సౌదీ చరిత్రలో ఇదే మొదటిసారి...
సౌదీ అరేబియా చరిత్రలోనే మొట్టమొదటిసారి మహిళలకు ఓటు హక్కు కల్పించడంతోపాటు, పోటీకి అనుమతించారు. దీంతో ఈ ఎన్నికల్లో మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మహిళలకు ఓటు హక్కును చివరిగా కల్పించిన దేశాల్లో ఒకటిగా సౌదీ నిలిచింది. ప్రస్తుతం మొత్తం 284 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికలకు బరిలో 5,938 పురుషులతోపాటు.. 978 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. అయితే కనీసం మహిళలు ఒంటరిగా కారు కూడా నడపకూడదన్న నిబంధనలు ఉన్న ఈ దేశంలో... ఎన్నికల వేళ కొన్ని షరతులను సడలించి కారులో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళే అవకాశాన్ని కల్పించారు.
సంప్రదాయాలకు పెట్టింది పేరుగా ఉన్న ఈ దేశంలో ప్రస్తుత ఎన్నికలు మహిళా హక్కులకు ఓ ప్రత్యేక మైలు రాయిగా నిలిచాయి. అయితే ఎన్నికల ప్రచారానికి వెళ్ళే స్త్రీలు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు. ప్రచార సమయంలో ఓ పురుషుడి ప్రాతినిధ్యంలో కేవలం తెర వెనుక ఉండి మాత్రమే మహిళా అభ్యర్థులు ప్రచారం చేసే అవకాశం కల్పించారు. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించిన ఈ శుభ సందర్భంలోనూ... పురుష ఓటర్ల రిజిస్ట్రేషన్లు 1.35 మిలియన్లకు దాటి ఉండగా... కేవలం లక్షా 30 వేల మంది మహిళలు మాత్రమే ఓట్లు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో సాల్మా అల్ రషిద్ తొలి ఓటును రిజిస్టర్ చేసుకున్న మహిళగా గుర్తింపు పొందారు.
ఇది నిజంగా మంచి మార్పు అని, మహిళా ప్రాతినిధ్యం నిర్థారించుకోడానికి ఇదో మంచి మార్గమని ఆమె అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిల్ కు జరుగుతున్న ఎన్నికల్లో అధికారాలు తక్కువే అయినా మహిళలకు మాత్రం ఇదో మైలురాయి అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఈ సంప్రదాయ సమాజానికి అనుగుణంగా స్త్రీలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు.
అసలు సౌదీ రాజ్యంలో ఎన్నికలు జరగడమే అరుదుగా ఉంటుంది. ఇప్పడు జరిగిన ఈ ఎన్నికలతో కలిపి చరిత్రలో ఇక్కడ మొత్తం మూడుసార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి. నలభై ఏళ్ళ పాటు (1965 నుంచి 2005 వరకు) ఇక్కడ ఎన్నికలే నిర్వహించలేదు. కాగా మాజీ రాజు అబ్దుల్లా నిర్ణయం ఇప్పటి ఈ ఎన్నికలకు దారి తీసింది. ఇక్కడి మహిళలు కూడా ఎన్నికల్లో పాల్గొనాలన్నది ఆయన ఆశయం. కింగ్ అబ్దుల్లా సంస్కరణలు ప్రకటించడంలో భాగంగా సౌదీ మహిళలు మంచి స్థానాల్లో ఉంటే సరైన అభిప్రాయాలను, సలహాలను వ్యక్తం చేయగలరని అప్పట్లో ఆయన అభిప్రాయపడ్డారు.
తర్వాత జనవరిలో ఆయన మరణించే ముందు దేశంలోని ప్రధాన అడ్వైజరీ కౌన్సిల్.. షౌరాలో 30 మంది మహిళలను నియమించారు కూడా. ఇప్పడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 2,100 కౌన్సిల్ సీట్లు అందుబాటులో ఉండగా.. మిగిలిన 1,050 సీట్లకు రాజు అనుమతితో నియమిస్తారు. కాగా శనివారం తర్వాత ఎప్పుడైనా ఎన్నికల ఫలితాలు తెలిసే అవకాశం ఉంది.