
సెల్ఫ్ చెక్
మహిళ నిర్వహించే బాధ్యతలను లిస్ట్ రాస్తే దానికి అంతం ఉండకపోవచ్చు. రెండు చేతులతో లెక్కకు మించిన బాధ్యతలన్నీ నిర్వర్తిస్తుంటుంది. ఈ క్రమంలో నిర్లక్ష్యానికి లోనయ్యేది ఆరోగ్యమే. రోజుకు ఓ అరగంట టైమ్ తన కోసం కేటాయించుకోవడాన్ని కూడా మర్చిపోతుంటుంది. మరి మీరేం చేస్తున్నారు?
1. అన్ని పనులతోపాటు మీ ఎక్సర్‌సైజ్‌కు సమయాన్ని కేటాయిస్తున్నారు.
ఎ. అవును బి. కాదు
2. వయసు, ఎత్తు, బరువుతోపాటుగా మీ వయసు, ఎత్తుకు ఉండాల్సిన బరువు ఎంతో మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
3. దేహం ఫ్లెక్సిబుల్‌గా ఉండడానికి, దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండడం కోసం రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తున్నారు.
ఎ. అవును బి. కాదు
4. ఏరోబిక్స్, జిమ్, యోగా క్లాసులకు వెళ్లడానికి సాధ్యం కానప్పుడు ఇంటి మెట్లనే వ్యాయామకేంద్రంగా చేసుకుంటారు. రోజుకు ఐదారుసార్లు మెట్లెక్కి దిగి 20 పుష్‌అప్స్ చేస్తే పూర్తి వ్యాయామం చేసినట్లే.
ఎ. అవును బి. కాదు
5. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్ రాదని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
6. రోజూ ఐదారు నిమిషాల సేపు క్రమబద్ధంగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకుని నిదానంగా వదలడం ద్వారా శ్వాసకోశ వ్యవస్థ పని తీరును మెరుగుపరుచుకుంటున్నారు.
ఎ. అవును బి. కాదు
‘ఎ’లు ఐదు దాటితే ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నారనే అనుకోవాలి. దీనిని కొనసాగించండి. ‘బి’లు ఎక్కువైతే... ఈ ధోరణి అంత మంచిది కాదని గుర్తించండి. వార్ధక్యంలో వచ్చే సమస్యలకు దూరంగా ఉండడానికి ముప్ఫయ్‌ల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి.