‘ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్లు ప్రత్యేకత ఉన్న వాళ్లే. ఫైనల్‌లో గెలవగలిగిన టాలెంట్ అందరిలోనూ ఉంది’ ఇది షణ్ముఖ ప్రియ జవాబు. ‘ఫైనల్‌లో ఎవరు గెలుస్తున్నారనుకుంటున్నార’ని ఓ వారం కిందట జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు ప్రియ ఇచ్చిన ఈ సమాధానంలో ఎంతో పరిణతి ఉంది. ‘ఈ వేదిక నుంచి ఇంటికి వెళ్తూ ఏమి తీసుకెళ్లబోతున్నార’నే ప్రశ్నకు కూడా... ‘అనేక జ్ఞాపకాలను, నేర్చుకున్న పాఠాలను’ అని స్థితప్రజ్ఞతతో బదులిచ్చింది ఈ పద్దెనిమిదేళ్ల గడుసమ్మాయి.
వైజాగ్‌లో పుట్టి టీవీ తెర మీద తెలుగు ప్రేక్షకుల కళ్ల ముందే పెరిగిన షణ్ముఖ ప్రియ గొంతు ప్రతి తెలుగింటిలోనూ వినిపించింది. పదమూడేళ్లుగా ప్రతి తెలుగింటికీ ఇంటి బిడ్డగా మారిపోయింది. అంతటి ప్రేమ ఆప్యాయతలను అందుకుంటోంది. ఒక ‘సారేగమప లిటిల్స్, మరో ‘పాడుతా తీయగా’, సూపర్‌సాంగ్స్, ద వాయిస్ ఇండియా కిడ్స్‌తో సెలయేరులా సాగిన రాగప్రవాహం ఇండియన్ ఐడల్ 12 రియాలిటీ షో వేదికను చేరింది. ఫైనల్స్‌లో ఆరవస్థానంలో నిలిచిన షణ్ముఖప్రియ ముంబయి నుంచి సాక్షితో పంచుకున్న అనుభవాలు.
ఈ షో మలుపు తిప్పింది.
‘‘నాకు చిన్నప్పటి నుంచి ఇండియన్ ఐడల్‌లో పాడాలనే కోరిక ఉండేది. ఆ లక్ష్యాన్ని చేరుకున్నాను. ఫైనల్ వరకు రావడమే పెద్ద అచీవ్‌మెంట్. దానిని సాధించగలిగాను. సంగీతంతో మమేకమైన నా జీవితంలో ఈ షో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ షో ద్వారా నేను ఎంతమంది సంగీతప్రియుల మనసుకు దగ్గరయ్యానో మాటల్లో చెప్పలేను. ప్రతి పాటలోనూ నా వంతుగా నూటికి నూరుశాతం ఇచ్చాను. మై లెవెల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చానని చెప్పడానికి సందేహించడం లేదు. ఇక గెలుపు ఓటముల విషయం అంటారా? ఇక్కడ గెలుపును ఆన్‌లైన్ ఓటింగ్ కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి నా పార్టిసిపేషన్ మాత్రమే నాకు ముఖ్యం. ఫలితం మీద నాకు ఎటువంటి అసంతృప్తి లేదు. పైగా ఈ షో నా జీవితంలో గొప్ప మలుపు కాబోతోంది. జావేద్ అక్తర్‌తోపాటు అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు నన్ను ఈ షో ద్వారానే గుర్తించారు.
నన్ను అంతర్జాతీయ ప్రముఖులు జస్టిన్ బీబర్, షకీరాలతో పోల్చారు. నాకది ఎంతో సంతోషంగా ఉంది. రెండు వేలుగా ఉన్న నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా రెండు లక్షల ఎనభై వేలకు చేరింది కూడా ఇప్పుడే. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా సైన్ చేశాను. ఇరవై పాటలతో విడుదలవుతున్న ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. నేను గెలవాలని ఇంతమంది వీక్షకులు కోరుకోవడమే పెద్ద విజయం’’ అని చెప్పింది షణ్ముఖ ప్రియ. అలాగే ఈ ఇండియన్ ఐడల్ 12 రియాలిటీ షో సందర్భంగా ప్రియ మరో ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా ప్రకటించేసింది. అదేంటంటే... ‘ఇదే నా ఆఖరి రియాలిటీ షో. ఇకపై సంగీత ప్రపంచంలో నా ప్రయాణం కొత్తదారిలో సాగుతుంది’ అని చెప్పింది.
– వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment