టైమ్‌ను మేనేజ్ చేయండి!
జాబ్ స్కిల్స్: ప్రపంచంలో ప్రతి మనిషికి ఒకరోజులో ఉండే సమయం 24 గంటలే. కొందరు ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకొని అనుకున్న పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. మరికొందరి కి ఏ చిన్న పని చేద్దామన్నా సమయం సరిపోదు. ఎందుకిలా? టైమ్ మేనేజ్‌మెంట్ తెలియక పోవడం వల్లే ఫిర్యాదులతో కాలం గడిపేస్తుంటారు. కెరీర్‌లో ముందుకెళ్లలేక ఉన్న చోటే ఉండిపోతారు. సమయం అనేది అత్యంత విలువైన వనరు. గడిచిపోయిన కాలం ఎప్పటికీ తిరిగిరాదు. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినవారే జీవిత సమరంలో విజయం సాధిస్తారు. టైమ్‌ను మీరు నియంత్రించాలి కానీ, టైమ్ మిమ్మల్ని నియంత్రించకుండా జాగ్రత్త పడండి. ఆఫీస్‌లో చేయాల్సిన పనులు ఎన్నో మిగిలిపోయాయి, పూర్తి చేద్దామంటే టైమ్ దొరకడం లేదు అని హైరానా పడుతున్నారా? అయితే ఈ సూచనలు మీలాంటి వారి కోసమే..
క్రమశిక్షణ పాటించండి
మొదట ఆ రోజు చేయాల్సిన పనులపై స్పష్టత ఉండాలి. ప్రాధాన్యతలవారీగా వాటిని విభజించుకోవాలి. పూర్తిచేయడానికి డెడ్‌లైన్లను పెట్టుకోవాలి. గడువులోగా కచ్చితంగా పూర్తయ్యేలా ప్రయత్నించాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ డెడ్‌లైన్ దాటకుండా జాగ్రత్తపడాలి. దీన్ని అలవాటుగా మార్చుకోవాలి. ప్రారంభంలో కొంత కష్టంగానే అనిపించినా రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే గడువులోగా కార్యాచరణ పూర్తిచేయడం సులువుగా మారుతుంది. అనుకున్న సమయంలోగా పనులు చేయలేకపోతే ఎక్కువ సమయం కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల అలసిపోతారు. ఆశించిన ఫలితం రాదు, పనిపట్ల సంతృప్తి కూడా ఉండదు.
ఫోన్‌కాల్స్‌కు నో చెప్పండి
కార్యాలయాల్లో ఉద్యోగుల కార్యకలాపాలకు అంతరాయం కలిగించేది.. తరచుగా మోగే సెల్‌ఫోన్. దీనివల్ల చాలా సమయం వృథా అవుతుంది. ప్రొఫెషనల్ వరల్డ్‌లో ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవా లంటే ఫోన్‌కాల్స్ ముఖ్యమే. కానీ, చేస్తున్న పనిని వదిలేసి ఫోన్‌లో మాట్లాడుతూ కూర్చుంటే చాలా నష్టం జరుగుతుంది. ఉద్యోగంలో గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నవారికి ఇది మంచిది కాదు. టైమ్‌ను ఆదా చేయాలంటే అనవసరమైన ఫోన్‌కాల్స్‌కు నో చెప్పాల్సిందే. పని, సెల్‌ఫోన్.. దేని దారి దానిదే అన్నట్లుగా ఉండాలి. ఫోన్‌లో మాట్లాడడానికి కచ్చితమైన టైమ్ నిర్దేశించుకోవాలి. ఆఫీస్ నుంచి బయటి కొచ్చాక సెల్‌ఫోన్ స్విచ్ఛాన్ చేయడం ఉత్తమం.
మార్నింగ్.. ప్రొడక్టివ్ టైమ్
ఉదయం పూట వాతావరణం, మనసు ప్రశాంతంగా ఉంటాయి. అది ప్రొడక్టివ్ టైమ్ అని అనేక సర్వేల్లో తేలింది. అంటే ఉదయం చేసే పనులు మంచి ఫలితాన్నిస్తాయి. కాబట్టి ఆఫీస్‌లో ముఖ్యమైన కార్యాలను ఉదయమే పూర్తిచేసేలా వర్క్ షెడ్యూల్ రూపొందించు కోండి. త్వరగా పనులు జరిగితే ఎంతో టైమ్ మిగులుతుంది. ఈ-మెయిల్స్ చూసుకోవడం లాంటి వాటిని మధ్యాహ్నం తర్వాత చేసేలా ప్రణాళిక రూపొందించుకోండి.
పనిలో విరామం.. ఎంతసేపు
కార్యాలయంలో సహచరులతో కలిసి కాఫీలు, టీలు తాగుతూ కబుర్లు చెప్పుకుంటే తెలియకుండానే చాలా సమయం హరించుకుపోతుంది. ఇలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టడమే మంచిది. పనిలో ఏదైనా సమస్య తలెత్తి, ఎంతసేపు ఆలోచించినా దానికి పరిష్కారం మార్గం దొరక్కపోతే.. కొంతసేపు విరామం తీసుకోవాలి. దీనివల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే కొత్త ఆలోచనలు వస్తాయి. విరామం అనేది ఎక్కువ టైమ్‌ను మింగేయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
టెక్నాలజీని వాడుకోండి
టైమ్ మేనేజ్‌మెంట్‌లో టెక్నాలజీ చాలా కీలకం. ఒకప్పుడు సమావేశాల కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడంతా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా మీటింగ్స్ జరుగుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రాకతో సమయం ఆదా అవుతోంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ కార్యాలు చేయగలుగుతున్నారు. టైమ్ సేవ్ కావడంతోపాటు ఆఫీస్‌లో ఉత్పత్తి పెరగాలంటే టెక్నాలజీని వాడుకోండి.