చక్కని చేనేతకు సురయ్యా చేయూత | suraiya hasan bose family in Indigenous movement | Sakshi
Sakshi News home page

చక్కని చేనేతకు సురయ్యా చేయూత

Published Wed, Apr 30 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

చక్కని చేనేతకు  సురయ్యా చేయూత

చక్కని చేనేతకు సురయ్యా చేయూత

ఆమె పేరు సురయ్యా హసన్ బోస్...వారిది స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబం.ఇంట్లో అందరూ ఖాదీప్రియులే... గాంధేయవాదులే హస్తకళలకు వేదిక వేసిన నేత ఆమె తండ్రి. అదే స్ఫూర్తి... అదే చైతన్యంతో ముందుకు నడిచారామె. ఢిల్లీ, లండన్‌లలో హస్తకళలు, చేనేతలలో అధ్యయనం చేశారు. సంప్రదాయరీతుల మనుగడకే జీవితాన్ని అంకితం చేశారు. ఆ సేవ కొనియాడదగినది అని గుర్తించిన యుధ్‌వీర్ ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక ‘యుధ్‌వీర్ అవార్డు’ను ప్రకటించింది. సురయ్యా ఈ రోజు ఆ అవార్డును అందుకుంటున్న సందర్భంగా...
 ముప్పై ఏళ్లుగా ఆమె చేస్తున్న కృషి... వివరాల సుమాహారం!!

 
 స్వదేశీ ఉద్యమం నాడు పట్టిన చరఖా...
 స్వదేశీ ఉద్యమంలో మా కుటుంబం మొత్తం పాల్గొన్నది. నాకు ఊహ తెలిసే నాటికి మా ఇంట్లో అందరూ చరఖాతో నూలు వడుకుతుండేవారు. ఖాదీనే ధరించేవారు. అందరూ స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నారు. మా చిన్నాన్న అబిద్ హుస్సేన్ సఫ్రానీ సుభాష్ చంద్రబోస్‌తో పనిచేశారు. వారి స్ఫూర్తితో నేను ఇప్పటికీ చరఖాను వదల్లేదు.
 - సురయ్యా హసన్ బోస్, చేనేత పరిశ్రమ నిర్వాహకురాలు
 
 హైదరాబాద్‌లో ఉస్మానియా కాలనీ రోడ్, దర్గా హుస్సేన్ షా వలి... సురయ్యా హసన్ బోస్ ఇల్లు. విశాలమైన ప్రాంగణంలో ఓ వైపు సఫ్రానీ- అరబిందోబోస్ ఇంగ్లిష్ మీడియం స్కూలు, అనేకరకాల చెట్లు, పూల మొక్కలు, పంజరంలో రామచిలుక, తెల్లపావురాలు, స్వేచ్ఛగా తిరుగుతున్న నాటుకోళ్లు. వాటిని దాటి ముందుకెళ్తే సురయ్యా నడుపుతున్న చేనేత కేంద్రం, మరో వైపు తన చిన్నాన్న పిల్లలతో కలిసి నివసిస్తున్న ఇల్లు, ఒక పక్కగా ఆఫీసు. వేటికవి విడిగా చిన్న చిన్న కట్టడాలు. ఇది సురయ్యా ప్రపంచం. ఎనభై ఆరేళ్ల వయసులో కూడా ఉదయం ఐదు గంటలకు నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పదింటి వరకు ఆమె ఈ ప్రాంగణం అంతా తిరుగుతూనే ఉంటారు. ఆమెను కదిలిస్తే ఎన్నెన్నో జ్ఞాపకాలు...

 ‘‘మా నాన్న సయ్యద్ బద్రుల్ హుస్సేన్ గొప్ప దార్శనికుడు. నేను నాలుగైదేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆయన పోయారు. స్వదేశీ ఉద్యమంలో ఆయన కీలకభాగస్వామి. ఆ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో విదేశీ వస్తువులను, వస్త్రాలను తగలబెట్టింది ఆబిడ్‌‌సలోని మా ఇంటి ముందే. హైదరాబాద్‌లో తొలి పుస్తకాల దుకాణం ‘హైదరాబాద్ బుక్ డిపో’ ఆయన స్థాపించినదే. ఖాదీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని కరీంనగర్‌లో చేనేతకారులతో ఖాదీ కుటీర పరిశ్రమలు, హైదరాబాద్‌లో హస్తకళల పరిశ్రమను స్థాపించారు. నేను నాన్నను చూసింది ఈ సేవలోనే. అందుకే నాకు ఇవంటే అంత మమకారం. కోఠీ ఉమెన్స్ కాలేజ్‌లో ఇంటర్ కాగానే నాన్న స్థాపించిన హాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీలో ఉద్యోగంలో చేరాను. అప్పటికే అది ప్రభుత్వ అధీనంలో నడుస్తోంది.

 పాడి- పంట- ఓ మగ్గం!:
 పదెకరాల వ్యవసాయ క్షేత్రంలో ఆవులు, గేదెలతోపాటు కోళ్ల పరిశ్రమ చూసుకున్నాను. 30 ఏళ్ల కిందట ఒక్క మగ్గంతో చేనేత కేంద్రాన్ని స్థాపించాను. చేనేతను కాపాడాలంటే... వారసత్వంగా ఆ పని చేసే కుటుంబాలకే పరిమితం కాకుండా నేర్చుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరికీ విస్తరించాలి. భర్తను కోల్పోయి, బతుకుతెరువు లేక ఇబ్బంది పడుతున్న వారిని సమీకరించి నేత పని నేర్పించాను. నేను నేర్చుకున్న పర్షియా నేత కళ హిమ్రూ, కచ్ చేనేత మష్రూ, కాశ్మీర్ చేనేతశైలి జమావరీలలో శిక్షణ ఇచ్చాను’’ అన్నారు సురయ్యా.

