నగలు... నగదు కోసమే హత్య
నగలు... నగదు కోసమే హత్య
Published Mon, Oct 17 2016 10:37 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
అమలాపురం టౌన్ :
నగలు... నగదు కోసమే అమలాపురంలో మహిళా గల్ఫ్ ఏజెంట్ గెడ్డం సుబ్బాయమ్మ అనే నజ్మా (55)ను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్య కేసులో నిందితులైన ఐ.పోలవరం మండలం పశువుల్లంక గ్రామానికి చెందిన చెక్కా వెంకటరమణకుమార్ (26), చింతా వీరబాబు (23)ను పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వారి నుంచి రూ.11.26 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులను స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ లంక అంకయ్య, సీఐ శ్రీనివాస్ సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు. అమలాపురం మద్దాలవారిపేటకు చెందిన నజ్మాను ఆమె సొంతింట్లోనే సెప్టెంబర్ ఒకటో తేదీన హత్య చేయటం... 13 రోజుల తర్వాత విషయం వెలుగు చూడటం వంటి పరిణామాలు తెలిసిందే.
మసాజ్ చేస్తూ హత్యకు పథకం
ఏజెంటుగా నజ్మా కోనసీమ నుంచి ఎందరినో గల్ఫ్ దేశాలకు పంపించింది. ఆమె కూడా ఆ దేశాల్లో కొన్నేళ్లు ఉంది. ఖతర్ లో ఆమెకు కార్యాలయం... ఉద్యోగులు ఉన్నారు. నజ్మా రోజూ రాత్రి మసాజ్ చేయించుకుని నిద్ర పోతుంది. ఈ కేసు లో మొదటి నిందితుడు అయిన చెక్కా వెంకటరమణ(రమణ) గతంలో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి వచ్చి ఇసుక రీచ్‌ల్లో కూలీ గా పనిచేస్తున్నాడు. ఏజెంట్‌గా గతం నుంచి నజ్మాతో పరిచయం ఉన్న రమణ ఆమెకు దగ్గరయ్యాడు. మరోసారి తనను గల్ఫ్ పంపించాలని నజ్మాను పదే పదే కోరాడు. దీంతో నజ్మా అతడిని తన ఇంటి వద్దే ఉంచుకుని ఇంటి పనులు, ఆమె బయటకు వెళితే మోటారు సైకిల్‌పై తనే తీసుకెళ్లేవాడు. మూడు నెలలుగా ఆమెకు రమణ రోజూ రాత్రి సమయాల్లో మసాజ్ చేస్తున్నాడు. దీంతో అతడికి ఆమె ఒంటిపై ఎప్పుడూ ఉండే బంగా రం.. ఇంట్లో బీరువాలో ఉండే నగలు, నగదుపై దృష్టి పడింది. తన గ్రామానికి చెందిన వీరబాబుతో గతంలోనే నజ్మా హత్యకు ప్లాన్ చేశారు. తర్వాత వారిద్దరూ సెప్టెంబర్ ఒకటో తేదీ రాత్రి హత్య చేయడానికి పథకం పన్నారు. ఆ రోజు రాత్రి నజ్మాకు మసాజ్ చేసిన తర్వాత నిద్రపోయంది. అదే అదనుగా భావించి వారిద్దరూ ఆమె ముఖంపై దిండు నొక్కిపెట్టి ఊపిరాడకుండా హత్య చేశారు. ఆమె ఒంటిపై, బీరువాలోని నగలు, నగదు, ఆమె వ్యక్తిగత ల్యాప్‌టాప్‌తో పరారయ్యారు. వెళ్లే ముందు నజ్మా మృతదేహం ఉన్న గది ఏసీ ఆన్ చేసి ఇంటి బయట తాళం వేశారు. వారు గుంటూరు జిల్లా వెళ్లి బంగారు నగలు కరిగించారు. బంగారం, నగదును సమానంగా పంచుకున్నారు.
ల్యాప్‌టాప్‌ను కాల్వలోకి విసిరి
నజ్మాకు తన వ్యక్తిగత విషయాలన్నీ ఎప్పటికప్పుడు ల్యాప్‌టాప్‌లో దాచిపెట్టడం అలవాటు. ఆమె వ్యక్తిగత అలవాట్లన్నీ తెలిసిన రమణ ఆధారాలు దొరక్కుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆమె ల్యాప్‌టాప్‌ను ఆ రోజు రాత్రే బద్దలకొట్టి దానిని అమలాపురం ఎర్ర వంతెనపై నుంచి పంట కాలువలోకి విసిరినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఆ ల్యాప్‌టాప్ కోసం కాల్వలో పోలీసులు గాలించినా అది దొరకలేదు. ల్యాప్‌టాప్ లభ్యమై ఉంటే హత్య కేసులోనే కాకుండా ఆమెతో పరిచయాలు ఉండి ఆర్థిక లావాదేవీలు ఉన్న చాలా మంది విషయాలు బయటపడేవని పోలీసులు అంటున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తుండగా వారి గ్రామం పశువుల్లంక పెద్ద చింతా సత్యనారాయణ నిందితులిద్దరినీ ఈ నెల 16న పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి 20 కాసుల బంగారం, రూ.6.40 లక్షలు నగదు, కొన్ని రోల్డ్ గోల్డ్ నగలు, ఏటీఎం కార్డులు, సెలఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యహరించి సొత్తు రికవరీకి చొరవ చూపిన క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్స్ అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు, కానిస్టేబుళ్లు శెట్టి రమేష్, గుబ్బల శంకర్, హోంగార్డు అనిల్‌ను డీఎస్పీ అభినందించారు. వీరికి ఎస్పీ నుంచి రివార్డులు ఇప్పించేందుకు సిపార్సు చేస్తున్నట్లు డీఎస్పీ అంకయ్య చెప్పారు.
Advertisement
Advertisement