'ఆడు'వారు | Dont play for the Victory | Sakshi
Sakshi News home page

'ఆడు'వారు

Published Mon, Apr 30 2018 12:51 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

Dont play for the Victory - Sakshi

కటిక జలపాతంలో రాపెల్‌డౌన్‌ చేస్తూ...

‘ఆడపిల్లకు ఆ ఆటలేంటి?’ అన్నారు నాన్న. ‘బడికి వెళ్లావా వచ్చావా అన్నది కూడా మరో కంటికి తెలియకూడదు’ అన్నట్లుండేది ఆయన పెంపకం. సాయంత్రం నాలుగు దాటితే, ఒకసారి బడి నుంచి ఇంటికొస్తే మళ్లీ అడుగు బయటపెట్టేది మర్నాడు బడికెళ్లడానికే. ఆ తండ్రి సంప్రదాయ పెంపకంలో కనిపించని లక్ష్మణరేఖలుండేవి. తండ్రి చెప్పినట్లే కామ్‌గా చదువుకుని బీకామ్‌ పూర్తి చేశారు విజయలక్ష్మి.
సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగం వచ్చింది. ‘మనింటి ఆడపిల్లలు ఇలాంటి ఉద్యోగాలు చేయడం చూశావా’ అన్నారాయన. మరో నెలకు ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగం వచ్చింది.‘అలాంటి ఉద్యోగం, ఇలాంటి అనే చర్చలే వద్దు, అసలు ఉద్యోగాలే వద్దు’ అని పెళ్లి చేశాడు. 

కాళ్ల పారాణితో తూర్పుగోదావరి జిల్లా నారాయణపురం నుంచి భీమవరం దగ్గర కోపల్లెకు వెళ్లారు. అత్తింటి వారు అంతకంటే సంప్రదాయబద్ధులు. ఆడవాళ్లు బయటకెళ్లాలంటే గుర్రపు బగ్గీకి పరదాలు కట్టుకుని ప్రయాణిస్తారు. భర్త మద్యానికి బానిస. ఆ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు. అతడిని దారిలో పెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. పది నెలల పాపాయినెత్తుకుని భర్త చేతిని పట్టుకుని 1989లో హైదరాబాద్‌లో అడుగుపెట్టారామె. అత్తగారింట్లో అడుగుపెట్టేటప్పుడు అతడి చేతిని పట్టుకుని వేసిన అడుగుల్లో... భర్త తనను నడిపిస్తాడనే భరోసా ఉండేది. హైదరాబాద్‌కు అడుగులు వేసినçప్పుడు మాత్రం... తనే అతడిని నడిపించక తప్పని పరిస్థితి ఆమెది.

మంచి తల్లినైనా కావాలి
భర్త దారిలో లేకపోతే తప్పంతా భార్యదే అన్నట్లు చూసే సమాజం మనది. జీవితంలో అప్పటికామెకు కనిపిస్తున్న చిరుదీపం కూతురు హారిక. ఆమె మంచి స్టూడెంట్‌. వీణ చక్కగా మీటుతుంది. డ్రాయింగ్‌ కాంపిటీషన్‌లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు గెలుచుకుంది. తండ్రి తనకు పెట్టిన ఆంక్షలేవీ తాను కూతురికి పెట్టకుండా పెంచారు విజయలక్ష్మి. అది 2006, మార్చి ఎనిమిది. అడ్వెంచర్‌ క్లబ్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లో మహిళాదినోత్సవం వేడుకలలో అమ్మాయిలకు డ్రాయింగ్‌ పోటీలు. కూతుర్ని తీసుకుని వెళ్లారు విజయలక్ష్మి. ఆ క్లబ్‌లో ఉన్న క్లైంబింగ్‌ వాల్‌ను చూడగానే బాల్యం గుర్తొచ్చింది. సంప్రదాయపు ఆంక్షలతో చచ్చిపోయిందనుకున్న క్రీడాకారిణి అప్పుడు నిద్రలేచింది. పేరు రిజిస్టర్‌ చేసుకుని పోటీల్లో పాల్గొన్న మహిళలకంటే తక్కువ టైమ్‌లో క్లైంబింగ్‌ పూర్తి చేశారు విజయలక్ష్మి. అప్పటికామె వయసు 42. 

పిల్లలను... ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకునేటట్లు పెంచాలి. అలాగే... ‘ఆటల్లో ఓడినప్పుడు మరోసారి గెలిచి తీరుతామనే ధైర్యంతో తలెత్తుకుని రావాలి. గెలిచినప్పుడు ఓడిన వారిని గుర్తు పెట్టుకోవాలి’ అని చెప్పాలి. 

ఆడుకోనివ్వాలి
పిల్లల్లో సమస్యను ఎదుర్కొనే ధైర్యం లోపించడానికి తల్లిదండ్రుల అతిజాగ్రత్త కూడా కారణమే. ఇప్పుడు స్పోర్ట్స్‌ని కెరీర్‌గా తీసుకోవాలనుకున్న పిల్లలే ఆటలు ఆడుతున్నారు. ఆ పిల్లలనే ఆడనిస్తున్నారు పేరెంట్స్‌. పిల్లల చేత ఆడిస్తున్నారు తప్ప, పిల్లలను ఆడుకోనివ్వడం లేదు. కెరీర్‌గా ఎంచుకోవడం కోసమే కాదు. ప్రతి ఒక్కరూ ఆటలు ఆడి తీరాలి. పిల్లల్లో క్రీడాస్ఫూర్తిని పెంచడానికి ఇచ్ఛాపురం నుంచి తడ వరకు సైకిల్‌ మీద ప్రయాణించాను. మారుమూల గ్రామాల్లోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాను. వేలాది మంది పిల్లలతో నేను ఆడాను. ఆడుకునేటట్లు వాళ్లను చైతన్యవంతం చేశాను. ఆ క్రీడాస్ఫూర్తి వాళ్లలో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. జిల్లా కలెక్టర్లను కలసి క్రీడా ప్రాంగణాలలో అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌కి కూడా సౌకర్యాలు కల్పించమని కోరాను. నా ప్రతిపాదనను చాలామంది స్వాగతించారు. 
– ఇందుకూరు విజయలక్ష్మి, అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌పర్సన్, మోటివేషనల్‌ స్పీకర్‌

బతుకు పోరాటం
హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత దూరపుబంధువుల కంపెనీలో భర్తను ఉద్యోగంలో చేర్చారు విజయలక్ష్మి. తాను ఇంట్లోనే ఉండి పాపను చూసుకుంటూ టైలరింగ్‌తోపాటు ట్యూషన్‌లు కూడా చెప్పారు. పాప పెద్దయ్యాక పార్ట్‌టైమ్‌జాబ్‌లు, ఫుల్‌టైమ్‌ జాబ్‌లు... దొరికిన ఉద్యోగం చిన్నదా పెద్దదా అని చూడకుండా చేయగలిగినంత పని చేశారు. భర్త ఉద్యోగం చేసినా ఇంటికి రూపాయి కూడా రాదని తెలుసు. అయితే ఆయన తాగుడుకి డబ్బుల కోసం తనను వేధించకపోతే చాలనుకున్నారు. ఆఫీస్‌ నుంచి మద్యం షాపుకెళ్లి, ఇంటికి వచ్చే దారిలోనే రోడ్డు మీద పడిపోతే అతడిని లేపి భుజాన వేసుకుని ఇంటికి వచ్చేవారామె. కాలనీ వాళ్ల ఎగతాళి చూపులు, జాలి చూపులు ఆయన పోయే వరకు ఆమెకి తప్పలేదు.

టర్నింగ్‌ పాయింట్‌
అడ్వెంచర్‌ క్లబ్‌తో అలా ఏర్పడిన అనుబంధం ఆమెను ఇప్పటికీ నడిపిస్తూనే ఉంది. రాపెల్‌డౌన్‌ స్పోర్ట్‌లో ఆమె ఎక్స్‌పర్ట్‌. భువనగిరి కోట పై నుంచి కిందకు ఆరువందల అడుగులకు పైగా రాపెల్‌ డౌన్‌ చేశారు. అరకు సమీపంలో ఉన్న కటిక జలపాతం నాలుగు వందల అడుగులకు పైగా ఉంటుంది. తాడు పట్టుకుని కొండ మీద నుంచి ఆ జలపాతం నీటిలో తడుస్తూ కిందికి దిగారు. సరదాగా చేసిన అడ్వెంచర్‌ అది. ఆ తర్వాత తెలిసింది అది ప్రపంచ రికార్డ్‌ అని. దాంతో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. కులుమనాలిలో ఆరువేల అడుగుల ఎత్తు కొండ మీదకు మౌంటనీయరింగ్‌ చేశారు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌తోపాటు మరో ఎనిమిది వరల్డ్‌ రికార్డ్‌లు, మరో మూడు గ్రూప్‌ రికార్డులు బ్రేక్‌ చేశారామె. స్పోర్ట్స్‌తో మమేకమైనప్పటి నుంచి ‘జీవితాన్ని చూసే దృష్టి కోణం పూర్తిగా మారిపోయిందం’టారు విజయలక్ష్మి. ‘స్పోర్ట్స్‌ జీవితంలో భాగమైతే జీవితాన్ని స్పోర్టివ్‌గా తీసుకోవడం అలవడుతుంది. ఆటల్లో... ముఖ్యంగా అడ్వెంచరస్‌ స్పోర్ట్స్‌లో టీమ్‌ వర్క్‌ తప్పనిసరి. కలివిడిగా ఉండడం, సమాచారాన్ని సులభంగా త్వరగా చెప్పడం, ఒకరికొకరు సహాయంగా ఉండడం వస్తుంది. ఒక మనిషి కంప్లీట్‌ పర్సన్‌గా మారతారు.  

కొండ దిగేటప్పడు తాడును... జీవితంలో ధైర్యాన్ని వీడరాదు
ఇప్పుడు యువతలో సంపూర్ణత్వం, సమగ్రతత్వం లోపిస్తున్నట్లనిపించింది. చిన్న సమస్య వచ్చినా దానిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఆందోళనకు గురికావడం, ఆత్మహత్యలకు పాల్పడడం చూస్తున్నాం. అందుకే నాకు తెలిసిన విధానంలో పిల్లల్ని చైతన్యవంతం చేస్తున్నాను. మెరిట్‌ స్టూడెంట్‌ అయినా సరే సరైన గాడిలో పెట్టేవాళ్లు లేకపోతే, మానసిక స్థయిర్యం లోపిస్తే బతుకు నిర్వీర్యం అయిపోతుందనడానికి మా వారే పెద్ద ఉదాహరణ. అతడు ఇంటర్‌లో ఉండగా తండ్రి పోవడంతో, ఐఏఎస్‌ లక్ష్యంతో ఉన్న మెరిట్‌ స్టూడెంట్‌ కాస్తా ఒక్కసారిగా నిరాశకు లోనయ్యారు. ఆ వయసులో అతడిని గాడిలో పెట్టేవాళ్లు లేకపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. మరెవరి జీవితమూ అలా కాకూడదు. ఒక జీవితం అలా మోడువారిపోతే, అతడిని అల్లుకున్న జీవితాలు కూడా ఆధారం లేక నేలరాలిపోతాయి. అందుకే సమాజాన్ని చైతన్యవంతం చేయడానికే జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాను. అమ్మాయి బ్యాంకు ఉద్యోగంలో స్థిరపడింది, పెళ్లి చేశాను. తల్లిగా బాధ్యత పూర్తయింది. ఇక నాకు మిగిలింది సామాజిక బాధ్యతే’ అంటున్నారీ స్పోర్ట్స్‌ మోటివేటర్‌. రాపెల్‌డౌన్‌ సాహసం చేసేటప్పుడు పాటించాల్సిన సూత్రం ఒకటే. కాళ్ల కింద నేల ఎంత జారుడుగా ఉన్నా, దేహం రాళ్లకు కొట్టుకుంటున్నా సరే, చేతులు మాత్రం తాడును వదలకూడదు. అలాగే జీవితం కూడా. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ధైర్యాన్ని వదలకుండా లైఫ్‌ స్పోర్ట్‌లో గెలవాలి.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement