భువనేశ్వర్: శాస్త్ర సాంకేతికత పెరిగినా మనిషి మూఢత్వాన్ని వదలడంలేదు. ఎవరో ఎదురువస్తే మంచిదంటూ, మరెవరో వస్తే చెడు జరుగుతుందంటూ కొందరు భావిస్తున్నారు. ఏదో ఒక విధంగా ఏదో ఒక వర్గంపై వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో ఎదురైంది. కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్‌గా ఎక్కకుండా ఆపేసిన ఘటనపై ఒడిశా మహిళా కమిషన్ మండిపడింది. ఇలాంటి వివక్షను ఆపేయాలని రవాణా డిపార్ట్‌మెంట్‌కు సూచనలు చేసింది.
ఇటీవల రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్‌గా ఎక్కకుండా భువనేశ్వర్‌లోని బారాముండా బస్సు స్టేషన్‌లో ఆపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాజిక కార్యకర్త ఘాసిరామ్ పాండా రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కమిషన్ రాష్ట్ర రవాణా యంత్రాంగానికి తగు సూచనలు చేసింది. మహిళలు మొదటి ప్యాసింజర్‌గా ఎక్కితే.. ఆ రోజు బస్సుకు ప్రమాదమో లేక తక్కువ వసూలు చేయడమో జరుగుతుందని భావించడం వివక్షాపూరితం అంటూ తెలిపింది. ఇది పూర్తిగా మూఢత్వం అని పేర‍్కొంది.
దీనిపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్.. మహిళలను తొలి ప్రయాణికులుగా ఎక్కేందుకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని రవాణాశాఖకు సూచనలు చేసింది. గతంలోనూ ఈ తరహా ఘటనలు వెలుగుచూసినట్లు గుర్తుచేసింది. ఇకముందు మహిళా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వారి గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తమ మొదటి ప్యాసింజర్‌గా మహిళలనూ అనుమతించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించాలని కోరింది. బస్సుల్లో మహిళల రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్ ట్రైన్
Comments
Please login to add a commentAdd a comment