Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ అంటూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది బీసీసీఐ. అయితే ఈ ఇంపాక్ట్ వల్ల ఇప్పటికైతే పెద్దగా ప్రయోజనం చేకూరలేదు. ఇది సీజన్ ఆరంభమే కాబట్టి ఇప్పుడే ఇంపాక్ట్ గురించి మాట్లాడడం తప్పే కానీ పెద్దగా ఉపయోగం లేని ఇంపాక్ట్ అవసరమా అని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నించడం ఆసక్తి కలిగించింది.
ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏంటి?
రూల్ ప్రకారం రెండు టీమ్స్ తమ తుది జట్టులోని ఓ ప్లేయర్‌ను మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ మరో ప్లేయర్‌తో భర్తీ చేయవచ్చు. ఇది కచ్చితం ఏమీ కాదు. ఒకవేళ వాళ్లకు అది ఉపయోగపడుతుందనుకుంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ పేరుతో ఈ నిబంధన అమల్లో ఉంది. ఈ ప్లేయర్‌ను ముందుగానే 12 లేదా 13వ ప్లేయర్‌గా ప్రకటించాలి. ఫస్ట్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ తర్వాత ఈ ప్లేయర్‌ను ఆయా టీమ్స్ తీసుకునే వీలుంటుంది.
Photo: IPL Twitter
అయితే ఐపీఎల్‌లో పరిచయం చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన కాస్త భిన్నంగా ఉంటుంది. రెండు ఇన్నింగ్స్‌లోనూ 14వ ఓవర్ ముగిసేలోపే ఈ ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించాల్సి ఉంటుంది. కెప్టెన్, హెడ్‌కోచ్, మేనేజర్ ఈ విషయాన్ని ఆన్‌ఫీల్డ్ అంపైర్లు, లేదా నాలుగో అంపైర్‌కు చెప్పాలి. ఒకవేళ గాయపడిన ప్లేయర్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకుంటే.. ఆ గాయపడిన ప్లేయర్ మళ్లీ ఫీల్డ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉండదు.
ఓ ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఓవర్ ముగిసిన తర్వాతే తీసుకోవాల్సి ఉంటుంది. గాయపడిన సందర్భాల్లో అయితే ఇప్పుడున్న నిబంధనల ప్రకారమే ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఆయా టీమ్స్ ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ బ్యాటింగ్ టీమ్ ఇంపాక్ట్ ప్లేయర్‌ను బరిలోకి దించాలని అనుకుంటే.. వికెట్ పడిన తర్వాత లేదంటే ఇన్నింగ్స్ బ్రేక్‌లో మాత్రమే చేయాలి. ముందుగానే ఈ విషయాన్ని నాలుగో అంపైర్‌కు చెప్పాలి.
పెద్దగా ఉపయోగపడని 'ఇంపాక్ట్'
అయితే ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలి నాలుగు రోజుల్లో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్ల ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో జట్లు విఫలమవుతున్నాయా లేక పరిస్థితులు అనుకూలించడం లేదా అనేది చెప్పలేం. కానీ మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శన మాతరం ఏ ఇంపాక్ట్ ప్లేయర్ ఇప్పటిదాకా చేయలేదు. మరి రానున్న మ్యాచ్‌ల్లో అయినా ప్రభావం ఉంటుందేమో చూడాలి.
►ఐపీఎల్‌లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఆటగాడు తుషార్ దేశ్‌పాండే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో అంబటి రాయుడు స్థానంలో తుషార్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. కానీ మూడు ఓవర్లలోనే 51 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
► ఇక ఇదే మ్యాచ్‌లో విలియమ్సన్ గాయపడడంతో రెండో ఇన్నింగ్స్‌లో 'ఇంపాక్ట్' ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. అయితే గుజరాత్ ఈ మ్యాచ్ గెలిచింది.
► ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో కేకేఆర్.. వరుణ్ చక్రవర్తి స్థానంలో వెంకటేశ్ అయ్యర్‌ను ఇంపాక్ట్ ఆటగాడిగా దింపింది. 28 బంతుల్లో 34 పరుగులు చేసినప్పటికి అతను నెమ్మదిగా ఆడడంతో పంజాబ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక పంజాబ్ బానుక రాజపక్స స్థానంలో రిషి ధావన్‌ను ఆడించగా అతను ఒక్క ఓవర్లోనే 15 పరుగులు ఇచ్చుకున్నాడు.
► ఢిల్లీతో మ్యాచ్‌లో లక్నో ఆయుష్ బదోని ఔటవ్వగానే కృష్ణప్ప గౌతమ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చింది. అతను చివరి బంతికి సిక్సర్ బాదాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం 4 ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయాడు.
► రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తమ బ్యాటింగ్ సమయంలో పేసర్ ఫారుకీ స్థానంలో అబ్దుల్ సమద్‌ను తీసుకొచ్చింది. అతను సిక్సర్లతో విరుచుకుపడుతూ 32 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ అప్పటికే ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి ఖరారైంది.ఇక ఇదే మ్యాచ్‌లో రాజస్తాన్.. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ స్థానంలో నవదీప్ సైనీనీ ఆడించింది. కానీ సైనీ 2 ఓవర్లలో ఏకంగా 34 పరుగులిచ్చుకున్నాడు.
► ఇక ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ముంబై సూర్య స్థానంలో పేసర్ జాసన్ బెండార్ఫ్‌ను తీసుకొచ్చింది. ఏ మాత్రం ప్రభావం చూపించకపోగా మూడు ఓవర్లలో 37 పరుగులిచ్చుకున్నాడు. ఇక సీజన్‌లో ఇప్పటివరకు ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఉపయోగించని జట్టు ఆర్‌సీబీ మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment