ఒక్క ఫోన్ కాల్... జీవితాన్ని నిలబెడుతుంది!
మనదేశం 2012లో 1,35, 445 ఆత్మహత్యలను చూసింది. డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక ప్రకారం గడచిన 45 ఏళ్లలో ప్రపంచంలో ఆత్మహత్యలు 60 శాతం పెరిగాయి. అవి కూడా 15-44ఏళ్ల మధ్య వయస్కుల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రపంచంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 20 శాతం భారతీయులే. ఆత్మహత్యల్లో మనదేశం మొదటిస్థానంలో ఉందని గణాంకాలు చెబుతుంటే భావిభారతాన్ని ఎలా ఊహించుకోవాలి? ఇది ఇలా ఉంటే...
ఒకరోజు రాత్రి ఎనిమిది గంటల సమయం. సికింద్రాబాద్‌లోని సింధ్ కాలనీ, రోష్నీ హెల్ప్‌లైన్ ఆఫీసుకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి... తనకు జీవితం మీద విరక్తి కలుగుతోందంటూ తన బాధలను చెప్పుకుంటున్నాడు. ప్రేమలో విఫలం కావడం, ఆఫీసులో పని మీద మనసు పెట్టలేకపోవడం, తరచూ తప్పులు చేయడం, గతంలో చేసిన పనే అయినా ఇప్పుడు చేయలేనంత ఒత్తిడిగా అనిపించడం వంటి సమస్యలను ఏకరువు పెట్టాడు. ‘నా సమస్య అందరికీ నవ్వులాటగా ఉంటోంది. కనీసం విని ఓదార్చేవారు లేరు. నేను మా కొలీగ్‌నే ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు, సరికదా మరో కొలీగ్‌తో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. ఆఫీసులో పనిచేతగాని వాడిలాగ ముద్ర పడింది. నేను ఎవరికీ అక్కరలేదు, అలాంటప్పుడు బతికి సాధించేదేమీ ఉండదు. చనిపోవాలని ఉంది’ అని భోరుమన్నాడు.
ఈ సమస్య ఈ కుర్రాడిదే కాదు. ఇటీవల ఇలాంటివి ఎక్కువయ్యాయి. ‘సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకున్న యువతి’ వంటి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. పని ఒత్తిడి ఎక్కువైతే, ఆఫీసులో డెడ్‌లైన్ అందుకోలేకపోతే దానికి ఆత్మహత్య పరిష్కారమా? ఆత్మహత్యతో ప్రేమ సఫలమవుతుందా? జీవితం అంటే... నల్లేరు మీద బండి నడకలా హాయిగా సాగిపోయే అందమైన సినిమా అని రంగుల కల కనడమే ఇందుకు కారణమా? ఒక చిన్న కష్టం ఎదురవగానే కుంగిపోతే ఇక సాధించేదేంటి?
ప్రయాణంలో మలుపు!
‘రోడ్డు మీద వెళ్తుంటే మలుపు వస్తుంది, దూరం నుంచి చూస్తే రోడ్డు అక్కడితో ఆగిపోయినట్లు, ముందుకు వెళ్లడానికి దారి లేనట్లు అనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే అది ముగింపు కాదు మలుపు మాత్రమే అని తెలుస్తుంది. అక్కడ మలుపు తీసుకుంటే ప్రయాణం సాఫీగా ముందుకు సాగిపోతుంది. ఒకవేళ అది మలుపు కాక ముగింపు అయితే ‘యు టర్న్’ తీసుకుని మరోదారి కోసం అన్వేషిస్తాం తప్ప గమ్యాన్ని చేరకుండా ప్రయాణాన్ని అర్ధంతరంగా ఆపివేయరు ఎవరూ. జీవితమూ అంతే. ఒక కష్టం వచ్చిందని జీవితాన్ని అంతం చేసుకోరాదు. అలా అంతం చేసుకుంటూ పోతే ఇప్పటికి ప్రపంచంలో ఎవ్వరూ మిగిలి ఉండరు. ప్రతి మనిషికీ జీవితంలో ఏదో ఒక సమయంలో ‘ఈ జీవితం వద్దు, చనిపోతే బావుణ్ణు’ అనిపిస్తుందంటారు మనస్తత్వ విశ్లేషకులు. అలా అనిపించిన ప్రతి ఒక్కరూ అనిపించిన వెంటనే ప్రాణాలు తీసుకుంటూ పోతే భూమ్మీద మనుషులే ఉండరు.
అది ఓ ఆర్తనాదం!
‘ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారంటే అర్థం మరణించడానికి సిద్ధపడినట్లు కాదు, అది సహాయం కోసం చేసే ఆర్తనాదం’ అంటారు రోష్నీ హెల్ప్‌లైన్ నిర్వాహకురాలు సుచరిత.
యుక్త వయసు వచ్చిన తర్వాత కలిగే ఆకర్షణలతో ప్రేమ కలగడం సహజమే. అయితే మనకు కలిగిన భావమే ఎదుటి వారికీ కలగాలని లేదు. ఈ చిన్న తర్కాన్ని మరిచిపోవడం చాలా ఆత్మహత్యలకు కారణమవుతోంది. అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. ఒక ఉద్యోగంలో రాణించలేకపోతే తాను రాణించగలిగిన మరో ఉద్యోగం ఏదో ఉండే ఉంటుంది. దానిని వెతుక్కోవాలి తప్ప, జీవితాన్ని వదులుకోకూడదు. జీవితాన్ని అంతం చేసుకోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. తాను ప్రేమించిన వ్యక్తి వారికి ఇష్టమైన మరో వ్యక్తితో జీవితాన్ని హాయిగా కొనసాగిస్తారు. అలాగే ఉద్యోగం ఇచ్చిన యాజమాన్యం ఆ స్థానంలో మరొకరిని నియమించుకుంటుంది. సదరు ఆత్మహత్య చేసుకున్న వారు చనిపోతే ఆ స్థానం మరొకరితో చాలా సులభంగా భర్తీ అవుతుంది. మరి కన్న తల్లిదండ్రులకు? వారికి ఆ స్థానం ఎప్పటికీ భర్తీ కాదు. అలాగే పెళ్లయిన వారు ఆత్మహత్యకు పాల్పడితే జీవితభాగస్వామికి జరిగే లోటును పూడ్చేదెవరు? ఆ పిల్లలకు అమ్మానాన్నల ప్రేమ అందేదెలా?
ఆత్మహత్య చేసుకోవడం ద్వారా జరిగే నష్టాలను, కోల్పోయే అనుబంధాలను గుర్తు చేసుకుంటే ప్రస్తుతం ఎదురైన కష్టం చాలా చిన్నదని క్షణంలో తెలిసిపోతుంది. ఆత్మహత్య నిర్ణయాన్ని ఒక్కసారి వాయిదా వేసి వెనక్కు చూసుకుంటే... ఇక్కడి వరకు సాగిన జీవన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మీద భరోసా కలుగుతుంది. జీవించి తీరాలనే తపన పెరుగుతుంది.
- వాకా మంజులారెడ్డి