజన్‌లో అడుగుపెట్టింది. టి20 ఫార్మాట్‌లో సాగే మ్యాచ్‌లు కాబట్టి మూడున్నర గంటల్లోనే ఫలితం తేలుతుంది. అందుకే జనాలకు ఇది బాగా ఎక్కేసింది. అయితే రాను రాను ఐపీఎల్‌లో మ్యాచ్‌లు సాగిపోతున్నాయి. మూడున్నర గంటల్లోగా ముగిసిపోవాల్సిన మ్యాచ్‌లు నాలుగు గంటలు దాటిపోతున్నాయి. ఒకరకంగా టైం సెన్స్ లేకుండా సాగిపోతున్న మ్యాచ్‌లు చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది.
Photo: IPL Twitter
అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న కఠిన నిబంధనలు ఇక్కడ లేకపోవడం, నిర్వాహకులు కూడా దీనిని పెద్దగా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఐపీఎల్ కు అసలు టైమ్ సెన్స్ లేకుండా పోతోంది. అంతర్జాతీయ క్రికెట్ లో లేని స్ట్రేటజిక్ టైమౌట్.. ఐపీఎల్లో ఉంటుంది. ఒక్కో ఇన్నింగ్స్ లో రెండుసార్లు, మొత్తం ఐదు నిమిషాల పాటు ఈ స్ట్రేటజిక్ టైమౌట్ ను వాడుకుంటున్నారు. దీనికితోడు ఫీల్డింగ్ లో తరచూ మార్పులు, ఉత్కంఠ సమయాల్లో ప్రతి బంతికీ వ్యూహాలతో అసలు టైమ్ ను పట్టించుకున్న నాథుడు లేకుండా పోతున్నాడు. ఈ సీజన్ లో ఒక్క ఇన్నింగ్స్ కూడా నిర్ధారిత 90 నిమిషాల్లో పూర్తి కాలేదు.
Photo: IPL Twitter
అలా చేయకపోతే ఆ తర్వాత మిగిలిన ఓవర్లకు 30 గజాల సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లనే అనుమతించాలన్న నిబంధన ఉన్నా దానిని అమలు చేయడం లేదు. ఇక ఈ సీజన్ లో అంపైర్లు ఇచ్చిన వైడ్లు, నోబాల్స్ ను కూడా ఛాలెంజ్ చేస్తుండటం వల్ల మరింత టైమ్ వేస్ట్ అవుతోంది. ప్లేయర్స్ రివ్యూలు, అంపైర్లు రివ్యూలు, గాయాలు.. ఇలా మ్యాచ్ లు నాలుగు గంటల పాటు సాగడానికి కారణాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్‌కు కొత్తగా తెచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కూడా సమయం వృథా అవుతుంది.
Photo: IPL Twitter
మొన్న రాజస్థాన్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమై.. రాత్రి 11.42కు ముగిసిందంటే ఈ మ్యాచ్ లు ఎంతగా సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో ఓ వైడ్ బాల్ ను వైడో కాదో తేల్చడానికి కూడా మూడో అంపైర్ చాలా సమయం తీసుకున్నాడు.
చివరికి రెండున్నర నిమిషాల తర్వాత కూడా ఆ థర్డ్ అంపైర్ ఇచ్చింది తప్పుడు నిర్ణయమే అని మాజీ క్రికెటర్ టామ్ మూడీ ట్వీట్ చేశాడు. అసలు టి20 కాన్సెప్ట్ తెచ్చిందే వేగంగా క్రికెట్ మ్యాచ్ ను పూర్తి చేసి ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసం. ఎంత మన ఐపీఎల్ అయినా చూసేవారికి విసుగు పుట్టించేలా మాత్రం తయారు కాకూడదు.
కానీ ఐపీఎల్లో ఇలా సుదీర్ఘంగా సాగుతున్న మ్యాచ్ లు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ప్రతి రోజూ రాత్రి 11.30 వరకూ మేలుకొని మ్యాచ్ లు చూడటం ఎవరికైనా ఇబ్బందే. రాత్రిళ్లు ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతోనే గతంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ ను 7.30 కే ప్రారంభిస్తున్నారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది.
చదవండి: ప్రతిసారీ వాళ్లమీదే ఆధారపడితే ఎలా? బెటర్ ఆప్షన్ ఉంటే అతడి స్థానంలో..
నీరజ్‌చోప్రా తమ్ముడిలా ఉన్నాడు.. 'ఇంపాక్ట్'ను భలే వాడింది పో!
Comments
Please login to add a commentAdd a comment