సాక్షి, హైదరాబాద్: సమయపాలన పాటించకుండా..విధులకు మీ ఇష్టానుసారంగా వస్తే ఎలా అంటూ సచివాలయ ఉద్యోగులపై రాష్ట్ర రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో పలు విభాగాలను మంత్రి పొంగులేటి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు ఎంత మంది సమయానికి హాజరవుతున్నారో తెలుసుకునేందుకు ఉదయం 11:40 నిమిషాలకు మంత్రి సచివాలయంలోని రెవెన్యూ శాఖకు వెళ్లారు.
ఎక్కడ చూసినా ఖాళీ కుర్చిలే కనిపించాయి. దీంతో అక్కడే ఉన్న సిబ్బందిని పిలిచి ఆరా తీశారు. ఎవరైనా సెలవులో ఉన్నారా అని అడిగారు. వారు చెప్పిన జవాబుతో ఆయన సంతృప్తి చెందలేదు. మీరే ఇలా చేస్తే ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా? ‘ఉదయం 11: 40 దాటినా ఇంకా 80 శాతం మందికిపైగా ఉద్యోగులు విధుల్లో రాకపోవడం ఏంటని..’ మంత్రి వారిని ప్రశ్నించారు.
రిజిస్టర్ తనిఖీ.. పలు విభాగాల పరిశీలన
తనిఖీలో భాగంగా ఉద్యోగుల హాజరు పట్టిక తీసుకురావాలని అక్కడే ఉన్న సిబ్బందిని మంత్రి ఆదేశించారు. రిజిస్టర్ పరిశీలించి ఒక్కో సెక్షన్‌లో ఈ సమయంలో కూడా ముగ్గురు నలుగురే ఉంటే ఎలా అని మండిపడ్డారు. ప్రభుత్వ వారధిగా మీరే సమయానికి రాకపోతే ఎలా? అన్నారు.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వానికి సమాచారం, అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళతారని నిలదీశారు. రెవెన్యూ విభాగంలోని ఐదు సెక్షన్లలో ఏ సెక్షన్‌లో కూడా పూర్తిస్థాయిలో ఉద్యోగులు సమయానికి హాజరు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉద్యోగులు, సెక్షన్ ఇన్‌చార్జ్‌పై చర్యలు తీసుకుంటాం
సచివాలయంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సమయానికి విధుల్లోకి రావాలి. ఉద్యోగుల కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన పరిస్థితి రావొద్దు. అనివార్య కారణాలు ఉంటే సెక్షన్ ఇన్‌చార్జ్‌కు సమాచారం ఇవ్వాలి. ముందస్తు సమాచారం లేకుండా విధుల్లో నిర్లక్ష్యం చేస్తే ఆయా ఉద్యోగులు, సెక్షన్ ఇన్‌చార్జ్‌పై చర్యలు తప్పవు. – మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment