
ఇచట కాలం అమ్మబడును!
‘టైమ్ ఎంతైంది?’’ అని అడిగితే-
‘‘డబ్బు ఇవ్వండి చెబుతాను’’ అని ఎవరైనా సమాధానం ఇస్తే విచిత్రంగా చూస్తాం. విచిత్రమైన విషయం ఏమిటంటే కాలాన్ని అమ్ముకున్న కాలం ఒకటి చరిత్రలో ఉంది. 1836లో జాన్ హెన్రీ విల్లీ అనే ఖగోళవేత్త గ్రీన్‌విచ్(ఇంగ్లండ్)లోని ఒక అబ్సర్వేటరీలో పనిచేసేవాడు. అప్పట్లో చేతి వాచ్‌లు, గోడ వాచ్‌లు లేవు కాబట్టి...‘టైమ్ ఎంతైంది?’ అనే విషయం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉండేది. ఇలా ఆసక్తి ఉన్నవాళ్లంతా హెన్రీ విల్లీ ముందు క్యూ కట్టేవారు. అయితే వాళ్లు టైమ్ అడగ్గానే ఉచితంగా ఏంచెప్పేవాడు కాదు హెన్రీ. శుబ్బరంగా డబ్బులు వసూలు చేసేవాడు. టైమ్ తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చేవాళ్లలో వార్షిక చందాదారులు కూడా ఉండేవాళ్లు.
హెన్రీ విల్లీ టైమ్ చూసి చెప్పే ‘అబ్జర్వేటరీ క్లాక్’కి ‘అర్నాల్డ్’ అనే పేరు ఉండేది. 1856లో హెన్రీ విల్లీ చనిపోయిన తరువాత ఆయన భార్య మారియా భర్తలాగే టైమ్ చెప్పే వ్యాపారాన్ని చేపట్టింది. కూతురుతో కలిసి ఒక బండి మీద తిరుగుతూ డబ్బులకు టైమ్ చెప్పేది. ఆ తరువాత వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల టైమ్ అమ్ముకునే వ్యాపారానికి కాలం చెల్లింది.