మనం నేల మీద మన రోజువారీ వ్యవహారాలు చూసుకుంటూ ఉండగా ఇటీవల నీటి మీద ఒక సాహసం జరిగింది. బంగాళాఖాతంలో పది మంది మహిళా ఆర్మీ ఆఫీసర్లు ఒక్క పురుషుడి తోడు కూడా లేకుండా చిన్న యాట్ (తెరచాపతో నడిచే చిన్న పడవ)లో చెన్నై నుంచి విశాఖపట్నంకు తిరిగి విశాఖపట్నం నుంచి చెన్నైకు 7 రోజుల్లో సాహస యాత్ర చేశారు. ఫిబ్రవరి 15న చెన్నైలో బయలుదేరిన ఈ యాత్ర ఫిబ్రవరి 23న ముగిసింది.
‘నిజానికి మా యాత్ర 4 రోజుల్లో ముగుస్తుంది అనుకున్నాం. కాని సముద్రం లెక్క సముద్రానికి ఉంటుంది. అలలు, గాలులు మనం ఎప్పుడు గమ్యం చేరాలో నిర్దేశిస్తాయి. అందుకే 7 రోజులు పట్టింది’ అంది ఈ బృందానికి కెప్టెన్‌గా వ్యవహరించిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముక్త శ్రీ గౌతమ్. ‘ఆర్మీ అడ్వంచర్ వింగ్’ ఆధ్వర్యంలో ‘ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సెయిలింగ్ అసోసియేషన్’ నిర్వహణలో ఈ సాహస యాత్ర జరిగింది. ఈ యాత్రలో ఆర్మీ నుంచి ఎంపిక చేసిన 10 మంది మహిళా ఆఫీసర్లను ఎంపిక చేశారు. కెప్టెన్ ముక్త శ్రీ గౌతమ్ కాకుండా మేజర్ సంజనా మిట్టల్, మేజర్ అర్పితా ద్వివేది, కెప్టెన్ మాళవికా రావత్, కెప్టెన్ శుభమ్ సోలంకి, మేజర్ ప్రియా సంవాల్, మేజర్ ప్రియా దాస్, కెప్టెన్ జ్యోతి సింగ్, మేజర్ రష్మిల్, కెప్టెన్ సోనాల్ గోయల్ ఉన్నారు.
‘నేటి మహిళలు స్త్రీల పట్ల మన దేశంలో ఉన్న మూస అభిప్రాయాలను బద్దలు కొడుతున్నారు. వారు ధైర్యానికి కొత్త ప్రమాణాలు లిఖిస్తున్నారు’ అని చెన్నైలో జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. నిజమే. ఈ పదిమంది అలాంటి ధైర్యం చూపారు. ‘మాలో ఎక్కువమందికి ఇదే తొలి నౌకాయానం. కాని మాలో ఏదైనా సాహసం చేయాలన్న కోరిక ఎక్కువ. అందుకే ఈ యాత్రకు సై అన్నాం. మాకు 25 రోజులు ముంబైలోని మార్వెలో శిక్షణ ఇచ్చారు. అక్కడ పడవల గురించి, నౌకాయానం గురించి, సముద్రపు అలల గురించి తెలియ చేశారు. ఆ తర్వాత చెన్నైలో మేము ఏ యాట్ మీద అయితే ప్రయాణించాలో దాని మీద 10 రోజుల శిక్షణ ఇచ్చారు. కాని తీరంలో శిక్షణ వేరు. నిజమైన సముద్ర ప్రయాణం వేరు అని యాత్ర మొదలయ్యాక అర్థమైంది’ అంటారు ఈ బృంద సభ్యులు.
చెన్నైలో ఫిబ్రవరి 15న బయలుదేరిన ఈ బృందం 330 నాటికల్ మైళ్లు (611 కి.మీ) ప్రయాణించి 54 గంటల్లో ఫిబ్రవరి 17న విశాఖ చేరుకుంది. అక్కడ యాట్‌ను ఒకసారి చెక్ చేసుకుని తిరిగి 18న బయలుదేరి 23న చెన్నై చేరుకున్నారు. వచ్చే సమయం కన్నా వెళ్లే సమయం ఎక్కువ పట్టింది. ‘కాకినాడ–కృష్ణపట్నం మధ్యలో ఉండే నూనె బావులను, చేపల వలల్ని తప్పించుకునేందుకు మేము బాగా సముద్రం లోపలికి వెళ్లాం. మా యాత్రలో ఒక పౌర్ణమి రాత్రి ఉంది. ఆ రాత్రంతా తీవ్రంగా ఉన్న సముద్ర అలలపై ప్రయాణం సవాలుగా మారింది’ అంది మేజర్ ముక్త. ఆమెది రాజస్థాన్. సముద్రమే లేని ప్రాంతం నుంచి సముద్రాన్ని ఈ యాత్రతో గెలిచింది.
అయితే ఇదంతా సులభం కాదు. 44 అడుగుల పొడవు మాత్రమే ఉండే ఈ యాట్‌లో 150 చదరపు అడుగుల కేబిన్ ఉంటుంది. ఈ కేబిన్‌లోనే కిచెన్, టాయిలెట్లు, రెస్ట్ ప్లేస్ ఉంటాయి. పనిని బృందాలుగా విభజించుకుని ఒక బృందం డ్యూటీ దిగితే మరో బృందం డ్యూటీ ఎక్కితే డ్యూటీ దిగిన బృందం నిద్రకు ఉపక్రమించవచ్చు. కానీ అలల తాకిడికి కదిలే యాట్‌లో నిద్ర అంత సులభం కాదు. అయినా బృంద సభ్యులు లెక్క చేయలేదు. ‘మా యాత్రలో పెద్ద పెద్ద సముద్ర తాబేళ్లు చూశాం. ఒక డాల్ఫిన్ల గుంపు మా వెనుక చాలాసేపు వచ్చింది. అద్భుతం’ అంటారు మేజర్ ప్రియా దాస్. భారత నేవీ, తీర ప్రాంత గస్తీ దళాలు వీరి యాత్ర సాగినంత మేర వీరి యాట్‌ను ట్రాక్ చేస్తూ సాంకేతిక సహకారాన్ని అందించాయి.
‘నేను కేన్వాస్ మీద ప్రతిసారీ నీలి రంగును చిత్రించేదాన్ని. ఈ యాత్రతో జీవితకాలపు నీలిమను నేను గుండెల్లో నింపుకున్నాను’ అంది ప్రియా దాస్. స్త్రీలు నౌకాయానంలో రాణించాలని, సెయిలింగ్ క్రీడలో భాగస్వామ్యం తీసుకోవాలని వారికి సందేశం ఇవ్వడానికి ఈ యాత్ర చేశారు వీరంతా. 7500 కిలోమీటర్ల మేర తీరం ఉన్న మన దేశంలో నౌకాయానం వల్ల స్త్రీలు ఎంతో ఉపాధి పొందవచ్చు అని ఆలోచిస్తే ఈ సాహస యాత్ర పూర్తిగా విజయవంతమైనట్టే.
Comments
Please login to add a commentAdd a comment