బుల్‌బుల్ శర్మ
అంతవరకూ నీవొక రాయివి. గురువు చేయి పడగానే చెకుముకి అవుతావు. అంతవరకూ నీవొక ప్రవాహం. గురువు కాళ్లను తడపగానే దిశ గల్గి సారవంతమైన నేలకు మళ్లి విత్తుకు ప్రాణం పోస్తావు. అంతవరకూ కేవలం తోలు ముక్క. గురువు?... దానికి నాదం ఇస్తాడు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా ఎవరో ఒకరు ప్రేమగా ఆలనా పాలనా చేయగలరు. ప్రేమ పంచగలరు. కాని జ్ఞానం మాత్రం సరైన గురువే ప్రసాదిస్తాడు. గద్దించి బుద్ధి చె΄్తాడు. కనుచూపుతోనే శాసించి కడుపులో కరుణ దాచుకుని ఎదిగే వరకూ చేయి పట్టి నడిపిస్తాడు. తల్లిదండ్రులు జన్మనిస్తే దానిని సార్థకం ఎలా చేసుకోవాలో గురువే తెలియచేస్తాడు. ఒక్క గురువు వేల జీవితాలకు దిక్సూచి. గొప్ప గొప్ప టీచర్లు ఎందరో. తెలియని మహానుభావులు ఎందరో. విద్యార్థులు ఎదిగేందుకు నిచ్చెనలుగా మారి వారు మాత్రం నేల మీదే ఉండిపోతారు. అలాంటి మహనీయులందరికీ ‘టీచర్స్ డే’ సందర్భంగా నమస్కారాలు. థ్యాంక్యూ టీచర్.
నేచరే టీచర్..
‘ప్రకృతి అనే బడిలో ఎంతో మంది గురువులు ఉన్నారు’ అంటుంది రచయిత్రి, ఇలస్ట్రేటర్ బుల్‌బుల్ శర్మ. తానే ఒక గురువుగా మారి ప్రకృతిని గురువుగా చేసుకుని ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చో పిల్లలకు చెబుతోంది. వారి కోసం స్టోరీ, ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. క్లాస్‌రూమ్‌లో కూచుంటే టీచర్ మాత్రమే గురువు. అదే ప్రకృతి అనే క్లాస్‌రూమ్‌లోకి వెళితే ప్రతి తీవ, చెట్టు, పక్షి, ఊడ అన్నీ ఎన్నో నేర్పిస్తాయి పిల్లలకు. విషాదం ఏమంటే పిల్లలు ఈ అతి పెద్ద క్లాస్‌రూమ్‌ను మిస్ అవుతున్నారు అంటుంది శర్మ.
పిల్లలకు అడవి తెలియదు..
‘ఎలాంటి కాలంలో ఉన్నాం మనం? చెట్టు కనిపించడమే అపూర్వం, చెట్టు మీద పిట్ట కనిపించడం అద్భుతం అనుకునే కాలంలో ఉన్నాం. అక్కడెక్కడో చంద్రుడి మీద ఆవాసాల గురించి ఆలోచించే మనం చుట్టు ఉన్న ప్రకృతికి మాత్రం దూరం అవుతున్నాం. పిల్లలను ప్రకృతిలోకి తీసుకురావడానికి, అక్కడ పక్షులు అనే గురువులను వారికి పరిచయం చేయడానికి ఎన్నో కథలు రాశాను. బొమ్మలు వేశాను. వాటిని చూసిన, చదివిన పిల్లలు మనం కూడా పచ్చటి అడవిలోకి వెళదాం అనుకుంటారు’ అంటుంది శర్మ.
ఫోన్ నుంచి ఫారెస్ట్‌కి..
ఒక రోజు శర్మ ఫోన్ మోగింది. తనని తాను పరిచయం చేసుకున్న తరువాత ‘మా అబ్బాయి మీ పుస్తకం చదివిన తరువాత ఫారెస్ట్‌కు తీసుకువెళ్లు, పక్షులు చూపించు అని ఒకటే అడగడం...’ అని ఒక తల్లి శర్మతో ఫోన్‌లో చెబుతూ పోయింది. ఆ తల్లి గొంతులో పిల్లాడి మీద అసహనం లేదు. ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. బుల్‌బుల్ శర్మ పుస్తకాలు పిల్లలపై చూపిన సానుకూల ప్రభావం గురించి చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ‘మీరు ఏం నేర్చుకున్నారు పక్షుల నుంచి’ అని అడిగితే ‘క్రమశిక్షణ, ఐక్యత. కష్టపడడం, ఆత్మవిశ్వాసం, ఎప్పుడూ సంతోషంగా ఉండడం, గుడ్ పేరింటింగ్ ఇలా ఎన్నో మంచి విషయాలు పక్షుల నుంచి నేర్చుకోవచ్చు’ అంటారు పిల్లలు. ఆమె ఏ స్కూల్లోనూ టీచర్‌గా పని చేయలేదు. కాని వందలాది విద్యార్థులకు ప్రియమైన గురువు. ఆమె పుస్తకాలే వారికి గురుబోధ. వారితో ఆమె చేయించే హోమ్‌వర్క్ పేరే అడవి.
పిల్లల కోసమే జీవితం
దిల్లీలో పుట్టిన బుల్‌బుల్ శర్మ భిలాయ్‌లో పెరిగింది. దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో రష్యన్ లాంగ్వేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేసి పై చదువుల కోసం మాస్కో స్టేట్ యూనివర్శిటీకి వెళ్లింది. స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత పెయింటర్‌గా ప్రస్థానంప్రారంభించింది. పిల్లల కోసం ఆమె రాసిన కథలు భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్.. మొదలైన విదేశి భాషల్లోకి కూడా అనువాదం అయ్యాయి. తన పరిశీలన, ప్రయాణాల ఆధారంగా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రచనలు చేయడం బుల్‌బుల్ శర్మ శైలి. ‘ఏమైనా నేర్చుకోవచ్చు. ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు. ఎవరి నుంచి అయినా నేర్చుకోవచ్చు’ అనేది శర్మ నోటి నుంచి వినిపించే మాట.
ఇవి చదవండి: Teacher's Day Special: నా బెస్ట్ టీచర్..
Comments
Please login to add a commentAdd a comment