కిలిమంజోరు | Kilimanjoru | Sakshi
Sakshi News home page

కిలిమంజోరు

Published Sat, Jul 30 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

కిలిమంజోరు

కిలిమంజోరు

  • ►సాహసయాత్రకు సై
  • ►మెతుకుసీమ విద్యార్థినులు సిద్ధం
  • ►జిల్లా నుంచి తొమ్మిది మంది ఎంపిక
  • ►త్వరలో ఆఫ్రికాకు పయనం
  • ►కలెక్టర్‌ ప్రోత్సాహంతో ముందుకు
  • ►ఆర్సీపురం కేజీబీవీలో కఠిన శిక్షణ
  • ►పూర్ణ, ఆనంద్‌ స్ఫూర్తితో ముందడుగు
  • ‘కిలిమంజారో.. చలో.. చలో... ’ అంటూ మరో సాహస యాత్రకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులు సిద్ధమవుతున్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లను స్ఫూర్తిగా తీసుకుని ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రామచంద్రాపురం మండలం ఉస్మా¯ŒSనగర్‌లోని కేజీబీవీలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఎంతటి పర్వతాన్నైనా అధిరోహించి తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ ప్రోత్సాహంతో మొత్తం 12 మంది విద్యార్థినులు ఆఫ్రికాలోని కిలిమంజారో వైపు అడుగులు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
    – రామచంద్రాపురం

    రామచంద్రాపురం:కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతోన్న విద్యార్థినులు సాహస యాత్రకు సై అంటున్నారు. ఆఫ్రికాలో ఎత్తయిన పర్వతాల్లో కిలిమంజారో ఒకటి. ఆ పర్వతాన్ని అధిరోహించేందుకు ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలతోపాటు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలకు చెందిన విద్యార్థినులు ముందుకు వచ్చారు.

    ఇందుకోసం 12మంది ఎంపిక కాగా అందులో జిల్లాకు చెందిన వారు తొమ్మిది ఉండడం గమనార్హం. వీరంతా రామచంద్రాపురం మండలం ఉస్మా¯ŒSనగర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ప్రోత్సాహంతో మరింత ఉత్సాహంగా కదులుతున్నారు.  ఉదయం, సాయంత్రం కఠినమైన శిక్షణ పొందుతున్నారు.
    కిలిమంజారో ఇలా..
    కిలిమంజారో పర్వతం 17వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ వాతావరణం క్షణ క్షణం మారుతూ ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రతతోపాటు బలమైన గాలులు వీస్తుంటాయి. ఆక్సిజ¯ŒS కూడా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో పెద్ద సాహస యాత్ర. ఆఫ్రికాలోనే కిలిమంజారో పర్వతం చాలా పెద్దది.
    శిక్షణ ఇలా...
    రన్నింగ్, యోగా చేయిస్తారు. 30 కిలోల బరువు మోస్తూ నడిపిస్తారు. నిత్యం సూర్యనమస్కారాలు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా పర్వతారోహణ సమయంలో శ్వాస తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా మెలకువలు నేర్పుతారు.
    కలెక్టర్‌ ప్రోత్సాహంతో...
    ఈ విద్యార్థినులు ఇప్పటివరకు మన రాష్ట్రం దాటి వెళ్లలేదు. కలెక్టర్‌ ప్రోత్సాహంతో వీరంతా సాహస యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి అవకాశం తమకు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నారు.
    లక్ష్యాన్ని ఛేదిస్తా..
    పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు. కలెక్టర్‌ ప్రోత్సాహంతో కిలిమంజారో పర్వతారోహణకు సిద్ధమయ్యా. ఇందుకోసం శిక్షణ తీసుకుంటున్నా. ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే మేము ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తాం. కష్టమైన పర్వతారోహణ లక్ష్యాన్ని ఛేదిస్తా.    – అనసూయ, కేజీబీవీ, అందోల్‌
    యోగా చేస్తున్నాం..
    కిలిమంజారో ఎక్కడమన్నది మామూలు విషయం కాదు. పర్వతారోహణ చేయాలంటే ప్రధానంగా శరీరం సహకరించాలి. అక్కడ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది కాకుండా శిక్షణ తప్పదు. అందుకోసం నిత్యం యోగా నేర్చుకుంటున్నాం. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం.
        – ఎం.బూలి, కేజీబీవీ, రామాయంపేట
    పూర్ణ, ఆనంద్‌లే స్ఫూర్తి..
    గురుకుల పాఠశాలలో చదివి ఎవరెస్టు అధిరోహించి చరిత్ర సృష్టించిన పూర్ణ, ఆనంద్‌లే నాకు స్ఫూర్తి. వారిని చూసే నేను ఈ సాహస యాత్రకు సిద్ధమవుతున్నా. నేను కూడా 17వేల అడుగుల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి జిల్లా పేరు నిలబెడతా.
        – జె.మంజుల, కేజీబీవీ, పెద్దశంకరంపేట
    శిక్షణ బాగుంది...
    కిలిమంజారో పర్వతం 17వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడి వాతావరణం తట్టుకునేలా ప్రత్యేక శిక్షణ అవసరం. అందుకోసం మాకు శేఖర్‌బాబు సార్‌ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. లక్ష్య సాధనకు కఠినతరమైన శిక్షణ తీసుకుంటున్నాం.
        – జి.నర్సమ్మ, కేజీబీవీ, కొల్చారం
    పదిహేను రోజులుగా శిక్షణ ఇస్తున్నాం..
    పదిహేను రోజులుగా విద్యార్థినులకు ఫిట్‌నెస్‌ శిక్షణ ఇస్తున్నా. విద్యార్థిననులు ఎంతో కష్టపడి వ్యాయామం చేస్తున్నారు. నేను కూడా వ్యాయామ శిక్షకురాలిగా కాకుండా వారికి గైడ్‌గా ఆఫ్రికాకు వెలుతున్నా. కిలిమంజారో విషయంలో కలెక్టర్‌ కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.     –  సీహెచ్‌ కమల, పీఈటీ
    సంతోషంగా ఉంది..
    పర్వతారోహణ చేయాలన్న కోరిక నాలో ఎప్పటినుంచో ఉంది. ఆ కళను త్వరలో నిజం చే సుకోబోతున్నా. గత ఏడాది డార్జిలింగ్‌లోని ఎవరెస్టు శిఖరం ఎక్కేందుకు ఎంపికయ్యా. అందుకు భువనగిరిలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. భూకంపం రావడంతో ఆ పర్యటన రద్దయింది. ప్రస్తుతం కిలిమంజారో పర్వతారోహణకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది.    – వి.పూజ (కరీంనగర్‌)
    రాష్ట్రానికి పేరు తెస్తా...
    క్రీడలు, సాహస యాత్రలంటే నాకెంతో ఇష్టం. గతంలో కోకోలో జిల్లాస్థాయిలో బహుమతులు పొందా. నేడు అదే స్ఫూర్తితో పర్వతారోహణ చేసి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తా.    – ఎల్‌.మౌనిక, రామాయంపేట (కేజీవీబీ)
    జిల్లాకు పేరుతీసుకొస్తా..
    క్రీడలంటే నాకిష్టం. గతంలో కరాటేలో ఆరు గోల్డ్‌ మెడల్స్‌ సాధించా. ఇప్పుడు ఈ సాహస యాత్రకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పర్వతాన్ని ఎక్కి జిల్లాకు రాష్ట్రానికి పేరు తెస్తా.    – ఈ.జ్యోతి, కేజీబీవీ వెల్దుర్తి
    ఆనందంగా ఉంది..
    ఆఫ్రికాలోని అతి ఎత్తయిన పర్వతారోహణకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. నేనిప్పటి వరకు ఊరు విడిచి పోలేదు. అలాంటిది దేశం విడిచి మరో దేశానికి సాహస యాత్రకు వెళ్తున్నానంటే గర్వంగా ఉంది. ఇందుకోసం కఠినమైన శిక్షణ తీసుకుంటున్నా.
        – నాగమణి, కేజీబీవీ, జగదేవ్‌పూర్‌
    ఆహారంలో మార్పు...
    పర్వతారోహణ అంటే మామూలు విషయం కాదు. దానికి ఏకాగ్రత, కఠోర శ్రమ తప్పదు. అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాం. ఆహార అలవాట్లు కూడా మార్చుకున్నాం. ప్రత్యేక శిక్షణతో పాటు డైట్‌కు కూడా మారింది. పర్వతారోహణకు అవసరమైన శక్తికోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిపుణులు సూచనలిస్తున్నారు.    – జె.కవిత, వెల్దుర్తి
    కష్టమైనా.. ఇష్టంగా..
    పర్వతారోహణకు అవకాశం రావడం సంతోషంగా ఉంది. కలెక్టర్‌ ప్రోత్సాహంతో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాం. విద్యతోపాటు శిక్షణ సమయంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. కష్టమైనా ఇష్టంగా చేసి లక్ష్యాన్ని సాధిస్తాం.
        – జి.రమ్య, వర్గల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement