గత దశాబ్దంలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన స్నేహ బాల్యంలో ఎన్నో ఛీత్కారాలను, వేదనలను అనుభవించారట. ఈ విషయాన్ని తనే ఇటీవల ఓ ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు. వివరాలు..ఈ బ్యూటీ 2000 సంవత్సరంలో మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు. అదే ఏడాది ఎన్నవళే అనే చిత్రంతో మాధవన్‌కు జంటగా కోలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశారు. ఆ తరువాత 2001లో ఆనందం చిత్రంలో అబ్బాస్‌కు జంటగా నటించారు. ఆ చిత్రం 200 రోజులు ఆడింది.
అదే విధంగా తెలుగులోనూ పలు చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తమిళంలో కమలహాసన్, సూర్య, ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోలతో నటించిన ప్రముఖ కథానాయకిగా రాణించారు. అలా ప్రముఖ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే 2012లో నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు.
ఇంతవరకు స్నేహ గురించి చాలామందికి తెలిసిందే. అయితే ఆమె కుటుంబం, బాల్యం గురించి ఎవరికీ చెప్పలేదు. అలాంటిది తొలిసారిగా ఇటీవల ఒక భేటీలో తాను బాల్యంలో అనుభవించిన కష్టాల గురించి ఏకరువు పెట్టారు. తన తల్లిదండ్రులకు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు అని చెప్పారు. కూతుర్లలో తాను చివరి దానినని, తనకు బదులు కొడుకు పుట్టాలని తన బామ్మ గట్టిగా కోరుకుందని దీంతో ఆమె తన ముఖాన్ని చూడటానికి మూడు రోజుల వరకు ఇష్టపడలేదని తెలిపారు. ఇక చిన్నతనంలో మంచి నీళ్లు పక్కనే ఉన్నా వాటిని.. సోదరులకు తామే అందించాల్సి వచ్చేదన్నారు. అదేమని ప్రశ్నిస్తే మేం మగాళ్లం. ఆడపిల్లలైన మీరే ఇంటి పనులు చేయాలని కండీషన్లు పెట్టేవారని వాపోయింది. ముఖ్యంగా తన పెద్ద సోదరుడు తనను చాలా ఇబ్బందులు పెట్టేవాడని, అన్ని పనులు తననే చేయమని ఆదేశించేవాడని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment