రెండేళ్ల కాలపరిమితికే మద్యం దుకాణాల కేటాయింపు
రెండేళ్ల కాలపరిమితికే మద్యం దుకాణాల కేటాయింపు
Published Tue, Mar 28 2017 11:41 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
- మద్య నిషేధ, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ ‡
- ఆన్‌లైన్‌లో 106 దరఖాస్తులు
కాకినాడ క్రైం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీ ప్రకారం రెండేళ్ల కాల పరిమితికి లోబడే మద్యం దుకాణాలు కేటాయిస్తూ ఏపీ ఎక్సైజ్‌శాఖ కమిషనర్ జీవో విడుదల చేసినట్టు మద్య నిషేధ, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ బి.అరుణారావు వెల్లడించారు. మంగళవారం ఆయన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్చి 24వ తేదీన జిల్లాలో ఉన్న 545 మద్యం దుకాణాల్లో 154 దుకాణాలకు 27 నెలలు, 391 దుకాణాలకు 24 నెలల కాలపరిమితికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. వీటిని రెండేళ్ల కాలపరిమితికి మార్చుతూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయన్నారు. వ్యాపారుల నుంచి ఇప్పటి వరకు లైసెన్సుల సొమ్ము చలానా రూపంలో మాత్రమే స్వీకరించేవారమని, మారిన నిబంధనల మేరకు డీడీల రూపంలో స్వీకరించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో ఉన్న 407 దుకాణాలకు నోటీసులివ్వగా 298 మంది దుకాణాలను వేరే ప్రదేశానికి మార్చుకున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించే 109 మద్యం దుకాణాలతో పాటూ గతంలో మిగిలిపోయిన 46 దుకాణాలను కలిపి 155 షాపులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నామన్నారు. మిగతా 390 దుకాణాలకు జూలై 1వ తేదీ నుంచి రెండేళ్ల కాలపరిమితికి లైసెన్సులు జారీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం యూనిట్ల పరిధిలోని దుకాణాలకు మంగళవారం నాటికి 106 దరఖాస్తులు ఆన్‌లైన్లో వచ్చాయని తెలిపారు. ఇందులో కాకినాడలో 28, అమలాపురం 30, రాజమహేంద్రవరం 48 వచ్చినట్టు తెలిపారు. ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణకు గడువు మార్చి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉందన్నారు. మార్చి 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులోని జీ కన్వెన్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యాపారులకు లైసెన్సుల జారీకి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభుకుమార్, అమలాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఏడుకొండలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement