‘‘పచ్చబొట్టు ఆదివాసీలకే అబ్బిన విద్య. మన దగ్గర మా బిరుద్ గోందులు మాత్రమే పచ్చబొట్టు వేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మా తెగ ఆడవాళ్లు మాత్రమే పచ్చబొట్టు వేస్తారు’’ అని చెప్పింది సుగుణాబాయ్. ఆమెది ఆదిలాబాద్ జిల్లా, తోషం గ్రామం. పచ్చబొట్టు వేయడానికి ఉపయోగించే కిట్ ఈ మహిళల దగ్గర ఎప్పుడూ ఉంటుంది. పచ్చబొట్టు వేయడానికి ఉపయోగించే సూదులు, అడవిలో సేకరించిన మూలికలతో చేసిన పసర్లు కూడా చిన్న సీసాల్లో ఉంటాయి. బిరుద్ గోందు మహిళల నుదుటి మీద కూడా పచ్చబొట్టు ఉంటుంది.
అన్నిరకాల బొట్టుల కంటే ఇది తొలి బొట్టు అని చెబుతారు. పెళ్లికి ముందే పచ్చబొట్టు వేయాలని చెబుతారు. ఇందుకు వాళ్లు చెప్పే కారణం వింతగా ఉన్నప్పటికీ కొంత తార్కికత ఉందనే అనిపిస్తుంది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిన యువతికి మానసిక దారుఢ్యం ఉండాలి. నొప్పిని భరించేది దేహమే అయినప్పటికీ మనసు గట్టిగా ఉంటేనే శారీరక బాధను తట్టుకోగలుగుతారని, పచ్చబొట్టు నొప్పి ని భరించిన తరవాత ధైర్యం వస్తుందని, ఆ తర్వాత అడవుల్లో సంచరించేటప్పుడు ఏ గాయం తగిలినా అధైర్యపడరని చెప్పిందామె.
బంగారు నగల్లో ఉండే నైపుణ్యం
పచ్చబొట్టును అందంగా వేయడం ఒక కళ. ఆ కళలో ప్రతి బిరుద్ గోంద్ మహిళా ఆరితేరి ఉంటుంది. అరచేతి నుంచి మోచేతుల వరకు మెహందీ పెట్టుకున్నట్లు సన్నటి లతలు తీగల డిజైన్‌ను సూదులతో వేస్తారు. మెడ చుట్టూ కంఠాభరణం, ముక్కుపుడక, కాళ్ల పట్టీలు, వంకీలు... అన్నిరకాల ఆభరణాలూ పచ్చబొట్టు వేసుకుంటారు. బంగారు ఆభరణాలలో ఉండే నైపుణ్యం పచ్చబొట్టులోనూ ఉంటుంది’’ అంటోంది సుగుణాబాయి.
పచ్చని బంధానికి బొట్టు
మన కవులకు పచ్చబొట్టు చక్కటి కథాంశం. ప్రేమికుల మధ్య బంధానికి చెరగని ముద్రగా పచ్చబొట్టు చుట్టూనే కథను అల్లేయడం మన చిత్రసీమ నైపుణ్యం. అయితే, పచ్చబొట్టు ప్రేమికులకు మాత్రమే కాదు, దంపతుల మధ్య ప్రేమను కూడా పెంచుతుందని చెబుతుంది సుగుణాబాయి. ఆడవాళ్లు ఎక్కువగా కృష్ణుడి పింఛాన్ని పచ్చబొట్టుగా వేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పింది సుగుణాబాయ్. ఆమె పచ్చబొట్టు వేయడం కోసమే ఆదివాసీల నివాస ప్రదేశాలు, మైదాన ప్రాంతాలు, నగరాల్లోనూ పర్యటించింది. పచ్చబొట్టుమనిషికి – మనసుకు మధ్య ముడివడే అందమైన బంధం అంటుందామె. భార్య పట్ల ప్రేమ ఉన్న మగవాళ్లు భార్య ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకుంటూ చందమామ బొమ్మ వేసుకుంటారని, భర్తకు ఏ ఆపదా రాకూడదని ఆడవాళ్లు సుదర్శన చక్రాన్ని, కలువ పువ్వు వేయించుకుంటారని చెప్పింది. కానీ, నిజానికి పచ్చబొట్టు వేయించుకునే వాళ్ల మైండ్‌ను ఆ రకంగా మలిచేది పచ్చబొట్టు వేసే మహిళల మాటల చాతుర్యమే. ఈ బాడీ ఆర్డ్‌ని అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, జార్ఖండ్, ఒడిషాల్లో స్థానిక ఆదివాసీలు వేస్తారు. మన తెలుగు రాష్ట్రాలకు మాత్రం చత్తీస్‌గఢ్, కచ్చర్ గఢ్ నుంచి విస్తరించింది.
మాఘ పున్నమి జాతర
సుగుణాబాయ్... తమ మూలాలను వివరిస్తూ ‘‘కచ్చర్‌గఢ్ గుహలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ సరిహద్దులో విస్తరించాయి. ఇది మాకే కాదు, అనేక ఆదివాసీ తెగలకు పవిత్రమైన ప్రదేశం. ఏటా ఇక్కడ మాఘపౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. జంగుబాయి, లింగుబాబా జాతర చేసుకుంటాం. జంగుబాయి కచ్చర్‌గఢ్ లో సంచరించిన కథను పాటలుగా పాడుకుంటాం. పచ్చబొట్టు పసరు ఔషధం కూడా అక్కడే దొరుకుతుంది. మాకు రాయడం రాదు. మా పిల్లలకు మా పూర్వికుల గురించి చెప్పుకునేది పాటలతోనే. పచ్చబొట్టు వేయడానికి వెళ్లిన ప్రతి తావునా మా పాట పాడి వినిపిస్తాం. మా పాటలను మేము రికార్డు చేసుకుని దాచుకుంటున్నాం’’ అని పచ్చబొట్టు అందమైన చరిత్ర చెప్పింది సుగుణాబాయి.
– వాకా మంజులారెడ్డి
TATTOO: పచ్చని ప్రేమ బొట్టు
Published Tue, Jun 15 2021 5:15 AM | Last Updated on Tue, Jun 15 2021 1:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment