మనసు పెట్టి రాస్తే జీవకళ! మెదడు పెట్టి రాస్తే సమగ్రత!!
అంతర్వీక్షణం
వి. హనుమంతరావు, సీనియర్ జర్నలిస్ట్... అంటే ఆయన సంతోషిస్తారు. ప్రొఫెసర్ హనుమంతరావు, ఆర్థికవేత్త హనుమంతరావు అనే మకుటాలు నాకొద్దంటూ నిక్కచ్చిగా చెప్పేస్తారు. గడచిన ఆగస్టు 30వ తేదీతో 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టారాయన. ఆయన జర్నలిస్టు జీవితానికి అరవై దాటాయి. ఈ సందర్భంగా ఇది ఆయన అంతర్వీక్షణం.
పాత్రికేయ వృత్తి గురించి ఒక్కమాటలో..!
అత్యంత బాధ్యతాయుతమైనది, పవిత్రమైనది.
మీ రోజుల్లో శిక్షణ ఉండేదా?
అప్పట్లో జర్నలిజం కోర్సుల్లేవు. ఎస్‌ఎస్‌ఎల్‌సి సర్టిఫికేట్, టైపింగ్, షార్ట్‌హ్యాండ్ అర్హతలతో ఈ వృత్తిలోకి వచ్చాను. ఓనమాల నుంచి పనిచేస్తూనే నేర్చుకున్నాను. తప్పులు చేస్తూ... సీనియర్లు దిద్దిన కాపీ చూసి నేర్చుకున్న తరం మాది.
మీ తొలి ఉద్యోగం... పోస్టల్ టెలిగ్రాఫ్ డిపార్ట్‌మెంట్‌లో స్టెనోగ్రాఫర్.
మరి పత్రికారంగంలోకి ఎలా వచ్చారు?
ప్రజాశక్తిలో పుచ్చలపల్లి సుందరయ్యకు సహాయకుడిగా టైప్, షార్ట్ హ్యాండ్ వచ్చిన వ్యక్తి కావాలని స్నేహితులు చెప్పడంతో చేరాను. ఆ తర్వాత పార్లమెంటు కార్యకలాపాలను నోట్స్ రాసుకుని కథనాలు తయారు చేయడానికి షార్ట్ హ్యాండ్ వచ్చు అనే అర్హతతోనే నన్ను ఢిల్లీకి పంపారు.
అప్పట్లో పత్రికల మధ్య అక్షరయుద్ధం సాగేదా?
1955 మధ్యంతర ఎన్నికల సమయంలో ఆంధ్రప్రభ (నార్ల వెంకటేశ్వరరావు) - విశాలాంధ్ర (రాంభట్ల కృష్ణమూర్తి) పత్రికల మధ్య కార్టూన్ల యుద్ధం తీవ్రంగా సాగింది.
పాత్రికేయునిగా మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా వచ్చిందా?
యుఎన్‌ఐలో పనిచేస్తున్నప్పుడు మాకు పిటిఐతో పోటీ. జాతీయపత్రికల్లో హైదరాబాద్ కనిపించాలంటే దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించే వార్తాకథనాలు రాయాలి. రాజేంద్రనగర్, తార్నాకల్లోని అఖిలభారత సైన్సు, సాంకేతిక సంస్థల్లో నాకు మంచి విషయాలు దొరికేవి.
మీరు కాలరెగరేసుకుని చెప్పగలిగిన రిపోర్టింగ్?
బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో విమాన వాహక నౌక ‘ఐ.ఎన్.ఎస్. విక్రాంత్’ నుంచి యుద్ధవార్తలు పంపడం. అప్పటికి ఆంధ్రప్రదేశ్ నుంచి నేనొక్కడినే.
మీరు ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాశారు?
ఇరవై వరకు ఉంటాయి. ‘ఎపి యట్ 50’ ఆంధ్రప్రదేశ్ మీద సమగ్ర సమీక్ష సమాచారంతో ఇంగ్లిష్‌లో ప్రచురించిన తొలి పుస్తకానికి సంపాదకత్వం వహించాను. నేను స్థాపించిన డిఎన్‌ఎఫ్ (డేటా న్యూస్ ఫీచర్స్) అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలి న్యూస్ ఏజెన్సీ.
విలేఖరిగా మీరు ఊహించని హఠాత్పరిణామం ఏదైనా ఉందా?
విశాఖపట్నంలో జరిగింది. పాకిస్తాన్ సబ్‌మెరైన్ విశాఖ తీరంలో మునిగిపోయింది. పాక్ జలాంతర్గామిని పేల్చివేసిన శబ్దాన్ని విశాఖ నగరం మొత్తం విన్నది. వైస్ అడ్మిరల్ ఆ విషయాన్ని పత్రికాసమావేశంలో వెల్లడించి మేమున్న గది తలుపులు వేయించాడు.
ఎందుకలా!... పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ వార్తను ప్రభుత్వం ప్రకటించకముందు పత్రికల్లో రాకూడదని.
వ్యక్తికి - విలేఖరికి తేడా!... వ్యక్తి తప్పు చేస్తే దాని దుష్ర్పభావాన్ని వారు మాత్రమే భరిస్తారు. జర్నలిస్టు తప్పు రాస్తే ఒక వాస్తవం మరుగున పడి, అవాస్తవం సమాజం మీద ప్రభావం చూపిస్తుంది.
జర్నలిజానికి కేంద్రబిందువు రాజకీయాలేనా?
కాదు, ప్రజలు. ప్రజలే కేంద్రబిందువుగా సాగే వార్తలకు, వార్తా కథనాలకు కట్టుబడి ఉండడమే విలేఖరి తనకు తాను గీసుకోవాల్సిన లక్ష్మణరేఖ.
జర్నలిస్టుకు మీరిచ్చే సందేశం?
ఈ వృత్తిలో కొనసాగుతున్నది జీతం కోసమే, అయినా ‘మనసు పెట్టి పని చేస్తే రాష్ట్రానికీ, దేశానికీ, ప్రజలకు సేవ చేయవచ్చు’ అనే తలంపు ఉండాలి. అప్పుడే వార్తకు జీవకళ వస్తుంది. మెదడుకు పని చెప్పి మేధస్సు జోడిస్తే వార్తకు సమగ్రత వస్తుంది.
- వాకా మంజులారెడ్డి