అన్ని రంగాల్లో రాణించాలి
‘సాక్షి’ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం
సిటీబ్యూరో: సమాజంలో మారుతున్న పరిస్థితులకనుగుణంగా మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్లాలని ‘సాక్షి’ విమెన్స్ డే వేడుకల్లో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సోమవారం ‘సాక్షి’ జర్నలిజం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాక్షి మీడియా గ్రూప్ చైర్‌పర్సన్ వైఎస్ భారతిరెడ్డితో పాటు ప్రముఖ వైద్యులు పి.రఘురాం,ప్రత్యూష, కవితలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ డాక్టర్ రఘురాం మాట్లాడుతూ కేన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చని. మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌పై అపోహలు, భయాలు, అవగాహన లేకపోవడంతో తీవ్రత పెరుగుతోందన్నారు. దేశంలో ఏటా 70వేల కేసులు నమోదు అవుతున్నాయన్నారు. మారిన జీవనవిధానం, తల్లిపాలు ఇవ్వకపోవడం, స్థూలకాయం రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. విదేశాల్లోలాగా ఇక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ సరిగా జరగడంలేదని, ఏటా దేశ వ్యాప్తంగా స్క్రీనింగ్ నిర్వహించల్సిన అవసరం ఉందన్నారు. రొమ్ములో వచ్చే అన్ని గడ్డలు కేన్సర్ గడ్డలు కావని, మహిళలు గడ్డలు రాగానే భయాలతో కేన్సర్ అని భావించి ఆందోళనలతో ఎవరికీ చెప్పకుండా తమలో తామే కుమిలిపోతుంటారన్నారు. అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్ సంప్రదించాలని కోరారు.
30 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళా రొమ్ముక్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సర్వైకల్ క్యాన్సర్, పలు వ్యాధులపై డాక్టర్ కవిత వివరించగా, దంత సంరక్షణపై డాక్టర్ ప్రత్యూష సలహాలు,సూచనలు అందజేశారు. అనంతరం సాక్షి మహిళా ఉద్యోగులకు వివిధ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సాక్షి కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డెరైక్టర్ రాణిరెడ్డి, ఐటీ విభాగం ప్రెసిడెంట్ దివ్యారెడ్డి, సీఎఫ్‌ఓ సాచిమహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.