నో బాత్‌రూమ్... వియ్ హ్యావ్ ద ఫ్రీడమ్ !
మగాడిగా పుట్టడం వల్ల ఇలాంటి లాభాలు బోలెడన్ని. ఈ పట్టణానికి వచ్చి కొన్ని స్వేచ్ఛలు పోయాయి గాని... చిన్నతనంలో ఊర్లో
ఉన్నపుడు అబ్బా ఆ కథే వేరు!
హైదరాబాదులో కొన్ని ఏరియాలకు వెళ్లినప్పుడు.. పాడైన పాత చెప్పుల వల్ల కొందరికి ఉపయోగాలున్నాయన్న విషయం అర్థమైంది. అదెలాగంటారా? కొన్ని ఇళ్ల గోడల వద్ద ఓ ప్లాస్టిక్ తాడుకు వరుసగా 20-30 చెప్పులు వేలాడుతూ గ్రిల్ మాదిరి గోడలకి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఇంతకీ ఆ రక్షణ దేని నుంచో తెలుసా... మగాడి నుంచి! అవును మగాడి నుంచే. ప్రపంచాన్ని (ఇంతకుముందు నిర్జన ప్రదేశాలని రాయాల్సి వచ్చేది ఇపుడు ఆ బాధ కూడా లేదు) బాత్‌రూమ్‌గా భావించే మగాడి నుంచి ఆ గోడలకు రక్షణ కల్పిస్తూ ఉంటాయా పాత చెప్పులు.
అదేంటో చిన్నప్పటి నుంచి మగాడు దాన్ని తనకు మాత్రమే ఉన్న ఓ స్వాతంత్య్రంలా భావిస్తాడు. ఆ స్వాతంత్య్రం అనుభవిస్తున్నపుడు అప్పుడప్పుడూ అనిపిస్తుంది మగాడిగా పుట్టడం వల్ల ఇలాంటి లాభాలు బోలెడన్ని. ఈ పట్టణానికి వచ్చి కొన్ని స్వేచ్ఛలు పోయాయి గాని... అబ్బా చిన్నతనంలో ఊర్లో ఉన్నపుడు ఆ కథే వేరు.
ఇంటి ముందు ఓ నాపరాయి బండ మీద ఓ పక్క బక్కెట్టు, ఇంకో పక్క సోపు పెట్టుకుని ఎంచక్కా బాసింపట్లేసుకుని కూర్చుంటే... సెగలు కక్కుతున్న వేడినీళ్లు మళ్లీ మళ్లీ ఎన్ని బక్కెట్లు కావాలంటే అన్ని వచ్చేవి. చలికాలం అయితే, అదో గొప్ప సుఖం. వేడి నీళ్లు అలా పోసుకుంటాం.. ఇలా చలేస్తుంది.. మళ్లీ పోసుకుంటాం.. మళ్లీ చలేస్తుంది. అలా చెంబు చెంబుకు వచ్చే ఆ వెచ్చని సుఖం మహా గొప్పగా ఉండేదంటే నమ్మండి! అలా చలితో దోబూచులాడాలంటే బాత్‌రూమ్‌లో అస్సలు సాధ్యం కాదు. ఈ సదుపాయం బహిరంగ స్నానంలోనే దొరుకుతుంది. ఇంకో విషయం ఏంటంటే... ఇందులో ఓ బోనస్ కూడా ఉంది. స్త్రీలకు మల్లే వేడినీటిని సర్దుకోవాల్సిన అవసరం ఉండదు. వారికి ఒకసారి స్నానాల గదిలోకి ఒక వేడి నీళ్ల బకెట్ తీసుకెళ్తే చల్లబడినా దాంతోనే సర్దుకోవాలి కదా. కానీ.. బహిరంగ స్నానం చేసే మగాడికి మాత్రం కావల్సినన్ని ఎక్స్‌ట్రా బక్కెట్ల సుఖం లభిస్తుంది.
దీనికి మరో కోణమూ ఉంది. అదే టైమ్ మేనేజ్‌మెంట్. ఓపెన్ బాత్ (దీనిని ఇలా పిలుస్తాం మేము)లో సమయం వృథా కాదు. ‘ఈయన సంతకం పెట్టడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటాడేమో’ అన్నట్లు ఒక వైపు అక్కడే అరుగుమీద కూర్చున్న మిత్రులతో ముచ్చట్లు కొనసాగుతుండేవి. అప్పుడు కూడా జోకులు, ముచ్చట్లు, కబుర్లు... మధ్య మధ్యలో ఇంట్లో వాళ్ల తిట్లు! అవి కూడా కూరలో మసాలాలా బానే ఉంటాయి. నాకు తెలిసి మా ఊర్లో ఆ టైమ్‌లో కూడా గొడవపడే భార్యాభర్తలను ఎంతో మందిని చూశాను. అయినా ఈ అదృష్టాలన్నీ ఆడవాళ్లకెక్కడున్నాయి! చదువుకి, డబ్బుకి, అగ్నికి, నీళ్లకి ఉన్నట్టు ... మగాళ్లకు కూడా ఓ దేవుడు ఉంటే చాలా చాలా కృతజ్ఞతలు చెప్పాలని ఉంది!
- ప్రకాష్ చిమ్మల
ఇంటి ముందు ఓ నాపరాయి బండ మీద ఓ పక్క బక్కెట్టు, ఇంకో పక్క సోపు పెట్టుకుని ఎంచక్కా బాసింపట్లేసుకుని కూర్చుంటే... సెగలు కక్కుతున్న వేడినీళ్లు మళ్లీ మళ్లీ ఎన్ని బక్కెట్లు కావాలంటే అన్ని వచ్చేవి.