న్యూఢిల్లీ: భారత దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ రాజధాని లండన్ వరకు బస్సు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా అనిపిస్తోన్న ఈ సాహస యాత్రకు శ్రీకారం చుట్టింది అడ్వెంచర్స్ ఓవర్‌ల్యాండ్. గురుగ్రామ్‌కు చెందిన ఈ ట్రావెల్ కంపెనీ ఢిల్లీ నుంచి లండన్‌కు బస్సు నడపనున్నట్లు ఆగస్టు 15న ఒక ప్రకటన విడుదల చేసింది. 18 దేశాల గుండా బస్సు ప్రయాణం సాగనున్నట్లు తెలిపింది. 70 రోజుల పాటు 20 వేల కి.మీ ప్రయాణించనుంది. మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జెర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల గుండా బస్సు వెళుతుంది. 20 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్రత్యేక బస్సులో ఇద్దరు డ్రైవర్లు, ఓ గైడ్, హెల్పర్ ఉంటారు. (వైరల్ : అందుకే అవంటే మాకు ప్రాణం!)
ఈ ప్రయాణానికి వెళ్లాలనుకునేవారికి వీసా ఏర్పాట్లు కూడా సదరు కంపెనీయే చేసి పెడుతుండటం విశేషం. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంకా రిజిస్ట్రేషన్ మొదలు పెట్టలేదని అడ్వెంచర్స్ ఓవర్‌ల్యాండ్ సహ వ్యవస్థాపకుడు తుషార్ అగర్వాల్ పేర్కొన్నారు. అన్ని దేశాల్లో కరోనా ఉధృతి తగ్గిన తర్వాత దీన్ని చేపడతామని తెలిపారు. ప్రయాణికులకు మార్గమధ్యలో స్టార్ హోటళ్లలోనే బస కల్పిస్తామంటున్నారు. ఏ దేశంలో ఉన్నా భారతీయ వంటకాలు ఉండేట్లు చూసుకుంటామని పేర్కొన్నారు. ఇన్ని విశేషాలున్న ఈ బస్సు ప్రయాణం వచ్చే ఏడాది మేలో ప్రారంభం కానుంది. మీరు కూడా ఈ ట్రిప్ వేయాలనుకుంటే రూ.15 లక్షలు టికెట్ రుసుముగా చెల్లించాల్సిందే. (ర్యాప్ స్టార్ పాడు పని : 24 ఏళ్ల జైలు)
Comments
Please login to add a commentAdd a comment