 హైదరాబాద్‌కు హిమ్రూ!
 హిమ్రూ అంటే పర్షియన్ బ్రొకేడ్ (పూలు, లతల డిజైన్‌ను జరీతో నేయడం). హిమ్రూ నేతకారులు నిజాం నవాబుల కాలంలో ఔరంగాబాద్ పరిసరాల్లో జీవించేవారు. ఈ కళను హైదరాబాద్‌కు తెచ్చారు సురయ్యా. ‘‘మన చేనేత విధానంలో హిమ్రూని మిళితం చేసి డిజైన్‌లు రూపొందించాను. ఇలాంటి ప్రక్రియ దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా లేదు. నేను హిమ్రూ, పైథానీ, జమావరి, ఇకత్ వంటి నేత ప్రక్రియలను నేర్చుకోవడంతో ఈ ప్రయోగాలు సాధ్యమయ్యాయి. ఇప్పుడు పది మగ్గాలతో ఇరవైమంది నేతకారులతో నడుస్తోంది ఈ కేంద్రం. దీనికి సమాంతరంగా గద్వాల్, నారాయణ్‌పేట, ఉప్పాడ, పోచంపల్లి వంటి ప్రతి చోటా ఇద్దరు ముగ్గురు నిపుణులైన చేనేతకారులు ఈ కేంద్రానికి పనిచేస్తున్నారు. వారికి కొత్త డిజైన్లు ఇచ్చి, ఆ డిజైన్‌లో అవసరమైన చేనేత విధానాలను ఎలా మిళితం చేయాలో నేర్పిస్తాను’’ అని వివరించారామె. వరంగల్ నేతకారుల తివాచీలకు కలంకారీ అద్దకం చేయించడం వంటి ప్రయోగాలు చేశారామె. ఏటికొప్పాక కొయ్య బొమ్మలు చేసేవారు, ఒరిస్సా నుంచి బ్రాస్ బొమ్మల తయారీదారులు కూడా ఈ కేంద్రానికి పనిచేస్తున్నారు.    

 చదువు- సంస్కారం!
 చేనేత కేంద్రానికి అనుబంధంగా పాఠశాల స్థాపన గురించి ‘‘చిన్నాన్నకు, మా వారు అరబిందో బోస్‌కు పిల్లల చదువంటే చాలా ఇష్టం. చదువుతోనే చైతన్యం వస్తుందని, ఇంగ్లిష్ భాష వస్తే పరిధి విస్తరిస్తుందనేవారు. వారిపేరుతో ఇంగ్లిష్ మీడియం స్కూలు స్థాపించాను. దీనిని మా పెద్ద చిన్నాన్న ఖుర్షీద్ హసన్ కూతురు మేరీ చింతారా నడుపుతోంది. నా చేనేత కేంద్రంలో పనిచేసే కుటుంబాల పిల్లలు ఇందులోనే చదువుకుంటారు. ఆ తల్లిదండ్రులకు పిల్లలకు మంచిచెడు, పద్ధతులు చెప్పే తీరిక ఉండదు. పిల్లలకు చదువుతోపాటు సంస్కారం కూడా ఇక్కడే నేర్పాలి. టెన్‌‌త పరీక్షలో మా పిల్లలందరూ ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. కొందరు ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా వెళ్లారు. నాకు పిల్లల్లేరు, మా స్కూల్లో చదువుతున్న 550 మంది నా పిల్లలే’’ అంటారామె.

 గుర్తించారనడానికి ఓ సంకేతం!
 యుధ్‌వీర్ స్మారక అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగానే కాదు గర్వంగా కూడా ఉందంటారు సురయ్యా. ‘‘ఇది చేనేతకు నేను చేసిన శ్రమకు గుర్తింపు. నాకు తోచినట్లు, నాకు నచ్చినట్లు చేస్తూ వచ్చాను. సమాజం గుర్తించింది అనడానికి ఇది ఓ సంకేతం అంతే. మా వారు అరబిందో బోస్... సుభాష్ చంద్రబోస్ పెద్దన్నయ్య కొడుకు. ఆయన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ ప్రెసిడెంట్‌గా దేశంలో ఎక్కడ కార్మికుల హక్కులకు భంగం వాటిల్లినా అక్కడ ఉండేవారు. ఆయన సేవలు ఉత్తరాదిలోనే ఎక్కువగా ఉండేవి. నా పరిశ్రమ దక్షిణాదిలో విస్తరించింది. ఆయన బెంగాలీగా ఉత్తరాది రుణం తీర్చుకున్నారు, నేను హైదరాబాదీగా దక్షిణాదిలో పనిచేస్తున్నాను’’ అంటారు.

 చెట్టు మీది కాయ - సముద్రంలో ఉప్పు!
 తోటమాలికి మామిడి చెట్టును పెంచి కాయను కోయడమే తెలుస్తుంది. సముద్రతీరంలో ఉప్పు పండించే వారికి ఉప్పు రాశులు పోయడమే తెలుసు. పొలం సాగు చేసే రైతు... మిరపనారు పోసి ఎర్రటి మిరపకాయల దిగుబడి సాధించడంలో నేర్పరి. ఈ మూడింటినీ తూకంగా కలిపి నోరూరించే ఆవకాయ చేసేది అమ్మ. సురయ్యాబోస్ చేయి కూడా అలాంటిదే. కాశ్మీరీ జమావరీ, పర్షియా హిమ్రూ, దక్షిణాది ఇకత్‌ను కలుపుతూ మన సంప్రదాయ రీతులను కాపాడుతున్నారు.
 - వాకా మంజులారెడ్డి, ఫొటోలు: ఎస్‌ఎస్ ఠాకూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement