చట్టం ఉంది... కమిటీలేవి? | Kerala film units should set up complaints panels | Sakshi
Sakshi News home page

చట్టం ఉంది... కమిటీలేవి?

Published Tue, Mar 22 2022 1:54 AM | Last Updated on Tue, Mar 22 2022 2:17 AM

Kerala film units should set up complaints panels - Sakshi

కేరళ హైకోర్టు ఈ నెల 17వ తేదీన ఓ కేసులో తీర్పునిస్తూ సినిమా రంగానికి ఒక ఆదేశం జారీ చేసింది. ఆ ఆదేశం ప్రకారం ప్రతి మూవీ ప్రొడక్షన్‌ హౌస్‌లోనూ తప్పనిసరిగా ఇంటర్నల్‌ కంప్లయింట్స్‌ కమిటీ ఉండి తీరాలి. అక్కడి సినిమారంగంలో ఉన్న మహిళల సమాఖ్య ‘ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌’ చేసిన న్యాయపోరాటంలో భాగంగా ఈ ఆదేశాన్ని జారీ చేసింది హైకోర్టు.

మహిళా చైతన్యం మెండుగా ఉన్న కేరళ రాష్ట్రంలో మహిళలు న్యాయపోరాటంతో సాధించుకున్న  విజయం అనే చెప్పాలి. సాధికారత సాధనలో పరుగులు తీస్తున్న మహిళలు ఇంకా జెండర్‌ వివక్ష నుంచి తప్పించుకోవడానికి పెనుగులాడాల్సిన పరిస్థితి.  లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది. కానీ చట్టం అమలుకు ఇంకా ఎన్నాళ్లు? ఓ మూడున్నర దశాబ్దాల వెనక్కి, ఈ చట్టం లేని రోజుల్లోకి వెళ్తే... ఒక ఐఏఎస్‌ ఆఫీసర్, ఒక ఐపీఎస్‌ ఆఫీసర్‌ల కేసు గుర్తుకు వచ్చి తీరుతుంది.
∙∙
రూపన్‌ డియోల్‌ బజాజ్, ఐఏఎస్‌ ఆఫీసర్‌. ఒక మహిళ ఎంత పెద్ద ఆఫీసర్‌ అయినప్పటికీ పితృస్వామ్య సమాజంలో కేవలం మహిళ మాత్రమేనా! అని సమాజం నివ్వెర పోయిన సంఘటన ఆమె జీవితంలో ఎదురైంది. ఐపీఎస్‌ ఆఫీసర్‌ కేపీఎస్‌ గిల్‌ నుంచి లైంగికవేధింపును ఎదుర్కోవాల్సి వచ్చిందామె. లైంగిక వేధింపుకు గురయ్యానంటూ న్యాయం చేయమంటూ మనదేశంలో చట్టాన్ని ఆశ్రయించిన తొలి మహిళాధికారి ఆమె.

అత్యున్నత స్థాయి అధికారి కావడం వల్లనే ఆమె కనీసం చట్టాన్ని ఆశ్రయించడం అనే సాహసమైనా చేయగలిగారు. అంతకు ముందు ఎంతో మంది చిన్న ఉద్యోగినులు సాటి పురుష ఉద్యోగుల నుంచి వేధింపులు ఎదుర్కొంటూ కూడా నోరు మెదపడానికి ధైర్యం లేని స్థితిలో నలిగిపోయారు. నోరు విప్పిన వాళ్లకు కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారుతూనే వచ్చింది.

ఈ నేపథ్యంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి 2013లో ‘సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌ యట్‌ వర్క్‌ ప్లేస్‌ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్‌ అండ్‌ రిడ్రెసల్‌) యాక్ట్, 2013’ వచ్చింది. ఈ చట్టం ప్రకారం పదిమంది ఉద్యోగులు పని చేస్తున్న పని ప్రదేశంలో వారిలో కనీసం ఒక్క మహిళ ఉన్నా సరే... ఈ చట్టం ప్రకారం ఒక కమిటీ ఉండాలి. సంఘటిత రంగాల్లోనే కాక అసంఘటిత రంగాల్లో కూడా ఇలాంటి కమిటీల ఏర్పాటుకు చట్టాలు ఉన్నాయని, సినిమా రంగం గ్లామర్‌ ఫీల్డ్‌ కాబట్టి ఇందులో తప్పనిసరి... చెబుతున్నారు ప్రముఖ న్యాయవాది పార్వతి.
∙∙∙
ఇదే విషయం మీద ప్రముఖ నటి, గతంలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తించిన జీవిత రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘మీటూ ఉద్యమ సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక కమిటీ వేసింది. పోలీసు ఉన్నతాధికారులు, యాక్టివిస్టులు, సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమందితో రూపొందిన కమిటీ అది. ఈ కమిటీ విస్తృతి చాలా పెద్దది. లైంగిక వేధింపుల నివారణ మాత్రమే కాదు. ఆడవాళ్లు పని చేసే చోట వాళ్లకు అనువైన వాతావరణం ఉండేటట్లు చూడడం కూడా కమిటీ బాధ్యతే. పెద్ద ఆర్టిస్టులకు సొంత కారవాన్‌ వంటి ఏర్పాట్లు ఉంటాయి. జూనియర్‌ ఆర్టిస్టులకు అలాంటివేవీ ఉండవు.

వాళ్లు షూటింగ్‌ సెట్‌లో దుస్తులు మార్చుకోవడానికి గదులు, టాయిలెట్‌ వసతుల వంటివి ఉండేటట్లు చూడాలి. ఆడిషన్‌ జరిగేటప్పుడు కెమెరా ఉండి తీరాలి. ఈ చట్టం చెప్పిన నియమాలను ఒక చార్ట్‌ మీద రాసి ప్రొడక్షన్‌ హౌస్‌లో తగిలించాలి. మొత్తానికి ఉమెన్‌ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌ కల్పించడం ఈ చట్టం ఉద్దేశం. అయితే మీటూ సమయంలో పెద్ద కదలిక వచ్చింది. కానీ ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌లు జరగకపోవడం వంటి అనేక కారణాలతో ఈ నియమావళి ప్రాధాన్యం కొంత తగ్గిందనే చెప్పాలి. అయితే ‘మా’ నుంచి నేను ఒక మహిళగా నా దృష్టికి వచ్చిన అనేక కేసులను పరిష్కరించాను. అలాగే ఫిలిమ్‌ చాంబర్, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ కూడా తమ దృష్టికి వచ్చిన వాటిని పరిష్కరిస్తుంటాయి’’ అన్నారు.


 సమాజం అభివృద్ధి చెందుతోంది. ఆలోచన స్థాయులు ఆకాశాన్ని అంటుతున్నాయి. మహిళ విషయంలో... మహిళ అయిన కారణంగా ఆమె ఎదుర్కొంటున్న వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి చట్టాలు రూపొందుతున్నాయి. అయితే మనిషి ఆలోచనలను మార్చడంలో వీటి పాత్ర పరిమితంగానే ఉంటోంది. నిజంగా మారాల్సింది మనిషి ఆలోచన. చట్టం వచ్చి దశాబ్దకాలమవుతోంది. ఇంకా కమిటీల నిర్మాణమే పూర్తిస్థాయిలో జరగలేదు. ‘అణచివేత’ అనే దురాలోచనను రూపుమాపగలిగిన సమాజం రావాలి. అది వివేచనతోనే సాధ్యం.

కమిటీ ఉంటే కెమెరా ఉన్నట్లే!
సర్వేలియన్స్‌ కెమెరా నిఘాలో ఉన్నామని తెలిస్తే మనిషి ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడో... పని ప్రదేశంలో ఇంటర్నల్‌ కంప్లయింట్‌ కమిటీ ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తాడు. ప్రొడక్షన్‌ హౌస్‌లో ఈ కమిటీ ఉంటే... అది మహిళలకు భరోసానిస్తుంది. కమిటీ ఉందనే ధైర్యం మహిళలకు ఉంటుంది, కమిటీ ఉందనే భయం మగవాళ్లలో ఉంటుంది.  
– జీవిత రాజశేఖర్, సీనియర్‌ నటి

ఇంకా విస్తరించాలి!
పని ప్రదేశంలో మహిళల భద్రత కోసం రూపొందిన ఈ చట్టం ఇంకా విస్తరించాల్సి ఉంది. ఆఫీసుల్లో కొంతవరకు ఉన్నాయి. సినిమా రంగం కూడా దీని అవసరాన్ని గుర్తించింది. అలాగే ఇళ్లలో పని చేసే డొమెస్టిక్‌ వర్కర్‌లు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. వాళ్లు ‘లోకల్‌ కంప్లయింట్స్‌ కమిటీ’లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులుండాలి. ఇవి ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. అలాగే చట్టసభల మహిళాసభ్యులు ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు. వాళ్లు ఐపీసీననుసరించి పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ చేయాల్సిందే. ఈ చట్టాన్ని వాళ్లకు కూడా వర్తింప చేస్తూ అసెంబ్లీలో ఇంటర్నల్‌ కంప్లయింట్‌ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.  
– ఇ. పార్వతి, సీనియర్‌ న్యాయవాది

– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement