గురుదీపక్ కౌర్
‘ఆకాశమే మన హద్దు... అవకాశాలను వదలద్దు’ ఇదేదో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నినాదంలా అనిపిస్తోంది. కానీ ఈ అడ్వంచరస్ ఉమన్ గురుదీపక్ కౌర్‌ను చూస్తే ఇలాంటి మరెన్నో స్ఫూర్తివచనాలు చెప్పాలనిపిస్తుంది. 73 ఏళ్ల వయసులో ఆమె సొంతంగా కారు నడుపుకుంటూ ఒంటరిగా కొత్త ప్రదేశాలను చూడడానికి వెళ్తుంటారు. సోలో ట్రావెలర్, సోలో ఉమెన్ ట్రావెలర్... ఇవేవీ గురుదీపక్‌కు సరిపోకపోవచ్చు. సీనియర్ సోలో అడ్వెంచరస్ ట్రావెలర్ అనాల్సిందే. ఆమె మాత్రం ‘వయసు ఒక సంఖ్య మాత్రమే. మన ఉత్సాహానికి వయసు అడ్డుకట్ట వేయలేదు. బాధ్యతలు కొంత వరకు వేగాన్ని అదుపు చేస్తుంటాయి. కానీ నాకు బాధ్యతలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఫ్రీ బర్డ్‌ని. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లు నా చేత ప్రయాణం చేయిస్తున్నది... ప్రపంచాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస ఒక్కటే’’ అంటారు.
మూడు రోజుల రైలు ప్రయాణం
జీవితంలో పరిస్థితులే తన చేత ఒంటరి ప్రయాణాలు చేయించాయంటారు గురుదీపక్ కౌర్. ‘‘నాన్న మిలటరీ పర్సన్, బదిలీలుంటాయి. పన్నెండేళ్ల వయసు నుంచి ప్రయాణం అంటే మా వస్తువులు మేమే ప్యాక్ చేసుకుని సిద్ధం అయ్యేవాళ్లం. ‘ప్యాకింగ్, మూవింగ్, మీటింగ్ న్యూ పీపుల్’ ఇదే మా లైఫ్. ఇక ఒంటరి ప్రయాణాలు పెళ్లి తర్వాత మొదలయ్యాయి. నా భర్త కూడా మిలటరీ పర్సనే. పెళ్లయిన తర్వాత రెండో ఏడాదిలో ఆయనకు కర్నాటక, బెల్గామ్‌లో పోస్టింగ్ వచ్చింది. చండీగర్ నుంచి రెండు నెలల బాబుతో, ఎనిమిది పెద్ద పెద్ద చెక్క పెట్టెలతో బెల్గామ్‌కు ప్రయాణమయ్యాను. అప్పట్లో విమానాలు ఇంత ఎక్కువగా ఉండేవి కావు. రైల్లో మూడు రోజుల ప్రయాణం. అది నా తొలి ఒంటరి ప్రయాణం మాత్రమే కాదు, సాహసోపేతమైన ప్రయాణం కూడా.
కారులో షికారు
గురుదీపక్ కౌర్ తొలి సోలో ఇంటర్నేషనల్ టూర్ 1994లో చేశారు. యూఎస్‌కు ఒంటరిగా వెళ్లడం మాత్రమే కాదు, స్థానికంగా ప్రదేశాలను చూడడానికి రైల్లో ఒంటరిగానే ప్రయాణించారు. ఇదంతా బాగానే ఉంది. కానీ సొంతంగా కారు నడుపుకుంటూ ప్రయాణించడం 2013లో మొదలైంది. సాంత్రో కారులో చండీగర్ నుంచి బెంగళూరుకు బయలుదేరారు గురుదీపక్ కౌర్. ఢిల్లీ, అజ్మీర్, ఉదయ్‌పూర్, అహ్మదాబాద్, ముంబయి మీదుగా బెంగళూరు చేరారు. ఆ తర్వాత ఏడాది ఉత్తరాఖండ్‌కు కారు తీశారు. కొండలు, లోయల మధ్య మెలికలు తిరిగిన రోడ్డు మీద కారు నడుపుతూ తాను చూడదలుచుకున్న ప్రదేశాలను చుట్టి వచ్చారు.
ప్రమాదం తప్పింది
దేహం అలసటగా ఉన్నప్పుడు ట్రిప్ మొదలు పెట్టవద్దని చెబుతారు కౌర్. దేహం ఫిట్‌గా ఉందా నీరసంగా ఉందా అనేది ఎవరికి వాళ్లకు తెలుస్తుంది. దేహం అలసటకు మానసిక అలసట కూడా తోడైతే... ఇక వాహనం నడప కూడదని చెబుతూ మూడేళ్ల కిందట తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారామె. ‘‘ముంబయికి వెళ్లినప్పుడు కారు నడుపుతూ తీవ్రమైన అలసటతో రోడ్డు పక్కన కారాపి కొన్ని క్షణాలపాటు స్టీరింగ్ మీద తల వాల్చాను. మెలకువ వచ్చేసరికి కారు కదులుతోంది. అప్పటికే చెట్ల పొదల్లోకి వచ్చేసింది. వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది’’.
ఇల్లు అపురూపమే...
‘‘ప్రతి మహిళకూ నేను చెప్పేది ఒక్కటే. ఇల్లు, కుటుంబం బాధ్యతలు ఎలాగూ ఉంటాయి. బాధ్యతల పట్ల బాధ్యతరహితంగా ఉండవద్దు. బాధ్యతలతోపాటు మీకూ కొంత సమయం కేటాయించుకోండి. మీకంటూ సొంతంగా కొంత డబ్బు ఉంచుకోండి. ఏడాదిలో కొన్ని రోజులు మీరు మీరుగా జీవించండి. ఆ తర్వాత తిరిగి మీ బాధ్యతల వలయంలోకి వచ్చి పడినప్పటికీ అప్పుడు ఆ బాధ్యత బరువుగా అనిపించదు. మానసికంగా ఒత్తిడిని కలిగించదు. మనకు ఇల్లు అపురూపమైనదే, అలాగే ప్రపంచం అందమైనది. ఆ అందానికి కూడా మన జీవితంలో స్థానం కల్పించాలనే విషయాన్ని మర్చిపోవద్దు’’ అంటారు గురుదీపక్ కౌర్.
Comments
Please login to add a commentAdd a comment