రెండో రోజే పరిషత్ వెలవెల, సభ్యుల గైర్హాజరుతో ఖాళీగా ఉన్న కుర్చీలు
సాక్షి బెంగళూరు: విధాన పరిషత్తులో ప్రశ్నోత్తరాల సమయం తీసివేయడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు. సభ ఆరంభంలోనే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడం ఏంటని బీజేపీ సభ్యులు అరుణ్‌శాహపుర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా రఘునాథ్ మల్కాపుర కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేడీఎస్ సభ్యులు శరవణ, భుజేగౌడ స్పందిస్తూ మల్కాపుర వ్యాఖ్యలను ఖండించారు. ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించరాదని సూచించారు.
ఈసందర్భంగా సభాపతి బసవరాజు హొరట్టె కల్పించుకుని మాట్లాడారు. పరిషత్తు సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు. సభాపతి అనుమతి లేకుండా ఎవరూ మాట్లాడకూడదన్నారు. ప్రశ్నోత్తరాల సమయం ఉంటే సభ్యులు ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం లేకపోవడంతో సమావేశం నడిచేందుకు సహకరించాలని కోరారు. కాగా ప్రశ్నోత్తరాల సమయం లేదనే విషయం ముందే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమయం లేకపోవడంతో ప్రశ్నోత్తరాలు తొలగించారని సభాపతి బసవరాజు హొరట్టె స్పష్టం చేశారు.
అయితే రానున్న రోజుల్లో ప్రశ్నోత్తరాల సమయం తప్పకుండా నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష నాయకుడు కోటా శ్రీనివాస్ పూజారి మాట్లాడుతూ సభ్యుల ఆధారంగా సమావేశం జరగాలన్నారు. అనంతరం మంత్రి యూటీ ఖాదర్ మాట్లాడుతూ ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని తాను కూడా ఒప్పుకుంటున్నానన్నారు. అయితే అనివార్య కారణాల రీత్యా ప్రశ్నోత్తరాల గంట లేదన్నారు. ప్రభుత్వం, అధికారుల చేతకాని తనం వల్లే ప్రశ్నోత్తరాల గంట తీసివేశారని సభాపతి బసవరాజు హొరట్టె విమర్శించారు.
అనుచరులకు ప్రవేశం బంద్
విధాన పరిషత్తు సభ్యుల గన్‌మెన్‌లు, అనుచరులు, వ్యక్తిగత కార్యదర్శులకు ప్రవేశం లేదని సభాపతి బసవరాజు హొరట్టె హెచ్చరించారు. ఈమేరకు విధాన పరిషత్తు ద్వారం వద్ద మార్షల్స్‌ను నియమించారు. వారి సభ్యులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సభాపతి ఆదేశాలు అని చెప్పుకొచ్చారు. దీంతో గన్‌మెన్లు, అనుచరులు బయటే ఉండిపోయారు. ఈసందర్భంగా కొత్త సభ్యులను సభాపతి పరిచయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment