'శబరిమలలో ఆ నిషేధం ఎందుకు?'
కేరళ : శబరిమల ఆలయంలో మహిళల నిషేధంపై సుప్రీం కోర్టు ప్రశ్నలు సంధించింది. 'వేదాలు, ఉపనిషత్తుల్లో ఎక్కడా కూడా పురుషులకు, మహిళలకు మధ్య వివక్ష చూపలేదు, మరి మీరెందుకు మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధించారు?' అంటూ కోర్టు ప్రశ్నించింది. మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే.
అసలు ఎప్పటి నుంచి శబరిమల ఆలయానికి మహిళల ప్రవేశాన్ని నిషేధించారో, నిషేధం వెనుక ఉన్న చారిత్రక కారణాలేమిటో తెలియజేయాలని ఉన్నత ధర్మాసనం.. ఆలయ బోర్డుతోపాటు కేరళ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. మతానికి సంబంధించిన విషయమే అయినప్పటికీ హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని స్పష్టం చేసింది.
'దీనిపై మేం సంకుచితంగా వ్యవహరించం. మత ఆచారాలకు, హక్కులకు మధ్య రాజ్యాంగపరమైన సమతుల్యతను అభిలషిస్తున్నాం. ఆలయం అనేది మతపరమైన విషయం, దానికి సంబంధించిన చర్యలు తప్పనిసరిగా పరిమితులలో ఉండాలి ' అంటూ అత్యున్నత న్యాయ స్థానం వ్యాఖ్యానించింది. కేసు విషయమై స్పందించాలంటూ ఆలయ బోర్డుకు ఆరు వారాల గడువును మంజూరు చేసింది.
ఆలయ బోర్డు తరఫున కోర్టుకు హాజరైన కె.కె.వేణు గోపాల్ దీనిపై మాట్లాడుతూ.. 'వెయ్యి సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారాన్ని ఇప్పుడెందుకు ప్రశ్నిస్తున్నారు ? శబరిమల మొత్తం పరిశుద్ధమైనది.. మహిళలు అక్కడికి ప్రవేశించలేరు' అంటూ వ్యాఖ్యానించారు. కాగా గతంలో కేరళ హైకోర్టు మహిళల నిషేధాన్ని సమర్థించింది. సుప్రీం కోర్టు మాత్రం దానికి భిన్నంగా స్పందించింది.