Guru Puja celebrations
-
Teacher's Day 2024: థ్యాంక్యూ టీచర్..!
అంతవరకూ నీవొక రాయివి. గురువు చేయి పడగానే చెకుముకి అవుతావు. అంతవరకూ నీవొక ప్రవాహం. గురువు కాళ్లను తడపగానే దిశ గల్గి సారవంతమైన నేలకు మళ్లి విత్తుకు ప్రాణం పోస్తావు. అంతవరకూ కేవలం తోలు ముక్క. గురువు?... దానికి నాదం ఇస్తాడు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా ఎవరో ఒకరు ప్రేమగా ఆలనా పాలనా చేయగలరు. ప్రేమ పంచగలరు. కాని జ్ఞానం మాత్రం సరైన గురువే ప్రసాదిస్తాడు. గద్దించి బుద్ధి చె΄్తాడు. కనుచూపుతోనే శాసించి కడుపులో కరుణ దాచుకుని ఎదిగే వరకూ చేయి పట్టి నడిపిస్తాడు. తల్లిదండ్రులు జన్మనిస్తే దానిని సార్థకం ఎలా చేసుకోవాలో గురువే తెలియచేస్తాడు. ఒక్క గురువు వేల జీవితాలకు దిక్సూచి. గొప్ప గొప్ప టీచర్లు ఎందరో. తెలియని మహానుభావులు ఎందరో. విద్యార్థులు ఎదిగేందుకు నిచ్చెనలుగా మారి వారు మాత్రం నేల మీదే ఉండిపోతారు. అలాంటి మహనీయులందరికీ ‘టీచర్స్ డే’ సందర్భంగా నమస్కారాలు. థ్యాంక్యూ టీచర్.నేచరే టీచర్..‘ప్రకృతి అనే బడిలో ఎంతో మంది గురువులు ఉన్నారు’ అంటుంది రచయిత్రి, ఇలస్ట్రేటర్ బుల్బుల్ శర్మ. తానే ఒక గురువుగా మారి ప్రకృతిని గురువుగా చేసుకుని ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చో పిల్లలకు చెబుతోంది. వారి కోసం స్టోరీ, ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. క్లాస్‌రూమ్‌లో కూచుంటే టీచర్ మాత్రమే గురువు. అదే ప్రకృతి అనే క్లాస్‌రూమ్‌లోకి వెళితే ప్రతి తీవ, చెట్టు, పక్షి, ఊడ అన్నీ ఎన్నో నేర్పిస్తాయి పిల్లలకు. విషాదం ఏమంటే పిల్లలు ఈ అతి పెద్ద క్లాస్‌రూమ్‌ను మిస్ అవుతున్నారు అంటుంది శర్మ.పిల్లలకు అడవి తెలియదు..‘ఎలాంటి కాలంలో ఉన్నాం మనం? చెట్టు కనిపించడమే అపూర్వం, చెట్టు మీద పిట్ట కనిపించడం అద్భుతం అనుకునే కాలంలో ఉన్నాం. అక్కడెక్కడో చంద్రుడి మీద ఆవాసాల గురించి ఆలోచించే మనం చుట్టు ఉన్న ప్రకృతికి మాత్రం దూరం అవుతున్నాం. పిల్లలను ప్రకృతిలోకి తీసుకురావడానికి, అక్కడ పక్షులు అనే గురువులను వారికి పరిచయం చేయడానికి ఎన్నో కథలు రాశాను. బొమ్మలు వేశాను. వాటిని చూసిన, చదివిన పిల్లలు మనం కూడా పచ్చటి అడవిలోకి వెళదాం అనుకుంటారు’ అంటుంది శర్మ.ఫోన్ నుంచి ఫారెస్ట్‌కి..ఒక రోజు శర్మ ఫోన్ మోగింది. తనని తాను పరిచయం చేసుకున్న తరువాత ‘మా అబ్బాయి మీ పుస్తకం చదివిన తరువాత ఫారెస్ట్‌కు తీసుకువెళ్లు, పక్షులు చూపించు అని ఒకటే అడగడం...’ అని ఒక తల్లి శర్మతో ఫోన్లో చెబుతూ పోయింది. ఆ తల్లి గొంతులో పిల్లాడి మీద అసహనం లేదు. ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. బుల్బుల్ శర్మ పుస్తకాలు పిల్లలపై చూపిన సానుకూల ప్రభావం గురించి చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ‘మీరు ఏం నేర్చుకున్నారు పక్షుల నుంచి’ అని అడిగితే ‘క్రమశిక్షణ, ఐక్యత. కష్టపడడం, ఆత్మవిశ్వాసం, ఎప్పుడూ సంతోషంగా ఉండడం, గుడ్ పేరింటింగ్ ఇలా ఎన్నో మంచి విషయాలు పక్షుల నుంచి నేర్చుకోవచ్చు’ అంటారు పిల్లలు. ఆమె ఏ స్కూల్లోనూ టీచర్‌గా పని చేయలేదు. కాని వందలాది విద్యార్థులకు ప్రియమైన గురువు. ఆమె పుస్తకాలే వారికి గురుబోధ. వారితో ఆమె చేయించే హోమ్‌వర్క్ పేరే అడవి. పిల్లల కోసమే జీవితందిల్లీలో పుట్టిన బుల్బుల్ శర్మ భిలాయ్‌లో పెరిగింది. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో రష్యన్ లాంగ్వేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేసి పై చదువుల కోసం మాస్కో స్టేట్ యూనివర్శిటీకి వెళ్లింది. స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత పెయింటర్‌గా ప్రస్థానంప్రారంభించింది. పిల్లల కోసం ఆమె రాసిన కథలు భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్.. మొదలైన విదేశి భాషల్లోకి కూడా అనువాదం అయ్యాయి. తన పరిశీలన, ప్రయాణాల ఆధారంగా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రచనలు చేయడం బుల్బుల్ శర్మ శైలి. ‘ఏమైనా నేర్చుకోవచ్చు. ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు. ఎవరి నుంచి అయినా నేర్చుకోవచ్చు’ అనేది శర్మ నోటి నుంచి వినిపించే మాట.ఇవి చదవండి: Teacher's Day Special: నా బెస్ట్ టీచర్.. -
Teacher's Day Special: నా బెస్ట్ టీచర్..
ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకుంటున్నారు డాక్టర్ ఎన్. మృదుల. హైదరాబాద్, బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్. ఉపాధ్యాయురాలిగా 34 ఏళ్లలో ఆమె దగ్గర పదివేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకున్నారు. తనను బోధనరంగం వైపు నడిపించింది సికింద్రాబాద్, ప్యాట్నీలోని తాను చదువుకున్న స్కూలు, ఆ స్కూల్ తెలుగు టీచర్ భువనేశ్వరి గారేనన్నారు డాక్టర్ మృదుల. అంటే ఈ బెస్ట్ టీచర్ మెచ్చుకున్న తన బెస్ట్ టీచర్ భువనేశ్వరి.అంతా ఆ టీచర్ ప్రభావమే..‘భువనేశ్వరి టీచర్ పద్యంలోని ప్రతి పదానికి అర్థం చెప్పడంతో పాటు, దానికి వ్యుత్పత్తి, ఆ పదాన్ని ప్రయోగించడం వెనుక కవి ఉద్దేశం చెప్పేవారు. కవితలు, కథలు రాయించేవారు. సభా నిర్వహణ చేయించేవారు. ఆమె ప్రభావంతోనే తెలుగు భాష మీద మక్కువ పెరిగింది. ఆ ప్రోత్సాహమే ఇప్పటికీ మయూఖ, తరుణి మ్యాగజైన్లలో కాలమిస్టుగా వ్యాసాలు రాయిస్తోంది. పాఠం చెప్పడంలో కూడా ఆమె బాటనే అనుసరిస్తున్నాను’ అంటారు మృదుల.నిత్యం విద్యార్థినే!‘నా విద్యార్థులకు నేను అసైన్మెంట్లు ఇచ్చినప్పుడు వాళ్లు కచ్చితంగా గడువులోపే పూర్తి చేయాలని కోరుకుంటాను. అలాగే అధికారుల నుంచి మాకు వచ్చే అసైన్మెంట్లను కూడా గడువులోపు పూర్తి చేసేదాన్ని. పనిని శ్రద్ధగా అంకితభావంతో చేయాలనుకుంటాను. మా కుటుంబంలో టీచర్లు లేరు. నేను టీచింగ్‌లోకి వచ్చినందుకు అమ్మానాన్న చాలా సంతోషించారు. కోవిడ్‌లో ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి సాంకేతికపరంగా అవసరమైన సహాయం మా పిల్లలు చేసేవాళ్లు. కోవిడ్ తర్వాత కూడా అవసరాన్ని బట్టి ఆన్లైన్ క్లాసులను కొనసాగించాను. క్లాసులో పూర్తి కాని పాఠాలను ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో చెప్తున్నాను. టీచర్‌గా ‘బెస్ట్ ఆన్‌లైన టీచర్, బెస్ట్ హెచ్ఓడీ, బెస్ట్ ఫ్యాకల్టీ’ గౌరవాలందాయి. ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకోవడం ఇదే మొదటిసారి’’ అని తన ఉపాధ్యాయ ప్రస్థానాన్ని వివరించారు డాక్టర్ మృదుల. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’నందుకోనున్నారు.సీతమ్మబడి..మా స్కూల్ పేరు ‘పరోపకారి బాలికోన్నత పాఠశాల’. సీతమ్మ అనే మహిళ కట్టించిన స్కూల్ కావడంతో సీతమ్మబడి అంటారు. కవితలు రాయడంతోపాటు స్కూల్లో జరిగే సభలు, సమావేశాల్లో చురుగ్గా ఉండేదాన్ని. చక్కటి తెలుగుతో వక్తలను వేదిక మీదక ఆహ్వానించేదాన్ని. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆకాశవాణిలోని యువవాణి కార్యక్రమంలో ప్రయోక్తగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. అనౌన్స్మెంట్లు, వ్యాసాలు కధానికలు చదవడం... ఇలా కలం, గళం కలిసి కొనసాగాయి. ఇక బోధనరంగంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ ఇష్టమైన రోజుగానే గడిచింది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గురు పూజోత్సవం స్పెషల్..
షాబాద్: పల్లె అనంతరెడ్డి.. హైతాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్.. చిన్నప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.. పలక, బలపం కొనిచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ సమయంలోనే అతని గురువులు సాయం చేశారు. అన్నీ సమకూర్చారు. దీన్నే అనంతరెడ్డి స్ఫూర్తిగా తీసుకున్నారు. పేద విద్యార్థుల కోసం తన జీతంతోపాటు జీవితాన్ని అంకితం చేశారు.‘నేను విధుల్లో చేరినప్పుడు కొండాపూర్ యూపీఎస్ శిథిలమైన గదుల్లో కొనసాగుతోంది. 1 నుంచి 7వ తరగతి వరకు 150 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో స్కూల్ ఆవరణలో తడకలు వేయించి పాఠాలు చెప్పా. ఆ తర్వాత ప్రభుత్వ నిధులు, దాతల ద్వారా రూ.70 లక్షలతో ఏడు రూమ్‌లు నిర్మించాం. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో మరో రూ.30 లక్షలు పెట్టి సకల సౌకర్యాలు సమకూర్చాం. కరోనాలో పేద ప్రజలకు రూ.60 లక్షల విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశాం. స్మార్ట్ ఫోన్లు, టీవీలు ఇప్పించి విద్యార్థులకు డిజిటల్ బోధన కొనసాగించాను.పూర్వపు విద్యార్థులు అనంతరెడ్డికి బహుమతిగా ఇచ్చిన బుల్లెట్ బండి..హైసూ్కల్‌గా అప్‌గ్రేడ్ చేయించా. ప్రస్తుతం అక్కడ 1,100 మంది చదువుతున్నారు’అని అనంతరెడ్డి చెబుతున్నప్పుడు ఆయన కళ్లల్లో అనంతమైన సంతృప్తి కనిపించింది. తర్వాత అక్కడి నుంచి ఆయన హైతాబాద్ పాఠశాలకు బదిలీ అయ్యారు. అంతేకాదు.. నిరుపేద విద్యార్థులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచి్చనప్పుడూ తన వంతు సాయాన్ని అందిస్తూ అనంతరెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆటపాటలతో పాఠాలు..సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కవిత టీచర్ క్లాసంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఎందుకంటే.. ఆమె ఆటపాటలతో పాఠాలను చెప్పేస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం పెద్దరాజమూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న కవిత.. విద్యార్థులకు ఇంటి వద్ద లభించే కాగితం, అట్టముక్కలను తక్కువ ఖర్చుతో వివిధ రూపాల్లోకి మార్చి వాటి ద్వారా క్లాసులు బోధిస్తున్నారు.గణితంలో ఎక్కాల చట్రం, స్నేక్ ల్యాడర్ గేమ్, నంబర్స్, అల్ఫాబెట్స్ కాన్సెప్ట్ గేమ్ పేరుతో విద్యార్థులను ఆకట్టుకుంటూ వారికి అర్థమయ్యేలా పాఠాలు చెబుతున్నారు. నేలపై చుట్టూరా విద్యార్థులను కూర్చోబెట్టుకొని ప్రతి అంశంపై బొమ్మల ద్వారా బోధిస్తున్నారు. అంతేకాదు.. గణితం, సైన్స్, తెలుగు వంటి సబ్జెక్ట్‌లకు సంబంధించి విద్యార్థులకు బోధిస్తున్న అంశాలను, టీచింగ్ లెరి్నంగ్ మెటీరియల్‌ను ఇన్‌స్టా గ్రాం, యూట్యూబ్ చానల్ ద్వారా అందరికీ తెలియజేస్తూ లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.మా‘స్టారు’.. శేషగిరి సారు..బషీరాబాద్: నెల జీతం కోసం పనిచేసే వారు కొందరుంటే.. అందులో కొంత మొత్తాన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టి పాఠాలు చెప్పే సార్లు అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే శేషగిరి సారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్గౌడ్తండాలో ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన సేవలతో విద్యార్థులు, గ్రామస్తుల మనసు గెలుచుకున్నారు. 2018లో మంతన్‌గౌడ్ స్కూల్‌కు వచ్చిన ఆయన గత జూలై వరకూ పనిచేశారు.మట్టిగణపతులను చేయిస్తున్న శేషగిరిఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సాధారణ బదిలీల్లో వేరే పాఠశాలకు బదిలీ అయ్యారు. దీంతో మా సారు మాకే కావాలి.. అంటూ గ్రామస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రంఅందజేశారు. ఆయన రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పనిచేసి పాఠశాల రూపురేఖలు మార్చేశారు. స్కూల్ ఆవరణలోనే కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసి కూరగాయలు పండించి, వాటిని మధ్యాహ్న భోజనం కోసం వాడేలా చేశారు. ఆత్మరక్షణ కోసం విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించారు.అంతేకాదు.. ఏటా విద్యార్థులను విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లి, చారిత్రక ప్రదేశాలను చూపించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం.. మట్టితో వినాయకులను తయారు చేయించి గ్రామంలో ఇంటింటా మట్టి వినాయకులే ప్రతిష్టించేలా మార్పు తీసుకొచ్చారు. సమ్మర్ క్యాంపులు నిర్వహించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి, పిల్లల విషయంలో జాగ్రత్తలు బో ధించేవారు. అందుకే సారు బదిలీ అయ్యారనేసరికి. ఊరంతా కదిలివచ్చింది. కన్నీరు రాల్చింది.శేషగిరి, ఉపాధ్యాయుడు -
గురుపూజోత్సవం: గురువంటే... వెలిగే దీపం
భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది. సమున్నతమైనది, గౌరవప్రదమైనది. తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువుది. ఒక వ్యక్తి, సమాజ, జాతి నడకకు, నడతకు, పురోగతికి, శ్రేయస్సుకు గురువు మార్గదర్శనం తప్పనిసరి. వ్యక్తి వికాసానికైనా, దేశ వికాసానికైనా ఉత్తమ గురువు ప్రోత్సాహం, అనుగ్రహం, ఆశీర్వాదం అనివార్యం. ఉత్తమ గ్రంథాలన్నీ ఆచార్యుని ప్రాధాన్యతను ప్రస్తుతించాయి. ఒక జాతి ఉత్తమజాతిగా రూపొందటంలో ప్రజల గుణగణాలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. ప్రజలు శీలవంతులుగా ఉండాలంటే ప్రప్రథమంగా వారు చక్కని సంస్కార వంతులు కావాలి. ఈ గొప్ప సంస్కారం మన మనస్సుల్లో ఉద్దీపింప చేసే మహోన్నతుడే గురువు. మనకు విద్యను బోధిస్తూనే మన హృదయ సంస్కారాన్ని పెంచే యత్నం చేస్తాడు. ఆ క్రమంలో ఒకసారి మృదువుగా, మరొకసారి కఠినంగా వ్యహరిస్తుంటాడు. ఆపై తల్లిగా లాలిస్తాడు. ప్రేమను కురిపిస్తాడు. అక్కున చేర్చుకుంటాడు. అందుకే తల్లి ప్రేమ, ఆత్మీయత; అవసరమైన వేళలో తండ్రిలా దండన, సంరక్షణల మేళవింపే గురువు. ఉత్తమగురువు తన విద్యార్థులతో ఒక స్నేహితుడిగా, వేదాంతిగా, మార్గదర్శకుడిగా ఉంటూ వారి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాడు. చదువు ద్వారా జ్ఞానాన్ని పెంచుతూనే హృదయ సంస్కారాన్ని పెంచుతాడు. విద్యను చెప్పేవాడికే బుద్ధులు చెప్పే విశేష అధికారం, అవకాశం ఉంటాయి. ఉత్తమ గురువెన్నడూ తన ఈ గురుతర బాధ్యతను విస్మరించడు. తన ఆధిక్యతను ఎక్కడా ప్రదర్శించడు. చక్కని విద్యతోపాటు హృదయ సంస్కారం అలవడి వృద్ధి చెందే గొప్ప వాతావరణం, జ్ఞానం గురువు నుండి శిష్యుడికి, శిష్యుడి నుంచి గురువుకు ప్రసరిస్తుంది. గ్రీకు తత్త్వవేత్త, వేదాంతి, విద్యావేత్త ప్లేటో ఏథెన్స్ నగరంలో బోధనా పద్ధతిలో ఒక గొప్ప పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆయన కూడ తన విధానంలో విద్యార్థులకు పెద్ద పీట వేసాడు. అక్కడ ప్రతి లౌకిక, అలౌకిక విషయాలను, జ్ఞానం, దాని లోతుపాతులు, అది లభ్యమయ్యే మార్గాలు.. ఇలా ఎన్నో విషయాలను గురుశిష్యులు చర్చించేవారు. ఎవరి భావాలు ఉన్నతంగా ఉంటే వాటినే తీసుకునే వారు. ఇక్కడ విద్యంటే ఆలోచనల మార్పిడి. అలాగే ఈ గురుకులంలో ఎవరు ఎవరికీ బోధిస్తున్నారో చెప్పటం కష్టం. ఎవరిది గొప్ప ఆలోచనైతే దాన్నే మిగిలినవారు స్వీకరించే వారు. ఈ దేశాలలో కూడ ఒకరు ఎక్కువ, రెండవవారు తక్కువన్న ప్రసక్తే లేదు. ఎంత ఉన్నతమైన భావనో గమనించండి. ప్రాచ్య దేశాలైనా, పాశ్చాత్య దేశాలైనా గురువు విలువను, ఆయన ఆవశ్యకతను గుర్తెరిగి వర్తిస్తాయని ఆయనకు ఉన్నత స్థానాన్నిస్తాయని చెప్పటానికే ఈ ఉదాహరణ. గురువులో రవ్వంత గర్వమైనా ఉండకూడదు. అసలు పొడచూపకూడదు. మనస్సు నిర్మలమైన తటాకం కావాలి. ఇలా కావటానికి అతడు పక్షపాత రహితుడు కావాలి. అపుడే తన జ్ఞానాన్ని శిష్యులకు అందచేస్తాడు. ఆ జ్ఞానాన్ని పొందిన శిష్యుడు దాన్ని జీర్ణించుకుని తన మేధతో మరింతగా ప్రకాశింపచేసి తరువాత తరాలవారికి అందచేస్తాడు. అలా తన శిష్యులు తన జ్ఞానవాహికలు కావటం ఏ గురువుకైనా ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎంతో ఉప్పొంగిపోతాడు. జ్ఞానపరంపరకు వారధి కనుక అతనంటే అవ్యాజమైన ప్రేమ. ఎంతో గౌరవం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో గురుశిష్యులు జ్ఞానపాయలు. ఉత్తమ గురువు కోసం శిష్యుడు ఎలా తపిస్తూ, అన్వేషిస్తాడో, గురువు కూడ అంతే. గురువు క్షేత్రమైతే శిష్యుడు విత్తు లాంటివాడు. రెండిటి మేలు కలయిక వల్లే జ్ఞానమనే బంగరు పంట పండుతుంది. గురువు ఎవరినైనా శిష్యుడి తీసుకునే ముందు అతడి జ్ఞానంతో పాటు, అతడి జ్ఞానతృష్ణనూ పరీక్షిస్తాడు. అవి తృప్తికరంగా ఉన్నప్పుడే అతనికి విద్య గరిపేవాడు. గురువు జ్ఞానధారను ఒడిసిపట్టుకున్న శిష్యుడు తన ప్రతిభతో, అనుభవంతో దానిని మరింతగా విస్తరించి భావితరాలకు అందిస్తాడు. నేటి విద్యావ్యవస్థలో ఆనాటి ప్రమాణాలు, అంతటి ఉత్తమ గురుశిష్యులు, విలువలు లేవని కొందరి గట్టి నమ్మకం. ఆరోపణ. కొంత వాస్తవం లేకపోలేదు. నేటి కాలంలోనూ బోధనావృత్తిని ఎంతో పవిత్రంగా భావించి దానిని చేపట్టి ఎంతో సమర్థంగా నిర్వహించేవారు ఉన్నారు. దానికి మరిన్ని సొబగులద్ది, మరింత గౌరవాన్ని, హుందాతనాన్ని పెంచిన వారు, పెంచుతున్న వారు ఉన్నారు. పొందవలసిన గౌరవాన్ని పొందుతూనే ఉన్నారు. సాంకేతికాభివృద్ధి విశేషంగా పెరిగి మనకు ఎంతగానో చేరువైంది. నేటి గురువులు ఈ సాంకేతికతని అందిపుచ్చుకుని మరీ పాఠాలు చెప్పేటందుకు సంసిద్ధులవుతున్నారు. వీరి లాగానే, ఉత్తమ శిష్యులు కూడ గురువుల మాదిరిగానే తయారవుతున్నారు. కనుక నేటి అధ్యాపకులకు చాలా అప్రమత్తత ఉండాలి. తమ జ్ఞానాన్ని, బోధనానైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి. అప్రమత్తులుగా ఉంటేనే కదా ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని, నాలుగు కాలాలపాటు నిలువగలిగేది. ఉత్తమ గురువు మన ఆలోచనలకు నడకలు నేర్పుతాడు. మన ఊహలకు రెక్కలనిచ్చి మనం అద్భుత ప్రపంచాలలో విహరించే శక్తినిస్తాడు. ఉత్తమ గురువు మనలోని సృజనాత్మకతను మనం గుర్తించేటట్టు చేస్తాడు. ఉత్తమ గురువు చేసే, చేయగలిగే మహాత్తర కార్యమిదే. దీనివల్ల మనకు ప్రశ్నించే అలవాటు, శోధించే తత్వం అలవడుతుంది. అందుకే ఈ గురుశిష్యుల పాత్రను జాతిని సముద్ధరింపచేసే అత్యంత కీలకమైన అంశాలలో ఒకటిగా భావిస్తారు. వారి పాత్ర ఎంతో అమూల్యమైనది. అపురూపమైనది. ► మనకు తెలుసు అని అనుకున్నప్పుడు మనం నేర్చుకోవటం మానేస్తాం. ► విద్య అంతిమ లక్ష్యం ఒక స్వేచ్ఛా సృజనశీలిగా రూపొందటం. అపుడే చారిత్రక పరిస్థితులు, ప్రకృతి విపత్తులతో పోరాడగలడు. ► దేశంలో అందరికన్నా ఉపాధ్యాయుల మనస్సులు ఉత్తమమైనవిగా ఉండాలి. మన స్వీయ ఆలోచనాశక్తిని పెంపొందించటానికి సహాయపడే వాడే ఉపాధ్యాయుడు. ► విద్యావ్యవస్థకు ఉపాధ్యాయుడు వెన్నెముక. – డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ► ఏది చూడాలో చెప్పక ఎక్కడా చూడాలో మాత్రమే చెప్పేవాడు అధ్యాపకుడు. – అలెగ్జాండర్ ట్రెన్ఫర్ ► అగ్ర సింహాసనం మీదఎవరినైనా కూర్చోపెట్టదలచుకుంటే అతడు అధ్యాపకుడే. – గై కవాసాకి ► వెయ్యి రోజులు పరిశ్రమించి నేర్చుకున్న విద్యకన్నా ఒక గొప్ప అధ్యాపకుడితో ఒకరోజు గడపటం విలువైనది.– జపాన్ సామెత బోధించటమంటే మరోసారి నేర్చుకోవటం. – జోసెఫ్ జాబర్ట్ ► నేను అధ్యాపకుణ్ణి కాదు. కాని వైతాళికుణ్ణి – రాబర్ట్ ఫ్రాస్ట్ – బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
దేశవ్యాప్తంగా ఘనంగా గురు పూజా మహోత్సవాలు
-
గురుపూజోత్సవం
రాపూరు : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఆదివారం గురుపూజోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణ మండపంలో సరస్వతీదేవి జన్మనక్షత్రం రోజైన ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన పండితులను, గురువులను దేవస్థాన పాలకవర్గ అధ్యక్షులు నానాజీ, దేవాదాయశాఖ అధికారులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ జిల్లాలో మొట్టమొదటిసారిగా గురువులను పూజించి, సన్మానించిన ఘనత పెంచలకోన దేవస్థానానిదేనని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. అంతకుముందు కోనకు వచ్చిన పండితులు, గురువులు వేదపారాయణం చేశారు. అనంతరం చతుర్వేద పండితులు వంగల రామ్మూర్తి ఘనాపాఠి, మల్లికార్జున అవధాని, సత్యనారాయణాచార్యులు, నారాయణాచార్యులు, సంపత్‌కుమార్, అనంత వేంకట దీక్షితులు, శ్రీనివాసాచార్యులు, విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనాపాఠి, చంద్రశేఖర అవధాని, రామకృష్ణశర్మ అవధాని, చైతన్యశర్మ అవధాని, చంద్రశేఖర అవధాని, అన్నపూర్ణయ్య ఘనాపాఠి, రాజేశ్వరశాస్త్రి, సీతారామయ్య, పెంచలయ్య, కృష్ణమూర్తి అవధాని, కంతేటి త్రినాథ్ అవధాని, నరసింహరావులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, దేవాదాయ ధర్మాదాయ అసిస్టెంట్ కమిషనర్ రవీంద్రారెడ్డి, ఈవో శ్రీరామమూర్తి, పాలకవర్గసభ్యులు సోమయ్య, గోపాల్, హిందూ ధర్మపరిషత్ కోఆర్టినేటర్ సునీల్, అమరా శ్రీరాములశ్రేష్టి పాల్గొన్నారు. -
కాలజ్ఞాని నడయాడిన చోటు
♦ 13 నుంచి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన, ♦ గురుపూజ మహోత్సవాలు ♦ 17న బ్రహ్మ రథోత్సవం ♦ 18న ప్రసాద వినియోగం ప్రపంచంలో ఏ వింత జరిగినా ‘బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు’ అంటూ ప్రజలు నేటికీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘసంస్కర్త, సాక్షాత్ దైవ స్వరూపుడైన పోతులూరి వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఈ కాలజ్ఞాన ప్రభోద కర్త ఆరాధన, గురుపూజ మహోత్సవాలు వైఎస్ఆర్ కడపజిల్లా బ్రహ్మంగారి మఠంలో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. కడప నుంచి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బ్రహ్మంగారి మఠం. ప్రతియేటా మహాశివరాత్రినాడు బ్రహ్మంగారి కళ్యాణం, వైశాఖ శుద్ధ దశమి రోజు సిద్ధ సమాధి, బ్రహ్మంగారు పుట్టిన రోజున ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 16ను స్వామి సజీవ సమాధి నిష్ట వహించిన రోజుగా, 17ను బ్రహ్మరథోత్సవంగా అత్యంత ఘనంగా జరుపుతారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అశేష భక్తజనం తరలిరానున్నారు. యాగంటి గుహల్లో తపస్సు శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ప్రకృతాంబ, పరిపూర్ణాచార్యులు అనే విశ్వకర్మ దంపతులకు సరస్వతీ నది తీరంలో కీలక నామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి (క్రీస్తుశకం 1608)నాడు జన్మించారు. అత్రి మున్యాశ్రమంలో శిష్యులుగా పెరిగారు. కర్ణాటక పాపాఘ్ని మఠాధిపతులు యనమందల వీరభోజయ్య, వీరపాపమాంబ దంపతులకు దత్త పుత్రులుగా బాల్యం గడిపారు. కాంచీపురంలో ఆనందభైరవ యోగికి వీరనారాయణ మహామంత్రం ఉపదేశించారు. బనగానపల్లెలో గరివిరెడ్డి అచ్చమ్మ, వెంకటరె డ్డి దంపతుల ఇంట పశువులు కాశారు. రవ్వల కొండలో సాంద్రసింధువేదమైన కాలజ్ఞానం రచించారు. యాగంటి గుహల్లో తపస్సు చేశారు. అచ్చమ్మ దంపతులకు బ్రహ్మోపదేశం చేశారు. ఆ దంపతులు నిర్మించిన నేలమఠంలో అన్నాజయ్యకు కాలజ్ఞానం బోధించారు. తాను శిల్పీకరించిన వీరభద్ర స్వామి శిలా విగ్రహాన్ని అల్లాడుపల్లెలో ప్రతిష్టించారు. కందిమల్లాయపల్లెలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని పెద్దకొమెర్ల శివకోటయాచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. ఐదుగురు పుత్రులను, ఒక పుత్రికను సంతానంగా పొందారు. శిష్యగణ సమేతంగా దేశం నలుమూలల సంచరించి వేదాంతతత్వ ప్రచారం చేశారు. మహ్మదీయ తెగకు చెందిన సిద్ధయ్యను శిష్యునిగా స్వీకరించారు. సిద్ధవటం, కడప, కర్నూలు, బనగానపల్లె నవాబుల మన్ననలు పొంది, హిందూ-మహ్మదీయ సఖ్యతను చేకూర్చారు. పుష్ప గిరిలో బ్రహ్మరథ సత్కారం స్వీకరించారు. శరీరంలో దేవతలను చూడాలని భార్యను ఖండించిన దళితుడైన కక్కయ్యకు జ్ఞానోపదేశం గావించి, అతని భార్య ముత్తమ్మకు ప్రాణం పోశారు. సిద్దవటం నవాబుచే ఏడెకరాల స్థలాన్ని పొంది, ప్రస్తుత మఠం నిర్మాణం చేసుకున్నారు. తన పుత్రిక వీరనారాయణమ్మను ఆమె పౌత్ర పరంపరయే అనువంశీకర గా మఠాధిపత్యం వహిస్తుందని ఆశీర్వదించారు. కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను వీరభోగ వసంతరాయులుగా జన్మించి ధర్మసంస్థాపనం గావిస్తామన్నారు. 85 ఏళ్ల వయసులో (1693) వైశాఖ శుద్ధ దశమినాడు ప్రస్తుతం మఠంలో సజీవ సమాధి నిష్ట వహించారు. నాటి నుంచి జగత్ కల్యాణం కోసం యోగనిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు స్వీకరిస్తున్నారు. ఇలా చేరుకోవచ్చు ♦ కడప నుంచి అయితే మైదుకూరు మీదుగా వెళ్లాలి. ♦ నెల్లూరు నుంచి వచ్చేవాళ్లు బద్వేల్ మీదుగా చేరుకుంటారు. బద్వేల్ నుంచి 35 కిలోమీటర్లు. ♦ ప్రకాశం జిల్లా గిద్దలూరులో రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ నుంచి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మంగారి మఠంకు రోడ్డుమార్గంలో చేరుకోవాలి. మఠంలో దర్శనీయ స్థలాలు వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం, స్వామి తవ్వుకున్న బావి, కాలజ్ఞాన ప్రతులు, పోలేరమ్మతో నిప్పు తెప్పించిన రచ్చబండ, స్వామి మనవరాలు ఈశ్వరీదేవి మఠం, ఇక్కడకు 9 కిలోమీటర్ల దూరంలో సిద్దయ్య మఠం, కక్కయ్య గుడి, పోలేరమ్మ గుడి, వంటివి దర్శించుకోవచ్చు. - మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి ప్రతినిధి, కడప - లెక్కల సుధాకర్‌రెడ్డి, సాక్షి, బ్రహ్మంగారి మఠం