discriminate
-
బస్సులో మొదట మహిళ ఎక్కితే.. కలిసిరాదా..? ఇది ఏం మూఢత్వం..?
భువనేశ్వర్: శాస్త్ర సాంకేతికత పెరిగినా మనిషి మూఢత్వాన్ని వదలడంలేదు. ఎవరో ఎదురువస్తే మంచిదంటూ, మరెవరో వస్తే చెడు జరుగుతుందంటూ కొందరు భావిస్తున్నారు. ఏదో ఒక విధంగా ఏదో ఒక వర్గంపై వివక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఒడిశాలో ఎదురైంది. కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్‌గా ఎక్కకుండా ఆపేసిన ఘటనపై ఒడిశా మహిళా కమిషన్ మండిపడింది. ఇలాంటి వివక్షను ఆపేయాలని రవాణా డిపార్ట్మెంట్కు సూచనలు చేసింది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా తీసుకువచ్చిన బస్సుల్లో మహిళలను మొదటి ప్యాసింజర్‌గా ఎక్కకుండా భువనేశ్వర్‌లోని బారాముండా బస్సు స్టేషన్లో ఆపేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సమాజిక కార్యకర్త ఘాసిరామ్ పాండా రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కమిషన్ రాష్ట్ర రవాణా యంత్రాంగానికి తగు సూచనలు చేసింది. మహిళలు మొదటి ప్యాసింజర్‌గా ఎక్కితే.. ఆ రోజు బస్సుకు ప్రమాదమో లేక తక్కువ వసూలు చేయడమో జరుగుతుందని భావించడం వివక్షాపూరితం అంటూ తెలిపింది. ఇది పూర్తిగా మూఢత్వం అని పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన మహిళా కమిషన్.. మహిళలను తొలి ప్రయాణికులుగా ఎక్కేందుకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని రవాణాశాఖకు సూచనలు చేసింది. గతంలోనూ ఈ తరహా ఘటనలు వెలుగుచూసినట్లు గుర్తుచేసింది. ఇకముందు మహిళా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా వారి గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేయాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు తమ మొదటి ప్యాసింజర్‌గా మహిళలనూ అనుమతించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. సిబ్బందికి ఈ మేరకు అవగాహన కల్పించాలని కోరింది. బస్సుల్లో మహిళల రిజర్వేషన్‌ను 50 శాతానికి పెంచాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ -
ఇంటి పనంతా మాతోనే.. ప్రశ్నిస్తే ‘మేం మగాళ్లం’ అనేవాళ్లు: స్నేహ
గత దశాబ్దంలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన స్నేహ బాల్యంలో ఎన్నో ఛీత్కారాలను, వేదనలను అనుభవించారట. ఈ విషయాన్ని తనే ఇటీవల ఓ ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. వివరాలు..ఈ బ్యూటీ 2000 సంవత్సరంలో మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు. అదే ఏడాది ఎన్నవళే అనే చిత్రంతో మాధవన్‌కు జంటగా కోలీవుడ్లోకి రంగప్రవేశం చేశారు. ఆ తరువాత 2001లో ఆనందం చిత్రంలో అబ్బాస్‌కు జంటగా నటించారు. ఆ చిత్రం 200 రోజులు ఆడింది. అదే విధంగా తెలుగులోనూ పలు చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తమిళంలో కమలహాసన్, సూర్య, ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటించిన ప్రముఖ కథానాయకిగా రాణించారు. అలా ప్రముఖ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే 2012లో నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఇంతవరకు స్నేహ గురించి చాలామందికి తెలిసిందే. అయితే ఆమె కుటుంబం, బాల్యం గురించి ఎవరికీ చెప్పలేదు. అలాంటిది తొలిసారిగా ఇటీవల ఒక భేటీలో తాను బాల్యంలో అనుభవించిన కష్టాల గురించి ఏకరువు పెట్టారు. తన తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు అని చెప్పారు. కూతుర్లలో తాను చివరి దానినని, తనకు బదులు కొడుకు పుట్టాలని తన బామ్మ గట్టిగా కోరుకుందని దీంతో ఆమె తన ముఖాన్ని చూడటానికి మూడు రోజుల వరకు ఇష్టపడలేదని తెలిపారు. ఇక చిన్నతనంలో మంచి నీళ్లు పక్కనే ఉన్నా వాటిని.. సోదరులకు తామే అందించాల్సి వచ్చేదన్నారు. అదేమని ప్రశ్నిస్తే మేం మగాళ్లం. ఆడపిల్లలైన మీరే ఇంటి పనులు చేయాలని కండీషన్లు పెట్టేవారని వాపోయింది. ముఖ్యంగా తన పెద్ద సోదరుడు తనను చాలా ఇబ్బందులు పెట్టేవాడని, అన్ని పనులు తననే చేయమని ఆదేశించేవాడని పేర్కొంది. -
'శబరిమలలో ఆ నిషేధం ఎందుకు?'
కేరళ : శబరిమల ఆలయంలో మహిళల నిషేధంపై సుప్రీం కోర్టు ప్రశ్నలు సంధించింది. 'వేదాలు, ఉపనిషత్తుల్లో ఎక్కడా కూడా పురుషులకు, మహిళలకు మధ్య వివక్ష చూపలేదు, మరి మీరెందుకు మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధించారు?' అంటూ కోర్టు ప్రశ్నించింది. మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. అసలు ఎప్పటి నుంచి శబరిమల ఆలయానికి మహిళల ప్రవేశాన్ని నిషేధించారో, నిషేధం వెనుక ఉన్న చారిత్రక కారణాలేమిటో తెలియజేయాలని ఉన్నత ధర్మాసనం.. ఆలయ బోర్డుతోపాటు కేరళ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. మతానికి సంబంధించిన విషయమే అయినప్పటికీ హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని స్పష్టం చేసింది. 'దీనిపై మేం సంకుచితంగా వ్యవహరించం. మత ఆచారాలకు, హక్కులకు మధ్య రాజ్యాంగపరమైన సమతుల్యతను అభిలషిస్తున్నాం. ఆలయం అనేది మతపరమైన విషయం, దానికి సంబంధించిన చర్యలు తప్పనిసరిగా పరిమితులలో ఉండాలి ' అంటూ అత్యున్నత న్యాయ స్థానం వ్యాఖ్యానించింది. కేసు విషయమై స్పందించాలంటూ ఆలయ బోర్డుకు ఆరు వారాల గడువును మంజూరు చేసింది. ఆలయ బోర్డు తరఫున కోర్టుకు హాజరైన కె.కె.వేణు గోపాల్ దీనిపై మాట్లాడుతూ.. 'వెయ్యి సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారాన్ని ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారు ? శబరిమల మొత్తం పరిశుద్ధమైనది.. మహిళలు అక్కడికి ప్రవేశించలేరు' అంటూ వ్యాఖ్యానించారు. కాగా గతంలో కేరళ హైకోర్టు మహిళల నిషేధాన్ని సమర్థించింది. సుప్రీం కోర్టు మాత్రం దానికి భిన్నంగా స్పందించింది. -
తెలంగాణ ఉద్యోగులపై వివక్ష
విద్యుత్‌సౌధలో టీ ఉద్యోగుల నిరసన విద్యుత్‌శాఖలో తెలంగాణ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నారని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అధ్యక్షుడు శివాజీ ఆరోపించారు. విద్యుత్‌శాఖలో అక్రమ పదోన్నతులను నిరసిస్తూ గురువారం విద్యుత్‌సౌధలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనికి తెలంగాణలోని పది జిల్లాల నుంచి భారీ ఎత్తున ఉద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్బంగా శివాజీ మాట్లాడుతూ... విద్యుత్‌శాఖలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కావడం లేదని అన్నారు. గిర్గ్లానీ కమిషన్, శ్రీకృష్ణ కమిటీ కూడా పదోన్నతులు, నియామకాల్లో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని తెలిపిందని ఆయన గుర్తుచేశారు. అక్రమ ధ్రువపత్రాలతో తెలంగాణలో ఉద్యోగాలు పొందిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జెన్కోలో డెరైక్టర్ పోస్టులలో సర్వీసులో ఉన్న తెలంగాణ వారినే నియమించాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మోహన్‌రెడ్డి, మురళీకృష్ణ, ఎస్.స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.